బాలకృష్ణ గన్మెన్ కుమారుడి ఆత్మహత్య
తిరుపతి : ఓ ప్రయివేట్ విద్యా సంస్థలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలూరులో విద్యాసంస్థ హాస్టల్ భవనంపై నుంచి దూకి పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా టీచర్ మందలించడం వల్లే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. కాగా మృతుడు సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గన్మెన్ మోహన్ కృష్ణ నాయక్ కుమారుడు. మృతదేహాన్ని స్విమ్స్ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
మరోవైపు తమ కుమారుడిని విద్యాసంస్థే పొట్టన పెట్టుకుందని సాయిచరణ్ తల్లిదండ్రులు ఆరోపించారు. మంత్రి నారాయణ అధికార బలంతో పేట్రేగిపోతున్నారని, సాయిచరణ్ మృతి విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచిందన్నారు. తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. స్కూల్ వద్దకు వెళ్లినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ విద్యాసంస్థ యాజమాన్యానికి శిక్ష పడేవరకూ పోరాటం చేస్తామని సాయిచరణ్ కుటుంబసభ్యులు తెలిపారు.