ఈ ఏడాది 30 శాతం డివిడెండ్ చెల్లించండి
న్యూఢిల్లీ: లాభాల్లో ఉన్న అన్ని ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) చమురు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2013-14) కనీసం 30 శాతం డివిడెండ్ చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ కోరింది. ఈక్విటీపై 20 శాతం కనీస డివిడెండ్ లేదా పన్ను అనంతరం లాభంపై 20 శాతం కనీస డివిడెండ్... ఏది ఎక్కువైతే అంత మొత్తాన్ని లాభాల్లో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుతం చెల్లిస్తున్నాయి.
అయితే చమురు సహజవాయువుల సంస్థ (ఓఎన్జీసీ), ఇండియన్ ఆయిల్, గెయిల్ ఇండియాసహా చమురు రంగంలోని 14 ప్రభుత్వ రంగ సంస్థలు కనీసం 30 శాతం డివిడెండ్ చెల్లించాలని ఆర్థిక శాఖ కోరుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఓఎన్జీసీ, గెయిల్ ఇండియా, ఆయిల్ ఇండియాలు గత కొన్నేళ్లుగా 30 శాతం డివిడెండ్‌ను చెల్లిస్తున్నాయి. అధిక లాభాలు, లేదా భారీ నగదు నిల్వలు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కొంత అధిక లేదా ప్రత్యేక డివిడెండ్‌ను కోరే అంశాన్ని సైతం ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సబ్సిడీలు, ద్రవ్యలోటు భారాలను అధిగమించేబాటలో లాభాల్లో ఉన్న కంపెనీల నుంచి కనీస డివిడెండ్లు ఉండాలని ఆర్థికశాఖ భావిస్తోంది.