కుట్రలు పటాపంచలు చేయాలి: కోదండరాం
సాక్షి, కొత్తగూడెం/భద్రాచలం : ఎలాంటి కోతలు లేకుండా సంపూర్ణ తెలంగాణ కావాలని, అలా తెచ్చే బాధ్యత తెలంగాణలోని కాంగ్రెస్ నేతలపై ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తగూడెం మండలం రుద్రంపూర్ గ్రామంలో స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమరవీరుల స్మారక స్థూపాన్ని కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణను అడ్డుకునేందుకే కుట్రలు జరుగుతున్నాయని, వాటిని పటాపంచలు చేసేందుకు ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే తారకరామారావు మాట్లాడుతూ, ఈనెల 12న కేంద్ర మంత్రివర్గాన్ని కలిసే సందర్భంలో సింగరేణిపై హక్కులు, భద్రాచలం, బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపన వంటి అంశాలు టీఆర్‌ఎస్ నివేదిస్తుందన్నారు. సమన్యాయం అంటే ఏమిటో టీడీపీ నేత చంద్రబాబు చెప్పరని, ఆయన మానసిక పరిస్థితి సరిగ్గాలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.
భద్రాచలం తెలంగాణ ఆత్మ
భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనని, ఎట్టి పరిస్థితులలోనూ సీమాంధ్రకు వదిలే పరిస్థితి లేదని కోదండరాం తేల్చి చెప్పారు. ‘భద్రాచలం తెలంగాణలో అంతార్భాగం’ అనే అంశంపై టీజేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో జరిగిన చర్చా వేదికకు హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. భద్రాచలానికి భౌగోళికంగా, సంస్కృతీ, పరిపాలనా పరంగా ఏన్నో ఏళ్ల నుంచి తెలంగాణతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. కేవలం పోలవరం నిర్మాణం కోసమే నాయకులు భద్రాచలాన్ని ఆంధ్రలో కలపాలని అడగటం వారి స్వార్థపూరిత ఆలోచన అని విమర్శించారు. ముంపుతో ఆదివాసులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.