గోపాల మిత్రలకు అండగా ఉంటాం
గోపాల మిత్రలకు అండగా ఉంటాం
Published Tue, Jul 26 2016 2:05 AM | Last Updated on Tue, May 29 2018 3:36 PM
ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం రూరల్ : కరువు జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న గోపాలమిత్రలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు. కలెక్టరేట్ ఎదుట 15 రోజులుగా గోపాల మిత్రలు చేస్తున్న దీక్షలకు సోమవారం ఆయన మద్దతు తెలిపారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగమని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఈ రెండేళ్ల టీడీపీ పాలనలో 1.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా.. ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగాలలో పని చేస్తున్న 40 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వ్యాక్సినేటర్లు, పశుమిత్రుల నియామకాల పేరుతో 16ఏళ్లుగా నిస్వార్థంగా పాడిరైతులకు సేవలు అందిస్తున్న గోపాల మిత్రలను తొలగించేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించే విధంగా ఒక్కో పాడి రైతుకు రూ.2లక్షల చొప్పున రుణాలు అందజేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాల మిత్రులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డితోపాటు పెద్ద ఎత్తున రైతులు గోపాల మిత్రలు పాల్గొన్నారు.
అంధుల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి :
2014 డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఖాళీగా ఉన్న అంధుల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట విభిన్న ప్రతిభావంతులు చేపట్టిన ధర్నాకు మద్దతు ప్రకటించారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2014 నోటిఫికేషన్‌లో జిల్లా వ్యాప్తంగా 30 అంధ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా క్వాలిఫై మార్కుల పేరిట కేవలం 9పోస్టులను మాత్రమే భర్తీ చేసి మిగిలిన పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement