Hand ball championship
-
తెలంగాణకు కాంస్యం... విజేత హిమాచల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ టోర్నీలో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీ సెమీఫైనల్లో తెలంగాణ 9–16తో హిమాచల్‌ప్రదేశ్ జట్టు చేతిలో ఓడింది. ఫైనల్లో హిమాచల్‌ప్రదేశ్ 20–10తో రైల్వేస్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్ రావు, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
విజేత హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) అంతర్ జిల్లా అండర్–14 హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. బోయిన్‌పల్లిలోని సీఎంఆర్ హైస్కూల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 8–6తో రంగారెడ్డిపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ 9–8తో ఖమ్మంను ఓడించింది. బాలుర ఫైనల్లో కరీంనగర్ 17–16తో పెనాల్టీ షూటౌట్లో వరంగల్‌పై విజయం సాధించింది. మహబూబ్‌నగర్ 11–8తో ఆదిలాబాద్‌పై గెలుపొంది మూడోస్థానాన్ని దక్కించుకుంది. టోర్నీ ముగింపు కార్యక్రమంలో సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్, కార్యదర్శి సీహెచ్ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. -
అమ్మ కొడుకులు
బంజారాహిల్స్: అక్షరం అమ్మయింది.. ఆత్మవిశ్వాసం తోడయింది.. లక్ష్యంపై గురి పెట్టారు.. విజయం చేరువైంది.. ఆ పేదింట పదింతల ఆనందం వెల్లివిరిసింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి వాసంశెట్టి సాయి కిరణ్ ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో విజయం సాధించాడు. చాలామందిలో ఇతడూ ఒకడు అనుకోవద్దు.. ఈ కుర్రాడు జాతీయ హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు. అండర్–17 జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాడు. అంతేకాదు.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)లో ఉంటూ అంతర్జాతీయ పోటీలకు శిక్షణ పొందుతున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే ఇంకోవైపు క్రీడల్లో రాణిస్తున్నాడు. ఇతడి అన్న వాసంశెట్టి శ్రీనుబాబు మొన్నటి ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇతడు కూడాజాతీయ హ్యాండ్‌బాల్ క్రీడాకారుడే కావడంవిశేషం. ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రస్తుతం ‘సాయ్’ హాస్టల్లో ఉంటూ అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమవుతున్నారు. తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాయికిరణ్, శ్రీనుబాబుల తల్లి రాధ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని కొత్తూరు స్వగ్రామం. విధి వికటించి ఎనిమిదేళ్ల క్రితం రాధ భర్త మృతి చెందడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ నగరానికి చేరుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం.7లో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని సమీప ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం చూసుకుంది. ఆపై తన ఇద్దరు పిల్లలకు పక్కనే ఉన్న గతి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. తల్లి కష్టాన్ని గుర్తించి సాయికిరణ్, శ్రీనుబాబు చదువుల్లో రాణిస్తునే మరోవైపు క్రీడలపైనా దృష్టిపెట్టారు. తాము చదువుతున్న స్కూలు తరఫున జాతీయ హ్యాండ్‌బాల్ పోటీల్లో ఆడటంతో మంచి గుర్తింపు పొందారు. ఈ క్రీడా ప్రతిభతోనే శ్రీనుబాబు మంచి కాలేజీలో సులువుగానే అడ్మిషన్ పొందాడు. ఇదిలావుంటే.. ‘సాయ్’లో సీటు సంపాదించడం అషామాషీ కాదు. ఇందులో శిక్షణ పొందుతున్న వారిలో హైదరాబాద్ నుంచి ఎంపికైనవారిని వేళ్ల మీద లెక్కబెట్టువచ్చు. కానీ శ్రీనుబాబు, సాయికిరణ్ ఇద్దరూ ఇందులో తమ క్రీడా పతిభతో చోటు సంపాదించుకున్నారు. ఓ వైపు చదువుతూనే ఇంకోవైపు క్రీడల్లో దూసుకెళుతున్నారు. తన బిడ్డలను ఉన్నతంగా చూడాలనుకున్న రాధ ఆశను నిజం చేస్తున్నారు. చదువులోనూ.. క్రీడల్లోనూ రాణిస్తూ గుర్తింపు పొందుతూ రేపటి భవిష్యత్ తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ దిగులు పోయింది నేను బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇళ్లల్లో పనిచేస్తూ నా కొడుకులను సర్కారు బడిలోనే చదివించాను. ఇద్దరూ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఇంకోవైపు ఆటల్లోను రాణిస్తున్నారు. ఒకపూట పస్తులుండి వారికి అవసరమైన క్రీడా సామగ్రితో పాటు పోటీలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఖర్చులు కూడా ఇచ్చాను. నా కష్టాన్ని వారు గుర్తించారు. నా కొడుకుల విజయాల ముందు భర్త లేడన్న దిగులు దూరమైపోయింది. – రాధ, సాయికిరణ్, శ్రీనుబాబు తల్లి -
జాతీయ హ్యాండ్‌బాల్ పోటీలు షురూ
సిద్దిపేట ఎడ్యుకేషన్ : క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి క్రీడాకారులకు సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో దేశపతాకాన్ని ఎగరవేయాలన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలను ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 29 రాష్ట్రాల నుంచి పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పోటీలు నిర్వహించే అవకాశం రావడం సంతోషమన్నారు. ముఖ్యంగా నూతన సిద్దిపేట జిల్లాలో ఈ పోటీలను నిర్వహించడం గర్వకారణమన్నారు. ఇదే మైదానంలో తాము ఆడుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 29 రాష్ట్రాల నుంచి ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధించాలన్నారు. ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ మాట్లాడుతూ సిద్దిపేట వ్యాయామ ఉపాధ్యాయులు వేతనం కోసం కాకుండా నిబద్ధతతో పనిచేస్తారని కొనియాడారు. సారేజహాస్సే అచ్చా గీతం పాకిస్తాన్లో వినిపించేలా క్రీడాకారులు తమ ప్రతిభను కనబర్చాలని సూచించారు. కార్యక్రమంలో భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య కోశాధికారి ప్రీత్‌పాల్‌సింగ్ సలూజ, మహిళా కోచ్ శివాజీషిండే, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రంగారావు, హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్‌బీఏ) రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, కోశాధికారి రమేశ్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి దామెర మల్లేశం, అరుణాచల్ ప్రదేశ్ కార్యదర్శి నబాకులెరా, సిద్దిపేట స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి సుజాతలతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొదటిరోజు లీగ్ పోటీల్లో.. జాతీయహ్యాండ్బాల్ పోటీల్లో మొదటి రోజు లీగ్ మ్యాచ్‌ల్లో తెలంగా>ణ, అరుణాచల్‌ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా, పాండిచ్చేరి, నేషనల్ హ్యాండ్‌బాల్ అకాడమీ, మహారాష్ట్ర, డిల్లీ, మణిపూర్ తదితర జట్లు తలపడ్డాయి. అంతకు ముందు తెలంగాణ అరుణాచల్‌ప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో తెలంగాణ జట్టు 27 పాయింట్లు సాధించగా, అరుణాచల్‌ప్రదేశ్ 3 పాయింట్లు మాత్రమే సాధించి ఓటమి పాలైంది. -
తొలి మ్యాచ్‌లో క్లబ్ ఇండియా ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో తొలి రోజు భారత్‌కు చెందిన క్లబ్ ఇండియా జట్టుకు ఓటమి ఎదురైంది. అల్ శుర్తా (ఇరాక్) క్లబ్‌తో సోమవారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో క్లబ్ ఇండియా 37–51తో ఓడిపోయింది. ఈనెల 30 వరకు జరిగే ఈ పోటీల్లో అల్నూర్ (సౌదీ అరేబియా), అల్ దుహైల్ (ఖతర్), షార్జా (యూఏఈ), నఫ్త్ ఓ గాజ్ (ఇరాన్), మస్కట్ (ఒమన్), అల్ అహ్లి (ఖతర్), ఆర్కోర్ (ఉజ్బెకిస్తాన్), అల్నజ్మా (బహ్రెయిన్), అల్ శుర్తా (ఇరాక్), క్లబ్ ఇండియా (భారత్) జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. పోటీల నిమిత్తం కోటి రూపాయల ఖరీదు చేసే ఈ 9ఎంఎం టెరాఫ్లెక్స్ మ్యాట్‌ను స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు భారత జట్టుకు ప్రాతి«నిధ్యం వహిస్తున్నారు. వరంగల్‌కు చెందిన అశోక్, భరణి టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
హైదరాబాద్ క్లబ్ గెలుపు
ప్రొ. జయశంకర్ స్మారక హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: దివంగత ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించిన హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ హ్యాండ్‌బాల్ క్లబ్, ఏఓసీ జట్లు విజయాలు నమోదు చేశాయి. తొలి రోజు జరిగిన పురుషుల విభాగం మ్యాచ్‌ల్లో హైదరాబాద్ క్లబ్ 12-10తో ఏవీ కాలేజిపై, ఏఓసీ 17-12తో కరీంనగర్‌పై గెలుపొందాయి. మరో మ్యాచ్‌లో కరీంనగర్ 7-1తో కెన్నెడి ఇన్స్టిట్యూషన్పై, సాయి ఎస్టీసీ (సరూర్‌నగర్) 11-5తో కాంబాట్ అకాడమీపై, నేషనల్ పోలీస్ అకాడమీ 8-1తో మెదక్‌పై, రంగారెడ్డి 6-3తో నల్లగొండపై, కాంబాట్ 12-3తో గతి స్పోర్ట్స్ క్లబ్‌పై, వరంగల్ 11-7తో ప్రేమండల్ స్పోర్ట్స్ క్లబ్‌పై విజయం సాధించాయి. మహిళల విభాగంలో వనిత డిగ్రీ కాలేజి 5-4తో కెన్నెడి ఇన్స్టిట్యూషన్పై, సాయి ఎస్టీసీ (సరూర్‌నగర్) 7-2తో నల్లగొండపై, మహర్షి విద్యామందిర్ 7-2తో గతి స్పోర్ట్స్ క్లబ్‌పై, మెదక్ 2-1తో గతి స్పోర్ట్స్ క్లబ్‌పై గెలుపొందాయి. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై ఈవెంట్‌ను ఆరంభించారు. చెస్ విజేత రామానుజచారులు ప్రొఫెసర్ జయశంకర్ స్మారక చెస్ టోర్నీలో ఎన్. రామానుజచారులు విజేతగా నిలిచాడు. ఇందులో షేక్ ఫయాజ్ రెండో స్థానం దక్కించుకోగా, భరత్ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. ఉత్తమ అండర్-19, 13 ఆటగాళ్లుగా కె. తరుణ్, ప్రణయ్ అవార్డు అందుకున్నారు. త్రిష ఉత్తమ మహిళ అవార్డు చేజిక్కించుకుంది.