అర్జున్ గ్రామర్ నివేదితకి అర్థమైంది..
గ్రామర్... కష్టమైన సబ్జెక్ట్. అర్థం అయితే చాలా ఈజీ. ప్రెజెంట్లో ఉన్నా ఫ్యూచర్ కూడా అర్థమవుతుంది. పెళ్లి... ఇదో సెపరేట్ గ్రామర్. భర్తది ఒక గ్రామర్... భార్యది ఒక గ్రామర్. ఒకరి గ్రామర్ మరొకరికి అర్థమైతే ఫ్యూచర్ అర్థవంతంగా ఉంటుంది. అర్జున్ గ్రామర్ నివేదితకి అర్థమైంది.. నివేదిత గ్రామర్ అర్జున్‌కి అర్థమైంది. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతే వివాహ బంధానికి అర్థమే లేదంటున్నారు ఇద్దరూ.
►మీ పెళ్లయి 32 ఏళ్లయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్నేళ్ల జీవితం ఎలా అనిపిస్తోంది?
అర్జున్: మా ఫ్రెండ్స్ ‘25 ఏళ్లకే పెళ్లి చేసుకున్నావేంటి? కొన్నాళ్లు బ్యాచిలర్ లైఫ్‌ని ఎంజాయ్ చేసి ఉండొచ్చు’ అనేవాళ్లు. అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే ‘తొందరగా పెళ్లి చేసుకుని ఎంత మంచి పని చేశానా’ అనిపిస్తోంది. సరైన టైమ్‌లో సరైన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నాను. ఒంటరిగా ఉండి సాధించవచ్చు అనుకుంటారు. కానీ కలసి సాధించడంలో కిక్ వేరే ఉంటుంది. పెళ్లి చేసుకున్నవాళ్లకే అది తెలుస్తుంది. నా లైఫ్‌లో జరిగిన బెస్ట్ విషయాల్లో నివేదితతో పెళ్లి ఒకటి.
నివేదిత: నా లైఫ్‌లో జరిగిన మంచి విషయం అర్జున్‌గారిని పెళ్లి చేసుకోవడమే. ఆయనతో 32 ఏళ్ల లైఫ్ చాలా చాలా బాగుంది.
అర్జున్: మా ఇద్దరమ్మాయిలు (ఐశ్వర్య, అంజనా) ‘నాన్నా.. మాకు ఫ్రెండ్‌లా కనిపిస్తున్నారు’ అంటారు. అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీ.
నివేదిత: నన్ను కూడా ఫ్రెండ్ అనే అంటారు.
►మీది లవ్ మ్యారేజ్ అని విన్నాం... ఆ లవ్‌స్టోరీ గురించి చెబుతారా?
అర్జున్: తను కన్నడ నటి. ‘రూపతార’ అనే కన్నడ సినిమా మ్యాగజీన్లో తన ఫొటో చూశాను. ‘ఈ అమ్మాయి బావుంది’ అనుకున్నాను. అప్పుడు ‘డాక్టర్గారి అబ్బాయి’ అని తెలుగు సినిమా కమిట్ అయ్యాను. పీయన్ రామచంద్రరావుగారు డైరెక్టర్. ఆ సినిమాకి నివేదితను రికమండ్ చేశాను. వెంటనే ఓకే అన్నారు. నివేదిత నాన్నగారు (రాజేష్) కన్నడంలో పెద్ద స్టార్. అదే టైమ్‌లో మా నాన్నగారు (శక్తి ప్రసాద్) విలన్. వాళ్ల నాన్నగారు, మా నాన్నగారు క్లోజ్ ఫ్రెండ్స్. మా నాన్నగారు 86లోనే చనిపోయారు. ఇక ‘డాక్టర్గారి అబ్బాయి’ సినిమా చేస్తుండగా నివేదితకు, నాకు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ సినిమా క్లైమాక్స్‌లో నాకు, కోట శ్రీనివాసరావుగారికి మధ్య వెటర్నరీలో వాడే పెద్ద సిరంజీలతో ఫైట్ ఉంటుంది. టైమింగ్ మిస్ అయి, ఆ సిరంజి నా చేతికి గుచ్చుకుని చేయి మొత్తం చీలిపోయింది. దగర్లో ఉన్న హాస్పిటల్‌కి వెళ్లాం. కుట్లు వేశారు. పక్కనే ఈ అమ్మాయి ఉంది. కళ్ల నిండా నీళ్లు. ఆ రోజే నాకు ఫీలింగ్ స్టార్టయింది.
►ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు?
అర్జున్: ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఆ సినిమా సెట్లో అడిగా. ఓకే అంది.
►పెళ్లప్పుడు మీకు 25 ఏళ్లు. మరి ఆమెకి?
అర్జున్: తనకి 17. అదేం మాకు సమస్య కాదు కానీ ఎక్కడ మిస్ కొట్టిందంటే.. ఆ వయసులో తనకు మెచ్యూరిటీ కొంచెం తక్కువ ఉండేది. నా సినిమాల ప్రివ్యూలను ఇద్దరం కలిసి చూసేవాళ్లం. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించింది. ఏడుస్తున్నది తనే. ‘ఎందుకు ఏడుస్తున్నావు’ అని అడిగితే చెప్పలేదు. ఇంటికి వచ్చాక చెప్పింది. సినిమాలో నేను హీరోయిన్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అవడం తను తట్టుకోలేకపోయింది. ‘నువ్వు కూడా యాక్టరే కదా.. ఇదంతా ప్రొఫెషన్లో భాగమే’ అన్నాను. వెంటనే కన్విన్స్ కాలేదు. మెల్లిగా అర్థం చేసుకుంది.
నివేదిత: 17 ఏళ్ల వయసు అమ్మాయిలు అలానే ఉంటారేమో. మాది సినిమా బ్యాగ్రౌండ్ అయినా భర్త వేరే స్త్రీతో నటన కోసం అయినా సరే క్లోజ్‌గా ఉండటాన్ని భరించలేకపోయాను (నవ్వుతూ).
అర్జున్: మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఎంత బిజీగా ఉన్నా మన కుటుంబానికి, భార్యకు టైమ్ ఇవ్వాలి. ‘ఇంత ఇమ్మెచ్యుర్డ్గా ఆలోచిస్తుందేంటి’ అని కోపం తెచ్చుకోకుండా అర్థమయ్యేలా చెప్పా. అర్థం చేసుకోవడానికి టైమ్ తీసుకుంది. తర్వాత సెట్టయింది. ఆ 17 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు నేను ఎలా ఉండాలో చెబుతుంది (నవ్వుతూ). కోపం తెచ్చుకోవద్దు అని పాజిటివ్నెస్ తీసుకొస్తుంది. ఈ ఇంటర్వూ్యలో చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే... మీ ఫ్యామిలీకి టైమ్ ఇవ్వండి. నేను ఇచ్చాను కాబట్టే ఈరోజు నేను చాలా హ్యాపీ పర్సన్.
నివేదిత: నా పెళ్లి సమయానికి చిన్న పిల్లని కాబట్టి కొన్ని విషయాలు అర్థం అయ్యేవి కావు. మొదట్లో కొంచెం కష్టంగా ఉండేది. ఆ తర్వాత అర్థం చేసుకున్నాను.
►ఈ 32 ఏళ్లలో మీ ఇద్దరిలో వచ్చిన మార్పేంటి?
నివేదిత: చాలా మార్పులు వచ్చాయి. గొడవలు పడ్డాం. సర్దుకుపోయాం. ఇన్నేళ్లల్లో మా గొడవల్ని మేం ఎప్పుడూ మరుసటి రోజు వరకూ కొనసాగించలేదు. ఏదైనా ఆ రోజు వరకే. మా ‘మంత్ర’ ఒకటే.. ఏ గొడవ జరిగినా ‘ఫర్గెట్ అండ్ ఫర్గివ్’.
►ఇంటి పనుల్లో మీవారు హెల్ప్ చేస్తారా?
నివేదిత: చేస్తారు. ఎవ్వరూ లేకపోతే గిన్నెలు క్లీన్ చేయడంలో కూడా సహాయం చేస్తుంటారు. ఇల్లు శుభ్రంగా ఉంచడం ఆయనకు ఇష్టం. ఇద్దరమ్మాయిల రూమ్స్‌ని నీట్‌గా సర్దిపెడుతుంటారు.
►వంట చేయడం వచ్చా?
అర్జున్: కాఫీ పెడతాను. ఆమ్లెట్ వేసుకోగలుగుతాను. పులిహోర బాగానే చేయగలుగుతాను.
నివేదిత: పులిహోర తన ఫేవరెట్. వంటమనిషి రాకపోతే వంట ప్రయత్నిస్తారు. ఆయన పెట్టే కాఫీ నాకు చాలా ఇష్టం.
►మీ భార్యలో మీకు నచ్చిన విషయాలు?
అర్జున్: ఒక్కొక్కరిదీ ఒక్కోలాంటి మనస్తత్వం, వ్యక్తిత్తం. నా భార్యలో నేను చూసింది పాజిటివిటీ. అబద్ధం చెప్పదు. నాకు ఇప్పుడు ఇద్దరు అమ్మలున్నారు. ఒకరు నా తల్లి, రెండోది నా భార్య.
►అర్జున్గారిలో మీకు నచ్చేవి?
నివేదిత: కుటుంబాన్ని బాగా ప్రేమిస్తారు. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ఆయనలాంటి భర్త దొరకడం నా అదృష్టం.
►మీ అమ్మాయి ఐశ్వర్యను హీరోయిన్ని చేయడానికి కారణం?
అర్జున్: 35ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంతకన్నా మంచి ఇండస్ట్రీ నాకు తెలిసి లేదు. బయట నుంచి చూసేవాళ్లు చెడు ఉదాహరణలు చెబుతుంటారు. మంచీ చెడు ఎక్కడైనా ఉంటాయి. నా ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం. మా అమ్మాయిని కూడా పరిచయం చేయడం గర్వంగా ఉంది. తనకూ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. మా ఐశ్వర్యను కన్నడం, తమిళంలో హీరోయిన్గా పరిచయం చేశాను. తెలుగులో పరిచయం చేయాలనుకుంటున్నాను. 1984 నుంచి తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మా అమ్మాయి కూడా యాక్ట్ చేయాలనుకుంటున్నాను. రెండో అమ్మాయి అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేసింది. వాళ్ల కెరీర్ కోసం కష్టపడుతున్నారు. వాళ్ల నాన్నగా అండగా నిలబడతాను. నాన్నలందరికీ నా విన్నపం ఏంటంటే మీ పిల్లల కోసం మీరు ఆరోగ్యంగా ఉండండి. మరీ ముఖ్యంగా ఆడపిల్లల ఉన్నవాళ్లు. ఆడపిల్లలకు తండ్రి సంరక్షణ కావాలి.
►వర్కింగ్ ఉమెన్ మీద మీ అభిప్రాయం?
అర్జున్: ‘ఉమెన్హుడ్’ని నేను చాలా గౌరవిస్తాను. అమ్మ అయినా భార్య అయినా అక్క అయినా, చెల్లయినా.. వర్కింగ్ ఉమెన్ అంటే చాలా గౌరవం. మా ఇంట్లో పని చేసేవాళ్లను ‘ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు. మీ ఇంట్లో వంట చేసి మా ఇంటికి వస్తారా?’ అని అడుగుతాను. వాళ్లు చెప్పింది వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. వాళ్ల కష్టం ముందు మాది పెద్ద కష్టం కాదనిపిస్తుంది. ఇంట్లో పనిచేసి, బయట పనిచేసి ఫ్యామిలీని పెంచి పెద్ద చేయడం చిన్న విషయం కాదు. వాళ్లందరికీ నా సెల్యూట్.
►మీ ఇద్దరిలో ఎవరు డామినేటింగ్?
అర్జున్: నా భార్యని అడిగితే నేనే డామినేటింగ్ అంటుందేమో. ఎవరి దృష్టిలో వాళ్లు కరెక్ట్ అనుకుంటాం. నా మనసుకి ఏది అనిపిస్తే అది చెబుతాను. ఉన్నదే చెబుతున్నాం అని మనం అనుకుంటాం. కానీ చెప్పింది వినాలన్నప్పుడు ‘తను డామినేటింగ్’ అనుకోవచ్చు. డామినేటింగ్కి కరెక్ట్ గ్రామర్ తెలియదు నాకు. అయితే చాలాసార్లు తను చెప్పింది వింటాను. కానీ చెప్పే విషయంలో చిన్న లాజిక్ ఉండాలనుకుంటాను. అది లేకపోతే మా అమ్మ చెప్పినా నా భార్య చెప్పినా వినను. నాక్కూడా కరెక్ట్ అనిపించాలి.
నివేదిత: విన్నారు కదా.. లాజికల్‌గా చెప్పాలంటారు. మేం కూడా చెప్పడానికి ట్రై చేస్తాం (నవ్వుతూ). అయితే కొన్నిసార్లు కొన్ని ఇష్యూల్లో నేనే స్టాండ్ తీసుకుంటాను.
►మ్యారీడ్ లైఫ్ గురించి మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి. మరి.. వైవాహిక జీవితం ఇలా ఉంటే బాగుంటుంది? అని చెబుతూ ఏదైనా సినిమా తీయాలనుకుంటున్నారా?
అర్జున్: మా అమ్మాయితో నేను తీయబోతున్న సినిమాలో చాలా టిప్స్ చెప్పబోతున్నాను. జనరల్‌గా చెప్పాలంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమే. ఎక్కడో పుట్టి ఎక్కడో ^è దువుకొని ఒకటవుతాం. మనస్తత్వాలు వేరయినా ఒకే ఇంట్లో ఉంటాం. విబేధాలు వస్తాయి. కొంచెం ఓపిక పడదాం, అడ్జస్ట్ అవుదాం అని అనుకోగలిగితే అంతా సవ్యంగా ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నా అంగీకరిస్తాను అని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈగో, పొసెసివ్‌నెస్ ఉంటాయి. అప్పుడు మనల్ని అపరిమితంగా ప్రేమిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. నేను హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండేది నటనే అయినా తను భరించలేకపోయింది. అది నా మీద తనకున్న ప్రేమ అని అర్థం చేసుకున్నాను.
నివేదిత: ఒకరికి ఒకరు స్పేస్ ఇవ్వాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. నమ్మకం, అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈగో అనేది దాంపత్యంలో అస్సలు వర్కౌట్ అవ్వదు. నా వరకూ నేను చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉన్నాను. ఈ ఇంట్లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.
అర్జున్: పెళ్లయ్యాక తన కుటుంబం, నా కుటుంబం అని ఉండకూడదు. మాకు ఆ భేదం లేదు. మా అమ్మగారు వాళ్ల అమ్మగారు ఇద్దరూ నాకు సమానమే. తనకూ అంతే. అత్తింటిని పుట్టిల్లు అని అమ్మాయి అనుకోవాలి. అబ్బాయి కూడా అలానే అనుకోవాలి. మేం అలానే అనుకున్నాం.
నివేదిత: అది చాలా ఇంపార్టెంట్. అసలు భార్యాభర్తల మధ్య గొడవలకు ఓ కారణం భర్త ఇంటివాళ్లను భార్య తనవాళ్లు అనుకోకపోవడం, భార్య కుటుంబాన్ని తన కుటుంబంలా భర్త అనుకోకపోవడమే. మా ఇద్దరికీ ఆ ప్రాబ్లమ్ లేదు. మాకు అందరూ సమానమే. – డి.జి. భవాని
►ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయి. ఇద్దరు ఆడపిల్లల తల్లిదండ్రులుగా భయంగా ఉంటుందా?
అర్జున్: అందరి తల్లిదండ్రులకు ఉన్నట్టే నాకూ భయం ఉంటుంది. మంచీ చెడూ అన్ని చోట్లా ఉన్నాయి. ఆడపిల్లలకు ప్రతిదీ చెబుతూ పెంచాలి. సెక్స్ అంటే వివరంగా చెప్పాలి. అందులో మంచి చెడ్డలు వివరించాలి. అప్పుడు అదేంటో తెలుసుకోవాలనే కంగారు ఉండదు. జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులకు ఇది కూడా ఓ బాధ్యతే. ప్రస్తుతం ఈ పాయింట్‌తోనే ఓ సినిమా చేస్తున్నాను. ఆడపిల్లలు ఆత్మరక్షణ నేర్చుకోవాలి. కరాటే నేర్చుకోవాలి. పెప్పర్ స్ప్రే ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. మనల్ని కాపాడటానికి ఎవరో వస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు.
నివేదిత: తల్లిదండ్రులు ఫ్రెండ్స్‌లా ఉన్నప్పుడే వాళ్లతో ఏదైనా మాట్లాడగలం. పేరెంట్స్‌కి పిల్లలు భయపడాలని కాదు. గౌరవం ఉండాలి. భయం కన్నా గౌరవం ఉన్నచోట తప్పులు చేయరని నా ఫీలింగ్. అందుకే మా పిల్లల్ని భయపెట్టం. స్నేహితుల్లా ఉంటాం. పిరికిగా ఉండకూడదని చెబుతుంటాం.
►ట్రిప్స్‌కి వెళ్తుంటారా?
నివేదిత: చాలా ట్రిప్స్‌కి వెళ్లాం. తన షూటింగ్స్‌కి బ్రేక్ ఉన్నా, పిల్లలకి సెలవులొచ్చినా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటాం. ఆయన ఫారిన్లో షూటింగ్ చేసినప్పుడల్లా ఆయనతో కలిసి వెళ్లాం. ఈ మధ్య వెళ్లిన హాలిడే అంటే.. మాల్డీవ్స్. ఇప్పుడైతే ట్రావెల్ చేసే ఆలోచన లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి బాలేదు. కొన్ని రూల్స్ ఉన్నాయి. అందరూ వాటిని ఫాలో అవ్వాలి. పరిస్థితులన్నీ కుదుటపడే వరకూ జాగ్రత్తగా ఉందాం.
అర్జున్: అవును.. వీలైనంతవరకూ ఇంట్లోనే ఉందాం. సమాజం మేలు కోసం మన వంతు సహాయం చేయాలి.
►అర్జున్‌గారు నటించిన చిత్రాల్లో ‘జెంటిల్‌మేన్’ ఒకటి. రియల్ లైఫ్‌లో ఆయన..?
నివేదిత: నిజజీవితంలో వెరీ వెరీ జెంటిల్‌మేన్. మా పెళ్లైన కొత్తలో నా అభిప్రాయాలను ఎంత గౌరవించారో ఇప్పుడూ అంతే గౌరవిస్తున్నారు. స్వేచ్ఛ ఇస్తారు. నాకు కావల్సినవి వెంటనే సమకూరాయో లేదో చూసుకుంటారు. భర్తల్లో తక్కువమందికి ఈ క్వాలిటీ ఉంటుంది. స్త్రీల క్షేమం కోసం తన పరిధి దాటి సహాయం చేయడానికి వెనకాడరు.
►మరి మీ ఆవిడ గురించి?
అర్జున్: షీ ఈజ్ బెస్ట్. బ్యూటిఫుల్, డ్యూటిఫుల్, రెస్పాన్సిబుల్ పర్సన్. నా జీవితంలో నేను కలిసిన ఏకైక నిజాయితీ గల వ్యక్తి.
కుమార్తెలు అంజనా, ఐశ్వర్యలతో అర్జున్, నివేదిత