ప్రీ ఆర్మీ సెలక్షన్స్‌కు 250 మంది ఎంపిక
తణుకు టౌన్: తణుకులోని శ్రీచిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రీ ఆర్మీ ట్రైనింగ్ సెలక్షన్‌కు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన నిరుద్యోగ యువత బుధవారం ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా సెట్వెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెలక్షన్స్‌కు జిల్లాలోని వివిధ పట్టణాల నుంచి నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 480 మంది పాల్గొన్న ఈ సెలక్షన్స్‌లో 250 మందిని ఎంపిక చేసినట్టు సెట్వెల్ అధికారులు తెలిపారు. ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుని అనంతరం వారి ఎత్తు, బరువు, చాతి కొలతలు తీసుకున్నారు. ఈ కొలతల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ముందుగా శిక్షణ పొందేందుకు అర్హత పొందుతారని తెలిపారు. ఈ సందర్భంగా సెట్ వెల్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఆర్మీ సెలక్షన్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెట్వెల్ సిబ్బందితో పాటు కళాశాల పీడీ టి.కళ్యాణి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు కె.నెల్సన్, రమేష్కృష్ణన్ పాల్గొన్నారు.