భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి బూస్ట్!
2025 నాటికి 2 కోట్లకుపైగా కొత్త ఉద్యోగాలు
* జాతీయ విధానానికి కేంద్రం ఆమోద ముద్ర
* ప్రస్తుత ఉత్పత్తి పరిమాణం రూ.2.30 లక్షల కోట్లు
* 2025 నాటికి రూ.7.50 లక్షల కోట్ల ఉత్పత్తి లక్ష్యం
న్యూఢిల్లీ: వ్యవస్థలో డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్ గూడ్స్ రంగం పునరుత్తేజానికి కేంద్రం చర్యలు మొదలెట్టింది. భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంబంధించిన ఈ రంగం కోసం తొలిసారిగా ఒక జాతీయ విధానాన్ని తెచ్చింది.
బుధవారం దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2014-15లో ఈ రంగం ఉత్పత్తి విలువ దాదాపు రూ.2,30,000 కోట్లు. దీన్ని 2025 నాటికి రూ.7,50,000 కోట్లకు పెంచాలన్నది లక్ష్యం. అదే విధంగా ఈ రంగం నుంచి ప్రస్తుతం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 84 లక్షల మందికాగా, ఈ సంఖ్యను మూడు కోట్లకు పెంచాలని కూడా కేంద్రం భావిస్తోంది. అంటే ఈ విధానం విజయవంతమైతే 2025 నాటికి 2 కోట్ల మంది కొత్తగా ఈ రంగంలో ఉపాధి పొందుతారు. కాగా, కేంద్రం విధాన నిర్ణయంపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమోదించిన విధానంలో మరిన్ని ముఖ్యాంశాలివీ...
* ప్రస్తుతం క్యాపిటల్ గూడ్స్ రంగం 14 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. దీనిని 2025 నాటికి 50 లక్షలకు పెంచాలన్నది లక్ష్యం. ఇక పరోక్ష ఉపాధి కల్పన అవకాశాలను ప్రస్తుత 70 లక్షల నుంచి 2.5 కోట్లకు పెంచుతారు.
* క్యాపిటల్ గూడ్స్ డిమాండ్‌లో దేశీయ ఉత్పత్తి వాటా ప్రస్తుతం 60 శాతం. దీన్ని 80కి పెంచాలని కేంద్రం భావిస్తోంది.
* దేశీ ఉత్పత్తిలో ప్రస్తుతం 27 శాతం ఎగుమతులు జరుగుతుండగా, దీనిని 40 శాతానికి పెంచాలని లక్ష్యించారు. మొత్తం తయారీ రంగంలో ఈ రంగం వాటా ప్రస్తుతం 12 శాతం. దీన్ని 20కి పెంచాలని తాజా విధానం నిర్దేశిస్తోంది.
* మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.