గూగుల్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆన్లైన్ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా గూగుల్ నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ చెప్పారు.
నెక్సస్ 6 స్మార్ట్ఫోన్లు (32 జీబీ ధర రూ.43,999, 64 జీబీ ధర రూ.48,999) ఫ్లిప్‌కార్ట్ ద్వారా పొందవచ్చని ఆనందన్ తెలిపారు. ఈ జీఓఎస్ఎఫ్లో నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్‌తో పాటు డిజిటల్ మీడియా ప్లేయర్, క్రోమ్‌కాస్ట్‌ను (ధర రూ. 2,999) కూడా అందిస్తున్నామని, అంతేకాకుండా లెనొవొ, ఏషియన్ పెయింట్స్, టాటా హౌసింగ్, వాన్హ్యూసెన్ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.
క్రోమ్‌కాస్ట్‌ను భారతీ ఎయిర్టెల్ భాగస్వామ్యంతో స్నాప్‌డీల్ ద్వారా అందిస్తున్నామని ఆనందన్ పేర్కొన్నారు. జీఓఎస్ఎఫ్ను 2012లో తొలిసారిగా ప్రారంభించామని, అప్పుడు 90 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయని, ఇప్పుడు ఈ వ్యాపార సంస్థల సంఖ్య 450కు పెరిగిందని తెలిపారు. భారత్‌లో ఆన్లైన్ షాపింగ్ జోరుగా సాగుతోందని ఆయన చెప్పారు. 2016కల్లా ఆన్లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య 10 కోట్లకు పెరుగుతుందని ఆనందన్ పేర్కొన్నారు.