High-security number plates
-
నంబర్ ప్లేట్లులో సెక్యూరిటీ!
కర్నూలు నగరానికి చెందిన రఘు తన వాహనానికి బిగించుకున్న హై–సెక్యూరిటీ నంబరు ప్లేటు ఆరు నెలల్లోనే విరిగిపోయింది. నంబరు ప్లేటు లేదనే కారణంగా రూ.135 చలానా భారం పడింది. దీంతో విధిలేక సాధారణ నంబరు ప్లేటును సొంత ఖర్చుతో బిగించుకున్నాడు. ఒక్క రఘునే కాదు..జిల్లావ్యాప్తంగా చాలామంది వాహనదారులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: హై–సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు నాణ్యత లేకపోవడంతో వాహన దారుల జేబులు గుల్లవుతున్నాయి. వాటిని బిగించుకున్న ఆరు నెలల్లోపే విరిగిపోతున్నాయి. విరిగిన ప్లేట్లతో తిరుగుతున్న వాహనదారులపై అధికారులు చలానాల రూపంలో బాదుతున్నారు. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు చాలామంది తిరిగి కొత్తగా సాధారణ నంబర్ ప్లేట్లను బిగించుకోవాల్సి వస్తోంది. హై–సెక్యూరిటీ నంబర్ ప్లేటు కోసం ఒక్కొక్కరు ఇప్పటికే రూ.250 మేర ఖర్చు చేశారు. విరిగిన ప్లేటుతో తిరుగుతూ ఒక్కసారి పట్టుబడితే చలానా రూపంలో రూ.135 వరకూ బాదుతున్నారు. ఈ భారాన్ని తప్పించుకునేందుకు చాలామంది సొంత ఖర్చుతో సాధారణ నంబరు ప్లేట్లను బిగించుకుంటున్నారు. ఇది వారికి మరింత భారంగా మారుతోంది. హై–సెక్యూరిటీ పేరుతో నాణ్యతలేని నంబరు ప్లేట్లను సరఫరా చేసిన ప్రైవేటు ఏజెన్సీపై చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులు వెనకాడుతున్నారు. ఆ ఏజెన్సీకి అధికార పార్టీకి చెందిన ఎంపీ అండదండలు ఉండటమే ఇందుకు కారణం. ఆది నుంచి విమర్శలే... హై –సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల సరఫరా ఏజెన్సీ మీద మొదటి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టెండర్లు పిలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ టెండర్లు తామే పిలుచుకుంటామంటూ అక్కడ ఆందోళన జరిగింది. దీంతో ఏపీలో మాత్రమే ఈ పథకం అమలు ప్రారంభమయ్యింది. మొదట్లో ఆర్టీసీకి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ప్రైవేటు ఏజెన్సీకి కట్టబెట్టారు. ఢిల్లీకి చెందిన లింక్ ఆటోటెక్ అనే సంస్థ హై–సెక్యూరిటీ పేరుతో ఎటువంటి ప్రత్యేకతలూ లేని నంబరు ప్లేట్లను వాహనాలకు బిగిస్తోంది. రవాణా శాఖ అధికారులు సదరు ఏజెన్సీ కార్యాలయానికి ప్రత్యేక గది ఇచ్చి మరీ సహాయం చేస్తున్నారు. ఇక నంబరు ప్లేట్లను కూడా సదరు సంస్థ సకాలంలో సరఫరా చేయలేకపోతోంది. సాధారణ నంబర్ ప్లేట్ల మాదిరిగానే ఉన్న ఇవి మరీ నాసిరకంగా ఉంటున్నాయి. జిల్లాలో రోజుకు సగటున 150 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఒక్కో నంబరు ప్లేటుకు రూ.250 చొప్పున ప్రతిరోజూ వాహనదారులు రూ.37,500 ఖర్చు చేస్తున్నారు. అంటే ఏడాదికి రూ.1.37 కోట్ల మేర కేవలం నంబరు ప్లేట్ల కోసమే వెచ్చిస్తున్నారు. ఈ నంబరు ప్లేట్లు కాస్తా త్వరగా విరిగిపోతుండటంతో.. సాధారణ నంబర్ ప్లేట్లకు మరో రూ.కోటి మేర అదనపు భారం పడుతోందని అంచనా. అధికార పార్టీ అండదండలు ఢిల్లీకి చెందిన ఈ ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులకు అధికార పార్టీ నేతలతో సంబంధబాంధవ్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కాస్తా ఈ సంస్థను వెనకేసుకొస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఎటువంటి నాణ్యత లేకుండా నంబరు ప్లేట్లను సరఫరా చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు జిల్లా రవాణాశాఖ అధికారులు ఇప్పటికే విన్నవించారు. ఈ ఏజెన్సీని మార్చి.. ఆర్టీసీకి కాంట్రాక్టు అప్పగించాలని ఉన్నతాధికారులు కూడా సిఫారసు చేసినట్టు సమాచారం. ఇందుకు ప్రభుత్వ పెద్దలు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. దీంతో సదరు ప్రైవేటు ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. -
కొత్త వాహనాలకు ‘సెక్యూరిటీ’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సరికొత్త బాదుడుకు రంగం సిద్ధమైంది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ)ను ప్రస్తుతానికి కొత్త వాహనాలకే పరిమితం చేసినా... దశలవారీగా పాతవాటికీ ఈ నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా భద్రత, వాహనాల రక్షణకు సెక్యూరిటీ ప్లేట్లను అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా టెండర్ల ప్రక్రియను సాగదీసిన సర్కారు... ఎట్టకేలకు కాంట్రాక్టుకు ఖరారు చేసింది. తొలివిడతలో మన జిల్లాతోపాటు జంట నగరాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు రవాణా శాఖ సమాయత్తమైంది. బుధవారం నుంచి రోడ్డెక్కే వాహనాలకు సెక్యూరిటీ ప్లేట్లను అమర్చుకోవాలని నిర్దేశించింది. ఆ తర్వాతి దశలో పాత బండ్లకు కూడా ఈ ప్లేట్ల బిగించేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాహనదారుల జేబుకు భారీగా చిల్లు పడనుంది. ప్రస్తుతానికి ఇది నూతన వాహనదారులకే పరిమితం కానుండగా.. ఇప్పటికే సంప్రదాయ నంబ ర్ ప్లేట్లతో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులపై కొత్తగా భారం పడనుంది. జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ సగటున 500 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. అలాగే ఇప్పటికే జిల్లాలో సుమారు 15 లక్షల వ్యక్తిగత, రవాణా, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటన్నింటికి త్వరలోనే కొత్త నంబర్ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇదిలావుండగా.. ఈ నెల 11 నుంచి జిల్లాలోని మేడ్చల్, ఇబ్రహీంపట్నం, పరిగి, కూకట్పల్లి, కొండాపూర్, ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయాల్లో సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చే విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రవాణాశాఖ ఉప కమిషనర్ రమేశ్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఈ నంబర్‌ప్లేట్ వల్ల అన్నింటికంటే ముఖ్యంగా దొంగ రిజిస్ట్రేషన్లు, దొంగ వాహనాలను అరికట్టేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. సెక్యూరిటీ ఇలా..! రవాణా వాహనాలకు సంబంధించి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు పసుపు రంగు ప్లేటుపైనా నల్లరంగులో.. ఇతర వాహనాలకు తెల్ల ప్లేటుపై నల్ల రంగులో నంబర్లు రాసి ఉండాలి. రిజిస్ట్రేషన్ చిహ్నాలు ఇంగ్లిష్‌లో.. అంకెలు అరబిక్ భాషలో ఉండాలి. ప్లేట్లు ఐదేళ్లపాటు మన్నికలో ఉండేలా రూపొందిస్తారు. ప్లేటుపై క్రోమియం హాలోగ్రామ్, దీనిపై అశోక చిహ్నం, భారత్ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసి ఉంటుంది. ప్లేటుపై శాశ్వత గుర్తింపు నంబర్ ఏడు అంకెల్లో ముద్రిస్తారు. లేజర్ విధానంతో దీన్ని ఏర్పాటు చేస్తారు. అంకెల పరిమాణం 2.5 ఎంఎం ఉంటుంది. ఈ నంబర్లపై హార్ట్ స్టాంపింగ్ ఫిల్మ్, ఇండియా అని రాసి వుంటుంది. థర్డ్ రిజిస్ట్రేషన్ వాహనాల ప్లేటు 100ఎంఎం- 60 ఎం.ఎం. సైజులో ఉండాలి. కుడిపక్క దిగువన క్రోమియం హాలోగ్రామ్ స్టిక్కర్ 10ఎంఎం-10 ఎంఎం సైజులో ఉంటుంది. ఈ స్టిక్కర్‌పై రిజిస్ట్రేషన్ నంబర్ పది ఎంఎం సైజులో మధ్యలో ఉండాలి. రిజిస్ట్రేషన్ అథారిటీ పేరు పై భాగంలో ఉండాలి. ఇంజిన్/ఛాసిస్ నంబర్ స్టిక్కర్ కిందిభాగంలో ఎడమవైపున 2ఎం.ఎం సైజులో ఉంటుంది. వాహన ముందుభాగంలో ఏర్పాటు చేసే నంబర్ ప్లేటు విడదీయలేకుండా ఉండాలి. ఆర్టీఏ కార్యాలయాల్లో మినహా మరెక్కడా వీటిని అమర్చరు. ప్లేటు పొరపాటున దెబ్బతింటే పాత ప్లేటును విధిగా అప్పగించాల్సివుంటుంది.