గ్రోత్ కారిడార్‌లో ఇష్టరీతిన అనుమతులు
పటాన్చెరు : ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ రింగ్ రోడ్డుకు సమానంగా ఉన్న వెయ్యి మీటర్ల విస్తీర్ణం వరకు గ్రోత్ కారిడార్ పేరిట హెచ్ఎండీ అధికారులు అభివృద్ధి కోసం కేటాయించారు. గ్రోత్ కారిడార్ పరిధిలో 600 గజాల కంటే తక్కువ ప్లాట్‌లో నిర్మాణాలకు అవకాశం లేదు. హెచ్ఎండీఎ నిబంధనల మేరకు గ్రోత్ కారిడార్ల పరిధిలో బహుళ అంతస్తులు, ఆకాశహ ర్మ్యాలు నిర్మించేందుకు మాత్రమే అనుమతి ఉంది.
హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్‌లో హెచ్ఎండీఏ నిబంధనల మేరకు నిర్మాణాలు జరగాలి. కానీ పంచాయతీ కార్యద ర్శి నిర్లక్ష్యం కారణంగా గ్రోత్ కారిడార్‌లో నిబంధనలకు విరుద్ధంగా భవంతుల నిర్మాణాలు సాగుతున్నాయి. ముఖ్యంగా పటాన్చెరు మండలం ముత్తంగి జంక్షన్ వద్ద అక్రమ నిర్మాణాలు సాగుతున్నా.. ఆ గ్రామ కార్యదర్శి పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా ఓఆర్ఆర్ జంక్షన్ల వద్ద రాకపోకలకు ఇబ్బందిగా పరిణమించడమే కాకుండా ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది.
ముత్తంగి ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద ఉన్న దుకాణ సముదాయాల్లో దాబాలు, హోటళ్లు, లాడ్జింగ్‌లు వెలిశాయి. వీటి ముందు జాతీయ రహదారిపై కూడా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. ఎంతో దూరద ృష్టితో గ్రోత్ కారిడార్‌ను అందంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో హెచ్ఎండీఎ అధికారుల ప్రణాళికల లక్ష్యాలు క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా దెబ్బతింటున్నాయి. అదే విషయమై స్థానిక ఈఓపీఆర్డీ దేవదాస్ వివరణ కోరగా కార్యదర్శులకు హెచ్ఎండీఏ నిబంధనలపై అవగాహన కల్పిస్తోందన్నారు. నిబంధనలు పట్టించుకోని కార్యదర్శులకు చర్యలు తీసుకుంటామన్నారు.