ఎన్‌క్లోజర్‌లో గణేశ్ నిమజ్జనం
♦ హుస్సేన్‌సాగర్ మొత్తం కలుషితం కాకుండా చూడాలని హైకోర్టు సూచన
♦ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి తమ ముందుంచాలని టీ సర్కార్, జీహెచ్ఎంసీలకు ఆదేశం
♦ విచారణ ఆరు వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు పలు సూచనలు చేసింది. వచ్చే ఏడాది నుంచి హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు స్పష్టం చేసింది. సాగర్ మొత్తం కలుషితం కాకుండా ఉండేలా నిర్దిష్టంగా ఒక చోట నిమజ్జనానికి ఏర్పాట్లు చేసి, దాని చుట్టూ ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి తమ ముందుంచాలని ఆదేశించింది. దీనికి ఆరు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
గణేశ్ విగ్రహాల నిమజ్జనం ద్వారా నీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు తీర్పును అధికారులు అమలు చేయడం లేదంటూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం దాన్ని విచారించింది. నిమజ్జనం అయిన 24 గంటల్లోపు విగ్రహాలను, చెత్తాచెదారాన్ని సాగర్ నుంచి తొలగిస్తున్నామని, ఇందుకు పలు శాఖల సహకారం తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి కోర్టుకు అఫిడవిట్ అందజేశారు. సాగర్ కలుషితం కాకుండా తీసుకునే చర్యలపై ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు.