gunjala gondu language
-
గోండి లిపిని గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ గుంజాల గోండి లిపిని భారత ప్రభుత్వం గుర్తించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆద్య కళా మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిసి తాము సేకరించిన ఆదివాసీ కళాఖండాలను సంరక్షించడంతోపాటు సాహిత్య రంగాల్లో రాణిస్తున్న ఆదివాసులకు తగు గౌరవం కల్పించేలా చొరవ తీసుకోవాలని జయదీర్ రాష్ట్రపతికి కోరారు. -
గుంజాల గోండి లిపిని బతికించండి
నేషనల్ మానుస్క్రిప్ట్ మిషన్ (న్యూఢిల్లీ), ఆంధ్రప్రదేశ్ రాతప్రతుల గ్రంథాలయం, పరిశోధనాలయం కలిసి 2006లో జాతీయ స్థాయిలో రాతప్రతుల సర్వే జరి పారు. ఆ సందర్భంగా గుంజాల గ్రామంలో కొన్ని గోండి రాతప్రతులు బయటపడ్డాయి. ఈ రాతప్రతులు గోండి ప్రజల లిపిగా అప్పుడు తెలియరాలేదు. 2010లో మాత్రమే ఆనాటి సర్వేకి కోఆర్డినేటర్‌గా పనిచేసిన ఆచార్య జయధీర్ తిరుమలరావు ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని గుంజాల గ్రామానికి వెళ్ళి వాటిని పరిశీలించిన తర్వాతే ఈ లిపి ప్రత్యేకత, విశిష్టత లోకానికి తెలియవచ్చింది. అప్పటి నుండి ఈ లిపిని చదివేవారి సంఖ్య ముగ్గురి నుండి 500 మందికి చేరింది.పెద్ద పెద్ద భాషలు, లిపులు అంతరించి పోతున్న వేళ ఒక ఆదివాసీ లిపి పునర్జీవించటం ఒక అద్భుతం. ఆదివాసీ భాషలకు లిపులు చాలా తక్కువ. కాని 8 రాష్ట్రాలలో గల గోండి భాషకు రెండు లిపులు ఉన్నట్లుగా తెలియవస్తుంది. అందులో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని రెండు లక్షల డెబ్భైవేల మంది గోండి ప్రజలకు సంబంధించిన ఈ ‘‘గుంజాల గోండి లిపి’’ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన లిపి అని నిపుణుల భావన. దీనికి హైదరాబాద్ విశ్వవిద్యాలయం, సిడాస్ట్ కేంద్రం వారి నిర్వహణలో ఈ లిపికి సాఫ్ట్వేర్ తయారుచేశారు. ఆ తరువాత ఈ లిపి ప్రపంచ లిపుల సరసన యునికోడ్ కన్సార్టియంలో చేరింది. ‘గుంజాల గోండి లిపి భాష అధ్యయన వేదిక’ నిర్వహణలో 2010 నుండి 2014 వరకు గుంజాల గ్రామం కేంద్రంగా ఎన్నో గోండి గూడెం లలో ఈ లిపిని నేర్పించారు. అలా గోండి భాషను బతికిస్తూ వచ్చారు. ఉట్నూరు ఐటిడిఏ వారు, యునివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, సిడాస్ట్ వారు 2014లో గోండి భాషలో గుంజాల గోండి లిపిలో మొదటి వాచకం ప్రచురించి చరిత్ర సృష్టించారు. 2017లో రెండవ వాచకం అచ్చువేశారు. ప్రస్తుతం మూడో వాచకం తయారీలో ఉంది. ఉట్నూరు ఐటిడిఏ వారు ఈ లిపిలో గోండి భాష నిఘంటువుని తయారు చేయడానికి అంగీకరించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్లుగా పనిచేసిన వారిని, ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్లుగా పనిచేసిన వారిని, గుంజాల గోండి లిపి అధ్యయన వేదికని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఈ సంప్రదాయం ఇక ముందు కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా కోరుతున్నాం. ఈ లిపి బోధిస్తున్న 15 మంది ఇన్స్ట్రక్టర్లకి అందాల్సిన నెలసరి జీతాన్ని వెంటనే అందించవలసిందిగా కోరుతున్నాం. -జయధీర్ తిరుమలరావు(గోండి లిపి అధ్యయన వేదిక) మొబైల్ : 9951942242 -
గుంజాల గోండు లిపి అభివృద్ధికి కృషి
నార్నూర్, న్యూస్‌లైన్ : గుంజాల గోండు భాష లిపి అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. సోమవా రం మండలంలోని గుంజాల గ్రామం లో గుంజాల గోండు భాష లిపి దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఐటీడీఏ పీవో జనార్దన్‌నివాస్‌తో కలిసి గుంజాల గోండు భాష లిపితో తయారు చేసిన మొదటి వాచకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరిశోధన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. లిపి ప్రతులను దాచిన పెద్దలను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తరతరాల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ఈ తరం యువతతోపాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శతాబ్దం నాటి గోండు భాషతో కూడిన లిపి ప్రతులను దాచి ఉంచడం సంతోషంగా ఉందన్నారు. గుంజాల గోండు లిపి సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం నుంచి వచ్చిందన్నారు. గుంజాల గోండు భాష లిపి అభివృద్ధి కోసం రూ.15 లక్షలతో రీసర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సెంటర్లో లిపిలో బోధించడానికి కో-ఆర్డినేటర్‌గా వినాయక్‌రావ్‌ను నియమిస్తున్నామని ప్రకటించారు. గోండు భాష లిపి అభివృద్ధి కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేస్తానన్నారు. అనంతరం గుంజాల గోండు భాష లిపి వెలికి తీసి తెలుగులో అనువాదం చేసిన ప్రొఫెసర్ జయదీర్ తిరుమల్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎన్నో భాషలకు లిపి ఉన్నా ఈ లిపికి ద్రావిడ భాషకు సంబంధం ఉందన్నారు. లిపితో కూడిన సాఫ్ట్‌వేర్‌ను సెంటర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీధర్‌బాబు తయారు చేయడం జరిగిందన్నారు. వచ్చే ఈ దినోత్సవం నాటికి గోండు భాషలో కథలు, వాచక పుస్తకాలు తయారు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లిపి రూపకర్తలు కొట్నాక్ జంగు, కుర్ర విఠల్‌రావ్, ఆరక జైవంతరావ్, కుర్ర లాల్‌షావ్, ఆత్రం కమలాబాయి, నాయకులు ఆర్జు, సీడం భీమ్, మెస్రం దుర్గు, కొవ లక్ష్మి, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి వేణుగోపాల్, సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు.