Health Day
-
World Digestive Health Day: తిన్నది అరక్కపోతే తిప్పలే!
గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల ఎక్కువ మంది జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఏడాది డైజిస్టీవ్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి అరికట్టకపోతే పెద్దపేగు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ 2004 నుంచి మే 29న వరల్డ్ డైజిస్టివ్ డే (జీర్ణ ఆరోగ్య దినోత్సవం) నిర్వహిస్తున్నారు. ఈఏడాది కొలొరెక్టల్ క్యాన్సర్ (పెద్దపేగు క్యాన్సర్)పై అవగాహన కల్పించాలని డైజిస్టివ్డే సందర్భంగా నిర్ణయించారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిన్న ఆహారం అరగకపోతే సమస్యలు.. జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా మనం తీసుకునే ఆహారం సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్ల వస్తున్నాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవకపోవడం కూడా వ్యాధులు రావడానికి కారణమవుతోంది. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమైనప్పుడే శరీరంలోని వివిధ అవయవాలకు శక్తి లభిస్తోంది. జీర్ణవ్యవస్థ మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి అందులోని పోషకాలను రక్తంలోకి చేరుస్తోంది. రక్తం నుంచి కాలేయానికి అక్కడి నుంచి పోషకాలు శరీరంలోని వివిధ అవయవాలకు చేరడం ద్వారా మనిషికి శక్తి లభిస్తోంది. యాంత్రిక జీవనం వల్ల హడావుడిగా ఆహారం తీసుకోవడం, ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, నిర్ణీత ఆహార వేళలు పాటించకుండా మసాలా దినుసులతో కూడిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. జీవనశైలితో పెరుగుతున్న వ్యాధులు.. జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు ఆధునిక జీవన శైలి వల్ల పెరుగుతున్నాయి. ఇంట్లో ఆహారం తయారు చేసుకుని తినకుండా ఎక్కువ శాతం హోటళ్లలో తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. ఉద్యోగరీత్యా, చదువులు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలతో ఎక్కువగా ఒత్తిడికి లోనవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పెద్దపేగు క్యాన్సర్‌కు దారి తీయొచ్చు... జీర్ణకోశ సంబంధిత సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయకపోవడం ద్వారా అవి పెద్ద పేగు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. పెద్దపేగు క్యాన్సర్ సోకిన వారిలో ప్రాథమిక దశలో పొట్టకింద నొప్పి, పొట్టబిగపట్టడం, మలవిసర్జన సమయంలో నొప్పి, మలద్వారం నుంచి రక్తస్రావం అవడం, కొన్ని సార్లు ఎక్కువగా విరోచనాలు అవడం, బరువు తగ్గిపోవడం, అలసట, తదితర సమస్యలు కనిపిస్తాయి. జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు.. గుంటూరు జీజీహెచ్‌లో జీర్ణకోశ సంబంధిత సమస్యల బాధితులకు ఉచితంగా అత్యాధునిక వైద్య పరికరాలతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నారు. వారంలో మంగళవారం, శుక్రవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య విభాగంలో వివిధ రకాల జీర్ణకోశ సంబంధిత సమస్యలతో బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రతిరోజూ 300 మంది వివిధ రకాల సమస్యలతో వైద్యం కోసం వస్తున్నారు. జీర్ణకోశ సంబంధిత సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చని గ్యాస్ట్రో ఎంట్రాలజీస్టులు తెలియజేస్తున్నారు. జీజీహెచ్‌లో ఈ సమస్యలకు అత్యాధునిక ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు మేలు.. ఆహారం తిన్నవెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ నిద్రకు ఉపక్రమించకూడదు. సాధ్యమైంత మేర రాత్రి వేళల్లో త్వరితగతిన 9 గంటల్లోపు భోజనం చేయాలి. భోజనం చేసిన అనంతరం కొంతసేపు నడవడం ద్వారా జీర్ణక్రియ మెరుగు పడుతోంది. ఒత్తిడి, ఆందోళన లేకుండా యోగా, నడక, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలి. జీర్ణ వ్యవస్థకు హాని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. – డాక్టర్ షేక్ నాగూర్‌బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, గుంటూరు జీజీహెచ్ -
అంత యాక్షన్ వద్దు.. పులి కూడా బ్రష్ చేస్తుంది!
‘పులి బ్రష్ చేస్తుందా?’.. ఎవరైనా ముఖం శుభ్రం చేసుకోకుండా ఏదైనా తింటూ ఉండటాన్ని ప్రశ్నిస్తే వెంటనే వచ్చే సమాధానం అది. అయితే పులి కూడా కొన్ని చెట్ల మొదళ్లు, ప్రత్యేక మొక్కలకు తన దంతాలను రుద్ది శుభ్రం చేసుకుంటుందన్న విషయం చాలామందికి తెలియదు. సృష్టిలో అన్ని రకాల జీవులూ వాటి పరిధిలో నోటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాయి. కానీ తెలివి తేటలు ఉన్న మనిషి మాత్రం దంతాలను, నోటి శుభ్రతనూ నిర్లక్ష్యం చేస్తూ అనారోగ్యానికి గురవుతున్నాడు. ఈ నెల 20న ‘నోటి ఆరోగ్య దినోత్సవం’. ఈ సందర్భంగా నోటి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చదవండి: World Sparrow Day: ఎక్కడున్నావమ్మా.. ఓ పిచ్చుకమ్మా..? కర్నూలు(హాస్పిటల్): నోట్లో ఉత్పత్తి అయ్యే బాక్టీరియా నుంచి దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. పక్క వారు మాట్లాడేటప్పుడు వారి నుంచి వచ్చే దుర్వాసన ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. ఇతరుల సంగతి పక్కన పెడితే పలు వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. పళ్లు, చిగుళ్లు నొప్పి, గొంతు నొప్పి, నాలుక మీద పాచి పేరుకుపోవడం, నోరు పొంగడం(వేడి చేయడం) తదితర సమస్యలతో నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమస్య అధికంగా మాట్లాడే వారిలో, నీటిని తక్కువగా తాగే వారిలోనూ, సరైన ఆహార నియమాలు పాటించని, జీర్ణాశయ సమస్యలున్న వారిలోనూ మరింత అధికంగా ఉంటుంది. కర్నూలు, దేవనకొండ, పత్తికొండ, ఆదోని, ఆస్పరి, నందికొట్కూరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో తాగునీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి ప్రజల పళ్లపై పచ్చని రంగులో మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక గ్రామీణ ప్రాంత ప్రజలు పళ్లను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల పంటి చుట్టూ గార ఏర్పడి, చిగుళ్లకు ఇన్ఫెక్షన్స్ వచ్చి రక్తం కారుతూ, నొప్పి, దుర్వాసన వస్తూ ఉంటుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి నోటిని తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉప్పు నీటితో పుక్కిలించి ఉమ్మేయాలి. పిప్పి పళ్లు ఉంటే తీసివేయకుండా డెంటల్ ఫిల్లింగ్ లేదా రూట్‌కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. చిగుళ్లుకు మర్దన చేసుకోవాలి. సరైన ఆహార నియమాలు పాటించాలి. ఆల్కాహాలు, పాన్, గుట్కా వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆరు నెలలకోసారి దంత వైద్యున్ని సంప్రదించాలి. – డాక్టర్ పి.సునీల్ కుమార్‌రెడ్డి, దంత వైద్యనిపుణులు, కర్నూలు -
అందరికీ ఆరోగ్యం.. అదే మా నినాదం
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ఏర్పడిన రోజునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1948లో జెనీవాలో తొలిసారిగా జరిగిన డబ్ల్యూహెచ్ఓ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 2019 సంవత్సరంతో డబ్ల్యూహెచ్ఓ 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరానికి గాను ‘అందరికీ ఆరోగ్య రక్షణ’ అనే నినాదాన్ని ఇచ్చింది. ‘కుల, మత, జాతి, ప్రాంత, ఆర్థిక తేడాలు లేకుండా అందరికీ ఒకే విదమైన ఆరోగ్య రక్షణ, నాణ్యమైన సేవలు అందించడం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనం గెహెబ్రేస్స్ తెలిపారు. ఆయన ఆదివారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో తమ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెడ్రోస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో అనేక దేశాల్లో ప్రభలుతున్న వ్యాధులను, అనారోగ్యం వల్ల సంభవించే మరణాలను నిర్మూలించేందుకు తమ సంస్థ చాలా కృషి చేస్తోందని, అయినప్పటికీ ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికి కూడా ప్రపంచంలో సగం జనాభాకు తగిన వైద్యం అందడం లేదని, కొన్ని దేశాల్లో కనీస వైద్య సౌకర్యాలు లేక గర్భిణీ మహిళలు అవస్థలు పడుతున్నారని, చాలా మంది పిల్లలకు రోగనిరోధక టీకాలు కూడా అందడం లేదని టెడ్రోస్ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని దేశాల ప్రజలకు సరైన సమయంలో వైద్యం అందక హెచ్ఐవీ, టీబీ, మలేరియా బారిన పడి చనిపోతున్నారని, 2019 సంవత్సరంతో ఇవన్నీ ఆగిపోవాలని కోరుకుంటున్నాట్లు తెలిపారు. పేద వారికి కూడు, గూడు, గుడ్డతో పాటు ఆరోగ్యం కూడా కనీస సదుపాయంగా కల్పించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశ్యమని, అందుకే 2019లో ‘అందరికి ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరికి, ప్రతి చోటుకు’ అనే నినాదంతో ప్రజలందరికి ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. -
మానసిక ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించాలి
రాయచూరు, న్యూస్‌లైన్ : మానసిక ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ ప్రాధికారం అధ్యక్షులు కృష్ణభట్ అన్నారు. ఆయన గురువారం స్థానిక ఐఎంఏ హాల్లో జిల్లా న్యాయసేవ ప్రాధికారం, జిల్లా న్యాయవాదుల సంఘం, భారతీయ వైద్యకీయ సంఘం, ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల మానసిక అస్వస్థుల సంఖ్య పెరుగుతోందని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. శారీరక ఆరోగ్య నియంత్రణ మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని, దీంతో మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్ల పర్యవసానంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. మారిన జీవన శైలి ఒత్తిళ్లు పెరగడానికి కారణమన్నారు.సమాజంలో చక్కటి నాగరికతను అలవాటు చేసుకోవడం ప్రధానమన్నారు. మానసిక అస్వస్థులను హింసించడం, వేధించడం వంటి పనులకు సమాజం స్వస్తి చెప్పాలని కోరారు. అలాంటి వారికి తగిన చికిత్స ఇప్పించేందుకు ఆసక్తి చూపాలన్నారు. అంతకుముందు సైకియాట్రిస్ట్ డాక్టర్ మాలిపాటిల్ మానసిక ఒత్తిళ్ల పరిణామాల గురించి వివరించారు. న్యాయమూర్తి ముజాహిద్, జిల్లాధికారి నాగరాజ్, ఎస్పీ ఎంఎం.నాగరాజ్, నవోదయ కళాశాల డీన్ డాక్టర్ ప్రకాష్, ఐఎంఏ అధ్యక్షుడు కులకర్ణి, విమ్స్ మనోవైద్యుడు రమేష్‌బాబు, మనోహర్ , న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు భా నురాజ్ జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షే మ అధికారి డాక్టర్ నారాయణప్ప, వై ద్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
మానసిక రోగులను సాధారణ స్థితికి చేర్చండి
సాక్షి, బళ్లారి : మానసిక రోగులను సాధారణ స్థాయికి చేర్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిన అసవరం ఉందని జిల్లా న్యాయమూర్తి విశ్వేశ్వర్ భట్ అన్నారు. ఆయన గురువారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నగరంలోని జిల్లా కోర్టు ఆవరణంలోని న్యాయవాదుల సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మానసిక రోగులను ఆరోగ్యవంతులుగా చేయడంతో వారి తల్లిదండ్రులే కాక సమాజం కూడా కాస్త చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సిద్ధారెడ్డి మాట్లాడుతూ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కొందరు తెలిసీ తెలియక తప్పులు చేస్తారని, అలాంటి వారిని శిక్షించకూడదని చట్టం కూడా చెబుతున్నట్లు గుర్తు చేశారు. మానసిక రోగులను వీలైనంతగా మామూలు స్థితికి తీసుకుని వస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. మానసిక రోగుల పట్ల వైద్యులతోపాటు బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వారికి చేయూతనిస్తూ ఆరోగ్యవంతులను చేయాలన్నారు. మానసిక ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేనప్పుడు ఎన్నో నేరాలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి ఆరోగ్య పరిస్థితి బాగు చేయాలి కాని శిక్షించేందుకు ప్రయత్నించకూడదన్నారు. మానసిక వైద్య నిపుణులు కొట్రేష్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయధీశులు, న్యాయవాదులు, వార్తాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.