
వైఎస్సార్ జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి అదే నిజమని ప్రచారం చేసే పాల్ జోసెల్ గోబెల్(హిట్లర్ సహచరుడు)కు శిష్యుడిలా తయారయ్యాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సి రామచంద్రయ్య విమర్శించారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధి పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. అధికారులు సహకారం లేనిదే గతంలో పాలించిన నాయకులు ఎలా అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చేతగానితనాన్ని అధికారులపై తోయడం ఎంత వరకు సమంజసం అన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పై రోజుకో ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పక్క రాష్ట్రంలో అడ్డంగా దొరకడంతో కేంద్రాన్ని గట్టిగా అడగలేకున్నాడని, ఇదే మన రాష్ట్రంలో అభివృద్ధి జరగక పోవడానికి ప్రధాన కారణమని విమర్శించారు. మంత్రిగా, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా, పార్లమెంటరీ సంఘాల్లో పనిచేసిన తనకు గన్ మెన్లను తీసేశారని, సర్పంచ్‌గా కూడా గెలవలేని టీడీపీ నేతలకు మాత్రం గన్ మెన్లను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.