hetero drugs
-
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. జీవో 140 నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: హెటిరో అధినేత పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానమేట్‌లో సాయిసింధూ ఫౌండేషన్‌కు 15 ఎకరాలు కేటాయింపు చేస్తూ విడుదల చేసిన జీవో 140ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. సాయి సింధు ఫౌండేషన్, క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల కోసం హాస్పిటల్ నిర్మాణం, లాభాపేక్ష లేకుండా 30 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన భూమి కేటాయించింది. సర్వే నంబర్ 41/14/2లోని భూమికి ఏడాదికి రూ. 1,47,743 లీజు మొత్తాన్ని సాయిసింధూ ఫౌండేషన్ చెల్లించేలా నిర్ణయించింది. -
Hyderabad: 28న ‘స్కిన్ బ్యాంక్’ ప్రారంభం
హైదరాబాద్: ఈస్ట్ రోటరీ క్లబ్, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఉస్మానియా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా స్కిన్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ మధుసూదన్ నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షులు వై.వి.గిరిలు మాట్లాడారు. శరీరం కాలిపోయిన కేసు ల్లో 40 శాతం కన్నా ఎక్కువ బర్న్ అయిన వారికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ప్రతిరోజూ డ్రస్సింగ్ చేయాల్సి ఉంటుందని, డ్రస్సింగ్ చేసే సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తారన్నారు. అదే స్కిన్ బ్యాంకు ఉంటే కాలినచోట స్కిన్ వేస్తే మూడు నెలల వరకు డ్రస్సింగ్ అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంలో మొత్తం 15 స్కిన్ బ్యాంకులు ఉండగా అందులో 9 రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినవే కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సుధీష్‌రెడ్డి, చౌదరి, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా ట్రీట్మెంట్కు మరో ఔషధం
-
నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో
సాక్షి, హైదరాబాద్/జిన్నారం (పటాన్చెరు): ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్ సంస్థ సామాజిక బాధ్యతలో మరో ముందడుగు వేసింది. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా మంబాపూర్–నల్లవెల్లిలో విస్తరించిన 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని హెటిరో డ్రగ్స్ సోమవారం దత్తత తీసుకుంది. ఇందులో భాగంగా రూ.5 కోట్ల చెక్కును హెటిరో చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా అక్కడ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు సమీపంలోని నర్సాపూర్ అడవిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. ఆ మేరకు అడవులను రక్షించేలా ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు భేష్.. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గొప్పగా ఉన్నాయని హెటిరో డ్రగ్స్ చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి ప్రశంసించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో ఎంపీ సంతోష్ కృషి తమను ఆకర్షించిందని, అందుకే సామాజిక బాధ్యతగా అడవిని దత్తత తీసుకుని అభివృద్దికి సంకల్పించినట్టు తెలిపారు. హెటిరో డ్రగ్స్ చొరవను సంతోష్ ఈ సందర్భంగా అభినందించారు. వీరి దారిలోనే మరికొందరు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పర్యావరణ పరిరక్షణకు ముందుకు వస్తున్నారని వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అటవీశాఖ ద్వారా చేపట్టిన వినూత్న కార్యక్రమాలను గురించి హెటిరో ప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. మంబాపూర్ అటవీ ప్రాంతం ప్రాధాన్యత మంబాపూర్ అడవిలో కొద్ది ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి చేయనున్నారు. అలాగే మొత్తం 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని స్థిరీకరించటం, ఆక్రమణలకు గురికాకుండా 25 కి.మీ. పరిధిలో అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేయటం, రక్షిత అటవీ ప్రాంతంలోకి మానవ, పెంపుడు జంతువుల ప్రవేశాన్ని నియంత్రించటం ద్వారా సహజ అడవి పునరుద్ధరణను హెటిరో నిధులతో చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్‌తో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ విస్తరిస్తున్న టౌన్షిప్లకు ఈ అడవి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించే లంగ్ స్పేస్‌గా ఉపయోగపడనుంది. నర్సాపూర్ రోడ్డు నుంచి అడవిలో ప్రవేశించిన తర్వాత 2 కి.మీ. దూరంలో చుక్కగుట్ట కొండ ప్రాంతంలో (సుమారు 630 మీటర్ల ఎత్తు) వ్యూ పాయింట్ ఏర్పాటు, ఎకో ట్రెక్కింగ్, విద్యార్థులకు పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.మహిపాల్ రెడ్డి, జెడ్పీ చైర్మన్, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతకుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా : మార్కెట్లోకి హెటిరో ‘ఫావిపిరవిర్’ ట్యాబ్లెట్
న్యూఢిల్లీ : కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫావిపిరవిర్’ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటీరో బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫావిపిరవిర్ ఒక్క ట్యాబ్లెట్ ధర రూ. 59గా నిర్ణయించినట్టు తెలిపింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా బాధితుల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదివరకే కరోనా చికిత్సలో వినియోగించే రెమ్డిసివిర్ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ పేరుతో తమ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఫావిపిరవిర్ ఔషధం క్లినికల్‌గా సానుకూల ఫలితాలు ఇచ్చిందని తెలిపింది. (కోవిడ్-19 వ్యాక్సిన్ల ధరల యుద్ధం?!) ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌కు సంబంధించి డీసీజీఐ నుంచి అన్ని అనుమతులను పొందినట్టు హెటిరో వెల్లడించింది. హెటిరో హెల్త్ కేర్ లిమిటెడ్ ద్వారా ఫావిపిరవిర్ ఔషధం మార్కెటింగ్ చేయబడుతుందని.. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్ ఫార్మసీలలో.. ఈ ఔషధం నేటి నుంచి అందుబాటులో ఉంటుందని చెప్పింది. డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకే ఈ డ్రగ్‌ను విక్రయించడం జరుగుతుందని తెలిపింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న ఎక్కువ మంది కోవిడ్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఈ ఔషధం తోడ్పతుందని పేర్కొంది. దేశంలోని తమ కంపెనీ ఫార్ములేషన్ ఫెసిలిటీలో తయారవుతున్న ఈ డ్రగ్‌కు గ్లోబల్ రెగ్యులేటరీ అధికారులు కూడా ఆమోదించారని వెల్లడించింది.(హెటిరో ‘కోవిఫర్’ ధర రూ.5,400) -
కరోనా: రెమ్డిసివిర్ మొదట ఆ 5 రాష్ట్రాలకే
సాక్షి, హైదరాబాద్ : కరోనా కట్టడి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో సంస్థ రూపొందించిన రెమ్డిసివియర్ ఔషధాన్ని ముందుగా అయిదు రాష్ట్రాలకు పంపించారు. ‘కోవిఫర్’ పేరుతో జనరిక్ మందు అమ్మకానికి ఇటీవల గ్రీన్‌సిగ్నల్ లభించగా.. భారత్‌లో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న ముంబై, ఢిల్లీ వంటి నగరాలతోపాటు తమిళనాడు, గుజరాత్, హైదరాబాద్ నగరాలకు 20,000 వేల ఇంజక్షన్లను అందించినట్లు హెటిరో తెలిపింది.రెండో విడత కింద కోల్‌కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చి, త్రివేండ్రం, పణజి నగరాలకు పంపనున్నట్లు పేర్కొంది. (కోవిడ్‌కు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ) కాగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టేందుకు హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో సంస్థ రెమ్డిసివిర్ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. `రెమ్డిసివిర్` ఔషధాన్ని ల్యాబ్‌లలో పరీక్ష చేసిన అనంతరం పాజిటివ్ రోగులుగా గుర్తించబడిన చిన్నారులు, యువత, కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రి పాలైన వారి చికిత్స కోసం వినియోగించవచ్చు. కోవిఫర్ (రెమ్డిసివిర్) 100 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. (కరోనా డ్రగ్ అమ్మకానికి గ్రీన్ సిగ్నల్) ఇక 100 మిల్లీగ్రాముల రెమ్డిసివిర్ ఔషధానికి 5,400 రూపాయలు ఖర్చవుతుందని హెటిరో సంస్థ పేర్కొంది. వచ్చే మూడు, నాలుగు వారాల్లో లక్ష డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని వివరించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కంపెనీలో ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మందు కేవలం వైద్యల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికే లభిస్తుందని, రిటైల్‌గా ఇవ్వబడదని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ వంశీ కృష్ణ బండి తెలిపారు. ఇక భారత్‌లో గురువారం నాటికి 4.73 లక్షల కోనా కేసులు వెలుగు చూడగా, 14,894 మంది మరణించారు. (కరోనాకు హైదరాబాద్ మెడిసిన్!) -
కోవిడ్‌కు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ
సాక్షి, హైదరాబాద్ : మానవాళిని గడగడలాడిస్తోన్న కోవిడ్ మహామ్మారికి హైదరాబాదీ మెడిసిన్ సిద్ధమైంది. నగరంలోని సుప్రసిద్ధ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో సంస్థ కరోనాను కట్టడిచేసే రెమ్డిసివిర్ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మేరకు కరోనా మహమ్మారిపై పోరాటంలో హెటిరో ఆదివారం కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ యాంటీ వైరల్ మెడిసిన్ (రెమ్డిసివిర్)` ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందినట్లు వెల్లడించింది. రెమ్డిసివిర్ హెటిరో జెనిరిక్ వెర్షన్‌కు ‘కోవిఫర్’ అనే పేరుతో భారతదేశంలో మార్కెట్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ ఇంజెక్షన్లను లక్షడోసుల మేర సిద్ధం చేశామని సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. (కరోనా డ్రగ్ అమ్మకానికి గ్రీన్ సిగ్నల్) ఈ సందర్భంగా హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ బి.పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ ‘భారతదేశంలో కోవిడ్-19 కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న తరుణంలో `కోవిఫర్` (రెమ్డిసివిర్) విజయవంతమైన క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని అందుబాటులోకి రావడం గేమ్ చేంజర్‌గా మారనుంది. బలమైన ఇంటిగ్రేషన్ సామర్థ్యాలను కలిగి ఉండటం వల్ల ఈ ఉత్పత్తి దేశవ్యాప్తంగా వెంటనే రోగులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నెలకొన్న అవసరాలకు తగిన రీతిలో రోగులకు తగినట్లుగా ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమవుతోంది. కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ప్రభుత్వం, వైద్య విభాగాలతో మేం నిరంతరం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపొందించిన `మేక్ ఇన్ ఇండియా` ప్రచారానికి తగినట్లుగా భారతదేశంలో ఈ ఉత్పత్తిని తీర్చిదిద్దాం’ అని ప్రకటించారు. డీసీజీఐచే అనుమతి పొందిన `రెమ్డిసివిర్` ఔషధాన్ని కోవిడ్ అనుమానితులు లేదా ల్యాబ్‌లలో పరీక్ష చేసిన అనంతరం పాజిటివ్ రోగులుగా గుర్తించబడిన చిన్నారులు, యువత, కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రి పాలైన వారి చికిత్స కోసం వినియోగించవచ్చు. కోవిఫర్ (రెమ్డిసివిర్) 100 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. వైద్యల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి దీనిని అందించవచ్చు. తక్కువ మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాల్లోని ప్రజలకు కోవిడ్-19 చికిత్స చేయడంలో భాగంగా గిలిడ్ సైన్సెస్ ఐఎన్‌సీ తో కుదుర్చుకున్న లైసెన్స్ ఒప్పందాన్ని అనుసరించి ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. -
కరోనా డ్రగ్ అమ్మకానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఔషధాన్ని తయారుచేసినట్లు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఔషధాన్ని విక్రయించేందుకు దేశీయ ఔషధ కంపెనీలు సిప్లా, హెటిరోకు అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి పత్రాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ఆదివారం ప్రకటించింది. ‘కోవిఫర్’ పేరుతో జనరిక్ మందు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు పేర్కొంది. ఈ డ్రగ్ రాబోయే రెండో వారాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది. (కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం) సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరకు మందును అందుబాటులో తీసుకువస్తామని హెటిరో ప్రతినిధులు తెలిపారు. ఇంజక్షన్ రూపంలో ‘కోవిఫర్ 100 ఎంజీ’ మార్కెట్లోకి రానుందని ఫార్మా కంపెనీ ప్రకటించింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారందరికీ ఈ ఇంజెక్షన్ పనిచేస్తుందని తెలిపింది. దీంతో కోవిడ్‌కు మందును కనిపెట్టిన ఘనత హైదరాబాద్ హెటిరోకి దక్కనుంది. ఇక కరోనా యాంటీ డ్రగ్ సిప్లా, హెటిరో సంస్థల ఆధ్వర్యంలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. (కరోనాకు హైదరాబాద్ మెడిసిన్!) -
కరోనాకు హైదరాబాద్ మెడిసిన్!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనాపై చేస్తున్న యుద్ధంలో నగరానికి చెందిన పలు ఫార్మా కంపెనీలు పాలు పంచుకుంటున్నాయి. వ్యాధి ఉధృతిని కట్టడిచేసే రెమ్డిసివిర్ ఔషధాన్ని సుమారు పది లక్షల డోసుల మేర తయారుచేసే బాధ్యతను ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో స్వీకరించింది. వచ్చే నెలలో అమెరికాకు చెందిన గిలాడ్ సైన్సెస్ సౌజన్యంతో ఈ ఔషధాన్ని తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేసే అవకాశాలున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇక కరోనా నియంత్రణకు వాడే లోపినవిర్, రిటొనవిర్ ఔషధాల తయారీలో నగరానికి చెందిన అరవిందో ల్యాబ్స్ సహా పలు ఫార్మా సంస్థలు నిమగ్నమయ్యాయి. కరోనా వ్యాక్సిన్ తయారీకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఏర్పాటుచేసిన బృందంలో నగరానికి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు చోటుదక్కింది. వ్యాక్సిన్ మరో 3–4 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్టు కంపెనీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మహానగరం పరిధిలో 1,500కు పైగా బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియట్ కంపెనీలు ఉన్నాయి. దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు పలు ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే, వైరస్ సంబ ంధిత జబ్బులను నియంత్రించే మందుల తయారీ బాధ్యతలకు నగరంలోని పలు ఔషధ కంపెనీలు శ్రీకారం చుట్టాయి. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో 24 గంటల పాటు పనిచేసేలా ఈ కం పెనీలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఏటా బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను మన నగరంలోని ఫార్మా కం పెనీలు దేశవిదేశాలకు ఎగుమతిచేస్తున్నాయి. -
కరోనా: హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ. 5 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి : కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ. 5 కోట్లు విరాళం అందజేసింది. ఈ సందర్భంగా హెటిరో గ్రూపు ఎండీ వంశీ కృష్ణ.. విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. దీంతోపాటు కోటి రూపాయలతో పీపీఈ కిట్స్, మందులు, మాస్క్‌లు అందజేశారు. విశాఖ జిల్లా కలెక్టర్‌కు సీఎస్ఆర్ ఫండ్స్‌తో పాటు నక్కపల్లిలో శానిటైజేషన్, మందులు, నిత్యావసర సరుకుల పంపిణీకి మరో రెండు కోట్లు అందజేశామని హెటిరో డ్రగ్స్ ప్రతినిధులు తెలిపారు. (అత్యవసర ప్రయాణాలకు ఏపీ సరికొత్త నిర్ణయం ) రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భాగంగా దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందజేసింది. ఈ మేరకు దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ బ్రహ్మనందరం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చెక్కును అందజేశారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం నందలూరు రాయల్ మెడికల్స్ ప్రొప్రైటర్ అరిగే మని.. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 100000/- లక్ష రూపాయలు పంపారు. (సీసీసీకి వైజయంతీ మూవీస్ రూ. 5 లక్షలు విరాళం) అమరావతి : కరోనా వ్యతిరేక పోరాటానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని రూ. 83 లక్షల 86 వేల 747 విరాళంగా అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు ఈ విరాళానికి సంబంధించిన డీడీను అందజేశారు. (నన్నే ఆపేస్తారా.. లేదు అరెస్టు చేస్తాం! ) -
ఎంపీపీతో అరబిందో, హెటిరో ఒప్పందాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హెచ్ఐవీ, హెపటైటిస్ సీ ఔషధాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితిలో భాగమైన మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ)తో అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్ తదితర ఆరు సంస్థలు సబ్లెసైన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అల్పాదాయ దేశాల ప్రజలకు అందుబాటు ధరలో మరిన్ని ఔషధాలను సరఫరా చేసేందుకు ఇవి ఉపయోగపడగలవని ఎంపీపీ ఈడీ గ్రెగ్ పెరీ తెలిపారు. ఇప్పటికే ఎంపీపీ భాగస్వామిగా ఉన్న అరబిందో కొత్తగా రెండు సబ్-లెసైన్సులు కుదుర్చుకుంది. మొదటి దాని కింద ఆఫ్రికా కోసం లొపినావిర్, రిటోనావిర్ ఉత్పత్తి చేయనుండగా, రెండో దాని కింద ఇతర కంపెనీలతో కలిసి బీఎంఎస్‌కి చెందిన హెపటైటిస్ సీ ఔషధం అభివృద్ధిలో పాలుపంచుకోనుందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ తెలిపారు. అటాజాన్విర్, రాల్టెగ్రావిర్ చౌక వెర్షన్లు తయారు చేసేందుకు సబ్-లెసైన్స్‌లు తోడ్పడనున్నట్లు హెటిరో డ్రగ్స్ డెరైక్టర్ భవేష్ షా వివరించారు. మరికొన్ని ఔషధాల కోసం లారస్, లుపిన్, జైడస్ తదితర సంస్థలు సబ్-లెసైన్సులు దక్కించుకున్నాయి. -
హెటిరో నుంచి క్యాన్సర్ చికిత్స ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ తాజాగా మెటాస్టాటిక్ కొలోరెక్టల్ క్యాన్సర్ (ఎంసీఆర్సీ) చికిత్సలో ఉపయోగపడే సిజుమాబ్టీఎం ఔషధాన్ని ప్రవేశపెట్టింది. 100 మి.గ్రా, 400 మి.గ్రా. మోతాదులో సింగిల్ డోస్‌గా ఇది లభిస్తుందని సంస్థ పేర్కొంది. బెవాసిజుమాబ్ కి ఇది బయోసిమిలర్ అని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఎండీ బి. పార్థసారథి రెడ్డి తెలిపారు. -
లాభాల కోసమే పెట్టుబడులు పెట్టాం
ప్రత్యేక కోర్టుకు నివేదించిన హెటిరో న్యాయవాది హైదరాబాద్: వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ జనని ఇన్ఫ్రాలో లాభాల కోసమే రూ.15 కోట్లు పెట్టుబడులు పెట్టామని హెటిరో డ్రగ్స్ తరఫు న్యాయవాది వి.పట్టాభి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. అలాగే జగతి పబ్లికేషన్స్‌లో రూ.4 కోట్లు పెట్టుబడి పెట్టామని వివరించారు. ఈ కేసులో తమను అక్రమంగా ఇరికించారని, తమ పేర్లను తొల గించాలని కోరుతూ హెటిరో సంస్థ, ఆ సంస్థ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డిలు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి శుక్రవారం మరోసారి విచారించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని జగన్ ప్రభావితం చేసి ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించారని సీబీఐ ఆరోపిస్తోందని, కేవలం జగన్‌ను ఇరికించేందుకే సీబీఐ ఈ రకమైన ఆరోపణ చేస్తోందని పిటిషన్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి సహాయకుడు సూరీడు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న వారందరిపై కేసులు ఎం దుకు పెట్టలేదని ప్రశ్నించారు. హెటిరో డ్రగ్స్‌పై మాత్రమే కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ కేసు నుంచి తమ పేర్లను తొల గించాలని కోరుతూ అరబిందో, ట్రైడెంట్ డ్రగ్స్ సంస్థలు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను న్యాయమూర్తి ఈనెల 27కు వాయిదా వేశారు. -
జడ్చర్ల హెటెరో డ్రగ్స్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని పోలేపల్లి ప్రాంతంలో ఉన్న హెటెరో డ్రగ్స్ లో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మికంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్కూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.