డోపింగ్‌లో పట్టుబడ్డ దీపా కర్మాకర్‌పై వేటు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత మెరికగా అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ డోపింగ్‌లో పట్టుబడింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఆమెపై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) 21 నెలల నిషేధం విధించింది. 2016లో ‘రియో’ విశ్వవేదికపై ప్రమాదకరమైన ‘ప్రొడునొవా’ విన్యాసంతో దీప ఆకట్టుకుంది. ప్రదర్శన ముగిసి ల్యాండింగ్ సమస్యతో త్రుటిలో ఆమె కాంస్య పతకాన్ని కోల్పోయి చివరకు నాలుగో స్థానంతో తృప్తి పడింది.
అయితే భారత విశ్లేషకులు, క్రీడాభిమానులంతా ఆమె ప్రదర్శనను ఆకాశానికెత్తారు. తదనంతరం గాయాల బెడదతో మరే మెగా ఈవెంట్లోనూ ఆమె పాల్గొనలేకపోయింది. నిజానికి 2021 అక్టోబర్‌లోనే ఆమె డోపింగ్‌లో పట్టుబడింది. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు బహిర్గతం చేశారు. అప్పటి నుంచి శిక్షాకాలం అమలు కావడంతో ఈ ఏడాది జూలై 10వ తేదీతోనే నిషేధం ముగుస్తుంది.