పాడి పశువులకు చికిత్సలు చేస్తున్న గోపాల మిత్రలు
గ్రామీణ ప్రాంతాల్లో పాడిపశువులకు చికిత్సలు చేయడంలో గోపాలమిత్రలదే కీలక పాత్ర. పశు సంపదను వృద్ధి చేయడంలోనూ వారు రైతులకు అండగా నిలుస్తున్నారు. కానీ వారి గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చాలీచాలని వేతనంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ చేయలేక అర్ధాకలితో బాధపడుతున్నారు. గొడ్డు చాకిరి చేస్తున్నా.. వారికి ప్రతిఫలం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్‌రూరల్:ఉమ్మడి మెదక్ జిల్లాలో 120 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భాదారణతో పాటు పలు రకాల వ్యాధులకు చికిత్స చేసి పశు సంపదను కాపాడేందుకు 2001లో ప్రభుత్వం గోపాల మిత్రల నియామకాలను చేపట్టారు. కానీ వేతనాలను చెల్లించలేదు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలో పశుసంవర్థక శాఖలో ఉచితంగా పనిచేస్తున్న గోపాల మిత్రలకు వేతనాలను అందించారు. 2009 రూ. 2వేలు ఉన్న వేతనాలు 2012లో రూ. 3500 పెంచారు. ఆ తరువాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వారి వేతనాలను పెంచలేదు. కుటుంబ పోషణ బరువై అర్ధాకలితో అలమటిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. అయినా వారి గోడును పట్టించుకున్న దాఖలాలు లేవు.
వారు చేసే పని..
పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం, రైతు ఇంటికి వెళ్లి యద సూది ఇవ్వడం, వ్యాక్సినేషన్, ప్రథమ చికిత్సలు వంటివి చేస్తారు. గొర్రెలకు టీకాలు, చికిత్సలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. దేశవాలి పశువుల ద్వారా మేలైన దూడలకు పురుడు పోయడం, ఆవులు, గేదెలు ఎదకు వచ్చిన సమయంలో సంకర జాతి పశువుల వీర్యకణాలను లోకల్ పశువుల గర్భంలో ప్రవేశపెడుతారు. పశుగణాభివృద్ధి సంస్థ నిర్వహించే ప్రతి పనిలో గోపాలమిత్రల పాత్ర కీలకంగా ఉంటుంది.
18 ఏళ్లుగా వెట్టిచాకిరీ
18 ఏళ్ళ నుంచి వెట్టి చాకిరీ చేస్తున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. గౌరవ వేతనం కింద రూ.3,500 ఇస్తున్నారని, వాటిలో 100 వీర్యనాలికలకు కొనాలంటే ఒక్కోదానికి రూ. 40 చొప్పున మొత్తం రూ. 4వేలను తెలంగాణ స్టేట్ సైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి చెల్లించాలి. కనీస వేతనం రూ. 16,400 చెల్లించాలని, అర్హత ఉన్నవారికి వెటర్నరీ అసిట్టెంట్ పోస్టును ఇవ్వాలని, లేనివారికి అటెండర్‌గా 50 శాతం అవకాశం కల్పించడంతో పాటు రూ.5లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలనే డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment