న్యూ రిలీజెస్: గాంధీ మునుపటి జీవితం
Gandhi Before India
తెల్లవాళ్లను తరిమికొట్టడానికి గాంధీజీ సాగించిన సుదీర్ఘపోరాటం గురించి వేలకొద్దీ పుటలూ వందలకొద్దీ పుస్తకాలూ దొరుకుతాయి. లోగుట్టూ, దాపరికమూ లేని ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆయన సిద్ధాంతంతో విభేదించినవారు ఉన్నారుగాని ఆయన జీవన ధోరణిని ఆయన సచ్చీలతనీ వేలెత్తి చూపడానికి సాహసించరు. అయితే రవి అస్తమించని ఒక సామ్రాజ్యాన్ని ఉత్త చేతులతో పెళ్లగించాలనే గాంధీజీ సంకల్పానికి మూలమెక్కడ? అది ఎక్కడ రూపం దిద్దుకుంది? ఆ దృష్టి, ఉక్కు మనస్తత్వం ఎక్కడ అబ్బాయి? అవన్నీ లండన్‌లో చదువుకున్నప్పుడు, రెండు దశాబ్దాల పాటు దక్షిణాఫ్రికాలో బారిస్టర్‌గా ఉన్నప్పుడు గాంధీజీ అలవర్చుకున్నారని అంటారు రామచంద్రగుహ.
మేధావిగా, భిన్నమైన ఆలోచనాపరుడిగా గుర్తింపు పొందిన రామచంద్రగుహ అనేక పాత డాక్యుమెంట్లు, విదేశాల్లో లభిస్తున్న లేఖలు ఆధారంగా ‘గాంధీ బిఫోర్ ఇండియా’ పేరుతో గాంధీజీ బయోగ్రఫీ రాశారు. గాంధీజీ లండన్, దక్షిణాఫ్రికాలో ఉండటం వల్లే ఆయనకు సామ్రాజ్యవాదం, జాత్యహంకారంల విశ్వరూపం అర్థైమైంది. ఈ రెంటి శృంఖలాలతో బందీ అయిన భారతదేశాన్ని ఎలాగైనా చెర నుంచి విముక్తి చేయాలని ఇక్కడకు వచ్చే సమయానికి దృఢ సంకల్పంతో ఉన్నారని రచయిత అభిప్రాయ పడతారు. కొత్తతరాలు గాంధీని ఆచరించాలని కోరుకోవడం అత్యాశ. దేశం బాగు కోసం ఆలోచిస్తారా? అనేది అనుమానమే. కాని తమ సంస్కారాన్ని కాస్తయినా సరిదిద్దుకోవడానికి ఇలాంటి రచనలే కదా దిక్కు.
పెంగ్విన్ ప్రచురణ; 688 పేజీలు; వెల: రూ. 899
సాహిత్య డైరీ... దాశరథి కవితా సమాలోచన
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని తెలంగాణ వారసత్వాన్ని శ్లాఘించిన మహాకవి దాశరథి కవితా సమాలోచన నవంబర్ 5, 6 తేదీల్లో రెండు రోజులపాటు హైదరాబాద్ తెలుగు యూని వర్సిటీ ప్రాంగణంలో జరగనుంది. కవులు, రచయితలు, విమర్శకులు ఎందరో పాల్గొని దాశరథి కవితా విశిష్టత గురించి పత్రాలు సమర్పిస్తారు. అందరికీ ఇదే ఆహ్వానం. వివరాలకు జలంధర్ రెడ్డి: 98482 92715
సాహిత్యం పేజీకి రచనలు అందవలసిన చిరునామా
ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్,
సాక్షి టవర్స్, హైదరాబాద్- 500034