గల్లంతైన వ్యక్తి..సురక్షితం
ఖమ్మం: దైవదర్శనానికి వచ్చిన వ్యక్తి గోదావరిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన పడవల వాళ్లు ఆ వ్యక్తిని కాపాడిన సంఘటన జిల్లాలోని భద్రాచలం స్నానాల ఘాట్వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం తిమ్మనకుంట గ్రామానికి చెందిన గున్నె రామిరెడ్డి(60) దైవ దర్శనానికి వచ్చాడు. ఈ క్రమంలో గోదావరిలోని స్నానాల ఘాట్ వద్ద స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ కాలుజారి నదిలో కొట్టుకుపోయాడు. పక్కనే ఉన్న పడవల వాళ్లు అప్రమత్తమవడంతో ఆయన ప్రాణాలు కాపాడగలిగారు. నిన్నటి వరకు ఉధృతంగా ప్రవహించిన గోదావరి.. వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో ఈ రోజు కాస్త శాంతించింది. ప్రస్తుంతం గోదావరి నీటిమట్టం 35 అడుగులు ఉంది.