gopala mitra
-
గోపాల.. గోపాల
గ్రామీణ ప్రాంతాల్లో పాడిపశువులకు చికిత్సలు చేయడంలో గోపాలమిత్రలదే కీలక పాత్ర. పశు సంపదను వృద్ధి చేయడంలోనూ వారు రైతులకు అండగా నిలుస్తున్నారు. కానీ వారి గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చాలీచాలని వేతనంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ చేయలేక అర్ధాకలితో బాధపడుతున్నారు. గొడ్డు చాకిరి చేస్తున్నా.. వారికి ప్రతిఫలం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌రూరల్:ఉమ్మడి మెదక్ జిల్లాలో 120 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భాదారణతో పాటు పలు రకాల వ్యాధులకు చికిత్స చేసి పశు సంపదను కాపాడేందుకు 2001లో ప్రభుత్వం గోపాల మిత్రల నియామకాలను చేపట్టారు. కానీ వేతనాలను చెల్లించలేదు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలో పశుసంవర్థక శాఖలో ఉచితంగా పనిచేస్తున్న గోపాల మిత్రలకు వేతనాలను అందించారు. 2009 రూ. 2వేలు ఉన్న వేతనాలు 2012లో రూ. 3500 పెంచారు. ఆ తరువాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వారి వేతనాలను పెంచలేదు. కుటుంబ పోషణ బరువై అర్ధాకలితో అలమటిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. అయినా వారి గోడును పట్టించుకున్న దాఖలాలు లేవు. వారు చేసే పని.. పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం, రైతు ఇంటికి వెళ్లి యద సూది ఇవ్వడం, వ్యాక్సినేషన్, ప్రథమ చికిత్సలు వంటివి చేస్తారు. గొర్రెలకు టీకాలు, చికిత్సలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. దేశవాలి పశువుల ద్వారా మేలైన దూడలకు పురుడు పోయడం, ఆవులు, గేదెలు ఎదకు వచ్చిన సమయంలో సంకర జాతి పశువుల వీర్యకణాలను లోకల్ పశువుల గర్భంలో ప్రవేశపెడుతారు. పశుగణాభివృద్ధి సంస్థ నిర్వహించే ప్రతి పనిలో గోపాలమిత్రల పాత్ర కీలకంగా ఉంటుంది. 18 ఏళ్లుగా వెట్టిచాకిరీ 18 ఏళ్ళ నుంచి వెట్టి చాకిరీ చేస్తున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. గౌరవ వేతనం కింద రూ.3,500 ఇస్తున్నారని, వాటిలో 100 వీర్యనాలికలకు కొనాలంటే ఒక్కోదానికి రూ. 40 చొప్పున మొత్తం రూ. 4వేలను తెలంగాణ స్టేట్ సైవ్స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెల్లించాలి. కనీస వేతనం రూ. 16,400 చెల్లించాలని, అర్హత ఉన్నవారికి వెటర్నరీ అసిట్టెంట్ పోస్టును ఇవ్వాలని, లేనివారికి అటెండర్‌గా 50 శాతం అవకాశం కల్పించడంతో పాటు రూ.5లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలనే డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
67 మంది గోపాలమిత్రల తొలగింపు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ– డీఎల్‌డీఏ)లో పనిచేస్తున్న 67 మంది గోపాలమిత్రలను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ మేరకు ఏపీఎల్డీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) డాక్టర్ పీడీ కొండలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 75 మంది గోపాలమిత్రలను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఈ నెల 20న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా 67 మందిని తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై సీఈవో కొండలరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ విధుల్లో చేరకపోతే తొలగిస్తామని గోపాలమిత్రలను హెచ్చరించినా వారిలో స్పందనలేదని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో వారిని తీసివేయాల్సి వచ్చిందని వివరిచారు. త్వరలోనే కొత్తగా గోపాలమిత్రల నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
గోపాల మిత్రలకు అండగా ఉంటాం
ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం రూరల్ : కరువు జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న గోపాలమిత్రలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు. కలెక్టరేట్ ఎదుట 15 రోజులుగా గోపాల మిత్రలు చేస్తున్న దీక్షలకు సోమవారం ఆయన మద్దతు తెలిపారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగమని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఈ రెండేళ్ల టీడీపీ పాలనలో 1.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా.. ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగాలలో పని చేస్తున్న 40 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వ్యాక్సినేటర్లు, పశుమిత్రుల నియామకాల పేరుతో 16ఏళ్లుగా నిస్వార్థంగా పాడిరైతులకు సేవలు అందిస్తున్న గోపాల మిత్రలను తొలగించేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించే విధంగా ఒక్కో పాడి రైతుకు రూ.2లక్షల చొప్పున రుణాలు అందజేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాల మిత్రులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డితోపాటు పెద్ద ఎత్తున రైతులు గోపాల మిత్రలు పాల్గొన్నారు. అంధుల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి : 2014 డీఎస్సీ నోటిఫికేషన్లో ఖాళీగా ఉన్న అంధుల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట విభిన్న ప్రతిభావంతులు చేపట్టిన ధర్నాకు మద్దతు ప్రకటించారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2014 నోటిఫికేషన్లో జిల్లా వ్యాప్తంగా 30 అంధ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా క్వాలిఫై మార్కుల పేరిట కేవలం 9పోస్టులను మాత్రమే భర్తీ చేసి మిగిలిన పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
'గోపాల మిత్రలకు కనీస వేతనం ఇవ్వాలి'
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ గోపాల మిత్రుల సంఘం సభ్యులు గురువారం రిలే నిరాహార దీక్షలకు దిగారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.13,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాద భీమా పథకాన్ని గోపాల మిత్రలకు వర్తింపజేయాలని కోరారు. పశుసంవర్థక శాఖలో పనిచేసే గోపాల మిత్రలకు విద్యార్హతల ఆధారంగా ఆఫీసు సబార్డినేట్ లుగా నియమించాలని నినదించారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘం సభ్యులకు సంఘీభావం తెలిపారు.