టీడీపీ గోబెల్స్ ప్రచారం సిగ్గుచేటు
వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పోలీసులతో కుమ్మక్కు కాలేదు
మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ
వసంత నాగేశ్వరరావుపై ఎంతో గౌరవం ఉంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోనేరు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పోలీసులతో కుమ్మక్కయ్యారని టీడీపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేయటం సిగ్గుమాలిన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ప్రతి విషయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని టీడీపీ పనిగట్టుకొని ప్రచారం చేస్తుందని ఇవన్నీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కోసం అనుసరిస్తున్న చిల్లర వ్యూహాలని విమర్శించారు.
శనివారం ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ మైలవరం నియోజకవర్గ అభ్యర్థి జోగి రమేష్తో కలసి మాట్లాడారు. పోలీసులు, వైఎస్సార్సీపీతో కుమ్మక్కు కాలేదని, వారు ఇతర రాజకీయపార్టీల కంటే ఎక్కువగా వైఎస్సార్ సీపీనే టార్గెట్ చేస్తున్నారనే విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. పోలీసులు తరచూ ఎవరి వాహనాలను తనిఖీలు చేస్తున్నారో... అక్కడక్కడ ఏ పార్టీ కార్యకర్తల్ని అరె స్టు చేస్తున్నారనేది జగమెరిగిన సత్యమని తెలిపారు.
ప్రతి విషయాన్నీ మాపై రుద్ది మీరు ఒప్పుకోవాలి అనేరీతిలో టీడీపీ నేతలు నిసిగ్గుగా ప్రచారానికి దిగడం పనికి మాలిన చర్య అని మండిపడ్డారు. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావుతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని, తాను జిల్లాలకు వస్తున్నప్పుడు కూడా ఆయనే నందిగామలో తనకు స్వాగతం పలికారని వివరించారు. ఆయనతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని, తనకంటే ఆయన చాలా సీనియర్ అని వారి కుటుంబంతోనూ పరిచయాలున్నాయని చెప్పారు.
కృష్ణప్రసాద్ అరెస్ట్ వ్యవహరం తనకు ఏమాత్రం తెలియదని వివరించారు. కృష్ణప్రసాద్ అరెస్టు దురదృష్టకరమని వాఖ్యానించారు. టీడీపీ నేతలు ఏది పడితే అది మాట్లాడటం సరికాదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన వ్యక్తులని, అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. పార్టీ నాయకులు నరహరశెట్టి శ్రీహరి, కొల్లి గంగాధరరావు, ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు.