‘గజినీ’ బాబు
* ఎన్నికల వాగ్దానాలు మరిచిపోయారు
* డిసెంబర్ 5న మహాధర్నాకు తరలిరావాలి
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి
గుమ్మలక్ష్మీపురం,కురుపాం: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అమలు సాధ్యం కాని వాగ్దానాలిచ్చి, గెలుపొందిన అనంతరం వాగ్దానాలు మరిచి పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గజినీ బాబులా ప్రజలను దగాచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. గుమ్మలక్ష్మీపురం,కురుపాంలలో శుక్రవారం జరిగిన ఆయా మండలాల విస్తృతస్థాయి సమావేశాల్లో వీరభద్రస్వామి మాట్లాడారు.
గుమ్మలక్ష్మీపురంలోని బీఎస్ఆర్ కళింగ వైశ్య కల్యాణమండపంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హజరైన కోలగట్ల మాట్లాడుతూ ఎన్ని అబద్ధాలు చెప్పినా అమాయక ప్రజలు నమ్ముతారన్న కుటిల బుద్ధితో ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేశారని, ఇచ్చిన హమీలు నెరవేర్చుతారని నమ్మి ఓటువేసిన ప్రజలకు రోజుకో కమిటీల పేరిట,కొత్త వాగ్దానాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో సాలూరు,కురుపాం ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణిలు డిమాండ్ చేయగా, గిరిజన యూనివర్సిటీ మంజూరుకు హమీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పి పక్కజిల్లాకు కేటాయించారని విమర్శించారు.
ఈ ఆరునెలల్లో చంద్రబాబు పాలన చూసిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి, సంక్షేమ పథకాలు మావేనంటూ బాబు గంతులేస్తున్నారని ఆరోపించారు. ఆర్థికంగా బలపడడానికి, ఆస్తులు కూడబెట్టుకోడానికి చ ంద్రబా బు నాయుడు ఏడాదిలో నాలుగు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న అధికార పార్టీ ఆగడాలపై ప్రజల తరఫున ఉద్యమించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముందుకురావాలని కోరారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 5వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో చేపట్టబోయే మహాధర్నా కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు,నాయకులు,అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
అనంతరం కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతోందని ఆరోపించారు. గిరిజన ప్రాంతానికి పెద్దదిక్కుగా ఉండాల్సిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఓటువేసి గెలిపించిన ప్రజలు,కార్యకర్తలను కాదని సొంతలాభాల కోసం గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారని, అటువంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు 18 కమిటీలను ఏర్పాటు చేసి, నాయకత్వ లక్షణాలపై వారికిశిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
సమావేశంలో కురుపాం నియోజకవర్గం సమన్వయ కర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్ రాజు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు శ్రీరాములు నాయుడు,సింగుబాబు,సీహెచ్ వెంకటరమణ, కుంబురుక దీనమయ్య, గోరిశెట్టి గిరిబాబు, నిమ్మక సింహాచలం,శేఖర్,పి.మహేష్, తోయక గోపాల్ రెల్ల,దుడ్డుఖల్లు,చెముడుగూడ,తాడికొండ ఎంపీటీసీలు బి.లక్ష్మి, ఎన్.నీలావతి,గంగాసీ, భాస్కరరావు, రెల్ల ఉప సర్పంచ్ కె.నాగేశ్వరరావు, అడ్డాకుల చిన్నారావు,తోయక మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
అధికార పార్టీకి భయపడేది లేదు ..
కురుపాం: మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన అధికార పార్టీకి భయపడేది లేదని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే అదే ప్రజల అండతో ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయక్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు అధ్యక్షతన కురుపాంలో జరిగిన సమావేశంలో కోలగట్ల మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల అండతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు, మహిళలు, రైతులు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నైజాన్ని గుర్తించారన్నారు.
గిరిజన యూనివర్సిటీ జిల్లాకు వచ్చేవరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. అనంతరం కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ఆర్ పాద యాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని మంచి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అవన్నీ అమలు చేసి నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం పార్లమెంటరీ పరీశీలికులు బెల్లాన చంద్రశేఖర్, కురుపాం నియోజకవర్గం సమన్వయకర్త చంద్రశేఖరరాజు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సింగుబాబు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు పీరుబండి జైహింద్ కుమార్, విజయనగరం మాజీ ఏఎసీ చైర్మన్ శ్రీరాములు నాయుడు, పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడులు కార్యక్రమంలో మాట్లాడారు.
కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్ చనమల్లు వెంకటరమణ, కురుపాం మండలాధ్యక్షురాలు ఆనిమి ఇందిరాకుమారి, జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి పద్మావతి, వైస్ ఎంపీపీ వి.కృష్ణ, ఎంపీటీసీ సభ్యులు , నాయుకులు ఆకుల శ్రీధర్, శెట్టినాగేశ్వరరావు, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, ఆనిమి కైలాసరావు, ఎస్సీసెల్ అధ్యక్షుడు వెంకటరావు, జి.వి.శ్రీనివాసరావుతోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు,పాల్గొన్నారు.