head constable VENKATRAMAIAH
-
పవర్ఫుల్ కానిస్టేబుల్
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి బయటి చిత్రాల్లో నటించి చాలా ఏళ్లయింది. ఆయనే హీరోగా, దర్శక–నిర్మాతగా సినిమాలు చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు బయటి బేనర్లో సినిమా చేయడం విశేషం. ఆయన సరసన జయసుధ నటించడం మరో విశేషం. చదలవాడ శ్రీనివాసరావుకి దర్శకుడిగా ఇది తొలి సినిమా. మరి.. ఆయన దర్శకత్వంలో నారాయణమూర్తి సినిమా ఒప్పుకోవడం, ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి స్టార్స్ సరసన నటించిన జయసుధ ఈ పీపుల్స్ స్టార్‌తో జతకట్టడం.. ఈ రెండు అంశాలు కథలో విషయం ఉందనే ఫీల్‌ని కలగజేస్తాయి. కథేంటి?: ఎట్టి పరిస్థితుల్లోనూ లంచాలు తీసుకోకుండా, ఎవరి దగ్గరా రాజీపడకుండా నిజాయతీగా బతకాలనేది హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య (ఆర్. నారాయణమూర్తి) అభిమతం. ‘డబ్బున్న వాడు కాదు.. నీతీ నిజాయతీ ఉన్నవాడే గొప్పోడు’ అనేది ఆయన సిద్ధాంతం. సిద్ధాంతాలను నమ్ముకుంటే ఉపయోగం లేదు, జేబును నమ్ముకోండని అతని భార్య పద్మ (జయసుధ) ఎప్పుడూ చెబుతుంటుంది. సహచర పోలీసులకు కూడా వెంకట్రామయ్య పద్ధతి నచ్చదు. దేనికీ లొంగని అతణ్ణి హోం మంత్రి అవినీతి కేసులో ఇరికించి అవమానిస్తాడు. అప్పుడతని భార్య కూడా అతణ్ణి వదిలి వెళ్తుంది. ఈ పరిణామాలన్నిటికీ నల్లధనమే కారణమని వెంకట్రామయ్య గ్రహిస్తాడు. దాంతో నల్లధనాన్ని అంతం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని ఎలా అమలుపరుస్తాడు? అసలు వెంకట్రామయ్యకీ, హోం మంత్రికీ మధ్య గొడవ ఏంటి? చివరకు అతనేం చేశాడు? అనేది చిత్రకథ విశ్లేషణ: ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిస్థితులకు తగ్గ చిత్రమిది. గతంలో పలు సందేశాత్మక చిత్రాల్లో నటించిన ఆర్. నారాయణమూర్తి తన భుజాలపై చిత్రాన్ని మోశారు. సహజ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ముఖ్యంగా అపార్థం చేసుకున్న భార్యకు తానేమిటో చెప్పాలని, ఆమెను మార్చాలని వెంకట్రామయ్య ప్రయత్నించే సన్నివేశాల్లో ఇద్దరి నటన బాగుంది. సరదా సన్నివేశాల్లో నవ్వించారు. చిత్ర కథ కొత్తగా ఉన్నప్పటికీ... సెకండాఫ్‌లో కీలక సన్నివేశాలు కాస్త వాస్తవానికి దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రస్తావించిన నల్లధన నిర్మూలన వంటి అంశాలను సెకండాఫ్‌లో చూపించలేదు. కానీ, దర్శకుడు చూపించిన పరిష్కార మార్గాలు ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తాయి. మొదట్నుంచీ ప్రజా సమస్యలపై సినిమాల ద్వారా ఆర్. నారాయణమూర్తి పోరాటం చేస్తున్నారు. అదే బాటలో కొత్తగా, ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా ఆయన చేసిన మరో మంచి ప్రయత్నమిది. పవర్ఫుల్ కానిస్టేబుల్‌గా అద్భుతంగా నటించారు. చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ తారాగణం ఆర్. నారాయణమూర్తి, జయసుధ, సునీల్‌శర్మ తదితరులు.. ఛాయాగ్రహణం ఎన్. సుధాకర్‌రెడ్డి సంగీతం ‘వందేమాతరం’ శ్రీనివాస్ నిర్మాత చదలవాడ పద్మావతి కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం చదలవాడ శ్రీనివాసరావు -
సమాజానికి ఉపయోగపడే సినిమా ఇది
– చదలవాడ శ్రీనివాసరావు ‘‘నేను దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. అవుట్‌పుట్ సంతృప్తికరంగా వచ్చింది. నారాయణమూర్తి, జయసుధ సీనియర్ ఆర్టిస్టులు అయినప్పటికీ స్టూడెంట్స్‌లా నేను చెప్పినట్లు చేశారు. మంచి కథాంశంతో తీసిన ఈ సినిమా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది’’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ఆర్. నారాయణమూర్తి, జయసుధ జంటగా ఆయన దర్శకత్వం వహించిన ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ ఈ నెల 14న విడుదల కానుంది. చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం జరిగింది. ఎస్.పి. నాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించి, జయసుధకు ఇచ్చారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఒక సీన్లో నేను జయసుధ బుగ్గ మీద కొట్టాలి. దర్శకుడు ఈ సీన్ గురించి చెప్పగానే, వెనకాడాను. నా చెయ్యేమో రఫ్. ఆమె బుగ్గ కందిపోతుందని నా భయం. చివరికి ఆవిడే ‘ఫరవాలేదండి’ అన్నారు. జయసుధ అప్పుడు ఎన్టీఆర్ పక్కనా నటించారు. ఇప్పుడు నారాయణమూర్తి పక్కనా నటించారు. సినిమాని సినిమాలా చూసే మహాతల్లి ఆమె’’ అన్నారు. -
హాఫ్ సెంచరీ పూర్తి చేస్తా!
‘‘నాకు సంతోషంగానూ, కొంచెం భయంగానూ ఉంది. నేను నటించిన ‘శతమానం భవతి’, ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రాలు రెండూ సంక్రాంతికి రిలీజవు తున్నాయి. 45 ఏళ్ల నా ప్రయాణంలో కాస్త భయపడుతూ ఆనంద పడటం ఇదే తొలిసారి’’ అన్నారు జయసుధ. ఆర్. నారాయణమూర్తి హీరోగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ లో ఆమె హీరోయిన్గా నటించారు. ఈ 14న రిలీజవుతోన్న ఈ సినిమా గురించి జయసుధ మాట్లాడుతూ – ‘‘58 ఏళ్ల వయసులో మిడిల్ ఏజ్డ్ హీరోయిన్గా నటించా. జయసుధ, నారాయణమూర్తిల జోడి ఎలా ఉంటుందనే ఆసక్తి చాలామందిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆసక్తికరంగా ఉంటుందీ సినిమా. ఫస్టాఫ్‌లో సరదాగా, సెకండాఫ్‌లో హీరోతో పోటా పోటీగా ఉండే పాత్ర చేశా. చదలవాడ శ్రీనివాసరావుగారు నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. నటిగా 45 ఏళ్లు పూర్తి చేసుకున్నా. దేవుడి దయతో హాఫ్ సెంచరీ పూర్తి చేస్తా’’ అన్నారు. -
సమస్యలపై కానిస్టేబుల్ పోరాటం
సమాజంలో జరుగుతున్న సమస్యలపై పోరాడే పాత్రల్లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తిని సోలోగా చూస్తుంటాం. అయితే, ఈ సారి ఆయన రొటీన్‌కు భిన్నంగా హీరోయిన్‌తో.. అదీ సహజనటి జయసుధతో స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఆత్రుతగా ఉంది కదూ. అయితే.. మీరు సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. నారాయణమూర్తి, జయసుధ ముఖ్యపాత్రల్లో చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ పోస్ట్ ప్రొడక్షన్ జరపుకొంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నిజాయతీ పరుడైన హెడ్ కానిస్టేబుల్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడన్నదే కథ. నారాయణమూర్తి, జయసుధ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారంలో పాటలు, సంక్రాంతికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సమాజంలోని ప్రధాన సమస్య ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఆ సమస్య ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నా గత చిత్రాలకంటే ఇందులో వైవిధ్యంగా కనిపిస్తా. మా చిత్రం చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని నారాయణమూర్తి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమెరా: కె.సుధాకర్‌రెడ్డి, సమర్పణ: చదలవాడ తిరుపతిరావు. -
పూరీని కాదని.. కొత్త దర్శకుడితో..
సందేశాత్మక చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న నటుడు ఆర్.నారాయణమూర్తి. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో ఎదిగిన నారాయణమూర్తి కొంత కాలంగా తన స్వీయ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కే సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. దాసరి లాంటి దిగ్దర్శకుల సినిమాల్లో హీరోగా నటించిన నారాయణమూర్తి.., ఈ జనరేషన్ దర్శకులు పిలిచి అవకాశాలు ఇచ్చినా కాదనేశారు. టెంపర్ సినిమా సమయంలో పూరి జగన్నాథ్, ఓ కీలక పాత్రకు ఆర్ నారాయణమూర్తిని సంప్రదించినా.. బయటి దర్శకులతో కలిసి పనిచేసే ఉద్దేశం లేదంటూ కాదన్నారు. అయితే ఓ కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించారు పీపుల్స్ స్టార్. బిచ్చగాడు సినిమాతో నిర్మాతగా సక్సెస్ సాధించిన చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడిగా మారి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సందేశాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ నచ్చటంతో నారాయణమూర్తి టైటిల్ రోల్ పోషించేందుకు అంగకీరించారు. ఈ సినిమాలో నారాయణమూర్తి జంటగా స్టార్ హీరోయిన్ జయసుథ నటిస్తుండటం విశేషం. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నాడు. -
జోడీ కుదిరింది!
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి, సహజ నటి జయసుధ జంటగా ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ అనే చిత్రం రూపొందనుంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకునిగా మారుతున్నారు. చదలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 19న ప్రారంభం కానుంది. ‘‘నా అభిమాన నటి సావిత్రిగారు. ఆమె తర్వాత నేను అభిమానించే నటి జయసుధగారు. అటువంటి గొప్ప నటితో కలిసి నేను మొదటిసారి నటిస్తున్నానంటే చాలా హ్యాపీగా, థ్రిల్‌గా ఉంది. నాతో నటించేందుకు ఒప్పుకున్న జయసుధగారికి, ఈ అవకాశం ఇచ్చిన దర్శక-నిర్మాతలకు థ్యాంక్స్’’ అని నారాయణమూర్తి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘నీతి, నిజాయితీ ఉన్న ఓ పోలీసు నిజ జీవితంలో, వృత్తిలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడన్నది కథాంశం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమెరా: సుధాకర్ రెడ్డి.