గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల ఎక్కువ మంది జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఏడాది డైజిస్టీవ్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి అరికట్టకపోతే పెద్దపేగు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ 2004 నుంచి మే 29న వరల్డ్ డైజిస్టివ్ డే (జీర్ణ ఆరోగ్య దినోత్సవం) నిర్వహిస్తున్నారు. ఈఏడాది కొలొరెక్టల్ క్యాన్సర్ (పెద్దపేగు క్యాన్సర్)పై అవగాహన కల్పించాలని డైజిస్టివ్‌డే సందర్భంగా నిర్ణయించారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
తిన్న ఆహారం అరగకపోతే సమస్యలు..
జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా మనం తీసుకునే ఆహారం సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్ల వస్తున్నాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవకపోవడం కూడా వ్యాధులు రావడానికి కారణమవుతోంది. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమైనప్పుడే శరీరంలోని వివిధ అవయవాలకు శక్తి లభిస్తోంది. జీర్ణవ్యవస్థ మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి అందులోని పోషకాలను రక్తంలోకి చేరుస్తోంది. రక్తం నుంచి కాలేయానికి అక్కడి నుంచి పోషకాలు శరీరంలోని వివిధ అవయవాలకు చేరడం ద్వారా మనిషికి శక్తి లభిస్తోంది. యాంత్రిక జీవనం వల్ల హడావుడిగా ఆహారం తీసుకోవడం, ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, నిర్ణీత ఆహార వేళలు పాటించకుండా మసాలా దినుసులతో కూడిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి.
జీవనశైలితో పెరుగుతున్న వ్యాధులు..
జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు ఆధునిక జీవన శైలి వల్ల పెరుగుతున్నాయి. ఇంట్లో ఆహారం తయారు చేసుకుని తినకుండా ఎక్కువ శాతం హోటళ్లలో తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. ఉద్యోగరీత్యా, చదువులు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలతో ఎక్కువగా ఒత్తిడికి లోనవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
పెద్దపేగు క్యాన్సర్‌కు దారి తీయొచ్చు...
జీర్ణకోశ సంబంధిత సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయకపోవడం ద్వారా అవి పెద్ద పేగు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. పెద్దపేగు క్యాన్సర్ సోకిన వారిలో ప్రాథమిక దశలో పొట్టకింద నొప్పి, పొట్టబిగపట్టడం, మలవిసర్జన సమయంలో నొప్పి, మలద్వారం నుంచి రక్తస్రావం అవడం, కొన్ని సార్లు ఎక్కువగా విరోచనాలు అవడం, బరువు తగ్గిపోవడం, అలసట, తదితర సమస్యలు కనిపిస్తాయి.
జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు..
గుంటూరు జీజీహెచ్‌లో జీర్ణకోశ సంబంధిత సమస్యల బాధితులకు ఉచితంగా అత్యాధునిక వైద్య పరికరాలతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నారు. వారంలో మంగళవారం, శుక్రవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య విభాగంలో వివిధ రకాల జీర్ణకోశ సంబంధిత సమస్యలతో బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రతిరోజూ 300 మంది వివిధ రకాల సమస్యలతో వైద్యం కోసం వస్తున్నారు. జీర్ణకోశ సంబంధిత సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చని గ్యాస్ట్రో ఎంట్రాలజీస్టులు తెలియజేస్తున్నారు. జీజీహెచ్‌లో ఈ సమస్యలకు అత్యాధునిక ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నారు.
ముందస్తు జాగ్రత్తలు మేలు..
ఆహారం తిన్నవెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ నిద్రకు ఉపక్రమించకూడదు. సాధ్యమైంత మేర రాత్రి వేళల్లో త్వరితగతిన 9 గంటల్లోపు భోజనం చేయాలి. భోజనం చేసిన అనంతరం కొంతసేపు నడవడం ద్వారా జీర్ణక్రియ మెరుగు పడుతోంది. ఒత్తిడి, ఆందోళన లేకుండా యోగా, నడక, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలి. జీర్ణ వ్యవస్థకు హాని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
– డాక్టర్ షేక్ నాగూర్‌బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, గుంటూరు జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment