నకిలీ నోట్లపై విచారణ జరుపుతాం: కేంద్రం
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని ఎస్బీఐ ఏటీఎంలో రూ.2000 నకిలీ నోట్లు వస్తున్నాయన్న విషయంపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ మీడియాకు తెలిపారు. నకిలీ కరెన్సీ చలామణిని ఆపడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.2000 నకిలీ నోట్లు వచ్చాయని పత్రికల్లో వార్తలు వచ్చిన దరిమిలా ఆయన స్పందించారు. ‘ప్రభుత్వం నకిలీ కరెన్సీని అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. కొంత మంది దేశంలో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో పూర్తి స్థాయి విచారణ తర్వాతే వెల్లడించగలం’ అని మంత్రి తెలిపారు.
మరోవైపు తమ ఏటీఎంల నుంచి దొంగ నోట్లు రావడమన్నది చాలా అరుదని, నగదు క్వాలిటీని పరిరక్షించడంలో ఎంతో బలమైన వ్యవస్థ ఎస్బీఐ సొంతమని బ్యాంకు తెలిపింది. నగదును ఏటీఎంలకు తరలించిన వ్యక్తులపై విచారణ కొనసాగుతుందని ప్రకటించింది. ఎస్బీఐలో ఉండే సరికొత్త మెషిన్లు నోట్లలో చిన్నపాటి లోపాలున్నా పట్టేస్తాయనీ, అందువల్ల బ్యాంకు బ్రాంచీల్లో కానీ, ఏటీఎంల్లో కానీ నకిలీ నోట్లు వచ్చే అవకాశం లేదని స్టేట్ బ్యాంక్ స్పష్టం చేసింది.