శభాష్.. బాగా తాపిస్తున్నారు!
కర్నూలు:
శెభాష్ బాగా తాపిస్తున్నారు.. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాబట్టడంలో కర్నూలు జిల్లా అధికారులు ముందు వరుసలో ఉన్నారు. రాబడిని పెంచేందుకు మరింతగా కృషి చేయాలని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ కమిషనర్ ఎస్ఎస్.రావత్, డెరైక్టర్ సూర్యప్రకాష్‌తో కలిసి హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కర్నూలు కలెక్టరేట్లో ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, కర్నూలు, నంద్యాల ఈఎస్‌లు సుర్జీత్‌సింగ్, హనుమంతరావు, ఐఎంఎల్ డిపో ఇన్‌చార్జ్‌లు మనోహర్, నాగభూషణం, కర్నూలు ఏఈఎస్ హెప్సిబా రాణి, సీఐ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా కాకుండా చెక్‌పోస్టుల వద్ద నిఘా తీవ్రం చేయాలని ఆదేశించారు. కర్నూలు జిల్లాలో తొమ్మిది చెక్‌పోస్టులు, మూడు మొబైల్ టీముల ద్వారా కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం రవాణా కాకుండా చర్యలు చేపట్టినట్లు హేమంత్‌నాగరాజు వివరించారు.
అలాగే నకిలీ మద్యంపై కూడా నిఘా పెంచినట్లు చెప్పారు. ఆదాయపరంగా కర్నూలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ఈ సందర్భంగా మంత్రి జిల్లా అధికారులకు కితాబునిచ్చారు. జిల్లాలో హోలోగ్రామ్ ప్రాజెక్టును నెలాఖరులోగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లెసైన్స్ ఫీజు కింద జిల్లాలో ప్రభుత్వానికి రూ.74 కోట్లు ఆదాయం వచ్చిందని మంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. అలాగే బెల్టు షాపులకు సంబంధించి జిల్లాలో 354 కేసులు నమోదు చేసి 368 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
1265 లీటర్ల మద్యం, 152 లీటర్ల బీరు స్వాధీనం చేసుకుని ఏడు వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కరా్ణాటక సరిహద్దులోని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచి అక్రమ రవాణాపై 120 కేసులు నమోదు చేసి 120 మందిని అరెస్టు చే శామని, అలాగే 192 లీటర్ల కర్ణాటక మద్యం సీజ్ చేసి ఇందుకు సంబంధించి 34 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు నివేదించారు. ఎక్సైజ్ నేరాలకు సంబంధించి 534 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకురాగా డిసెంబర్ 6న మెగా లోక్ అదాలత్‌లో ఉంచి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.