సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సరికొత్త బాదుడుకు రంగం సిద్ధమైంది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ)ను ప్రస్తుతానికి కొత్త వాహనాలకే పరిమితం చేసినా... దశలవారీగా పాతవాటికీ ఈ నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా భద్రత, వాహనాల రక్షణకు సెక్యూరిటీ ప్లేట్లను అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా టెండర్ల ప్రక్రియను సాగదీసిన సర్కారు... ఎట్టకేలకు కాంట్రాక్టుకు ఖరారు చేసింది.
తొలివిడతలో మన జిల్లాతోపాటు జంట నగరాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు రవాణా శాఖ సమాయత్తమైంది. బుధవారం నుంచి రోడ్డెక్కే వాహనాలకు సెక్యూరిటీ ప్లేట్లను అమర్చుకోవాలని నిర్దేశించింది. ఆ తర్వాతి దశలో పాత బండ్లకు కూడా ఈ ప్లేట్ల బిగించేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాహనదారుల జేబుకు భారీగా చిల్లు పడనుంది. ప్రస్తుతానికి ఇది నూతన వాహనదారులకే పరిమితం కానుండగా.. ఇప్పటికే సంప్రదాయ నంబ ర్ ప్లేట్లతో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులపై కొత్తగా భారం పడనుంది. జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ సగటున 500 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. అలాగే ఇప్పటికే జిల్లాలో సుమారు 15 లక్షల వ్యక్తిగత, రవాణా, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటన్నింటికి త్వరలోనే కొత్త నంబర్‌ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇదిలావుండగా.. ఈ నెల 11 నుంచి జిల్లాలోని మేడ్చల్, ఇబ్రహీంపట్నం, పరిగి, కూకట్‌పల్లి, కొండాపూర్, ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయాల్లో సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చే విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రవాణాశాఖ ఉప కమిషనర్ రమేశ్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఈ నంబర్‌ప్లేట్ వల్ల అన్నింటికంటే ముఖ్యంగా దొంగ రిజిస్ట్రేషన్లు, దొంగ వాహనాలను అరికట్టేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
సెక్యూరిటీ ఇలా..!
- రవాణా వాహనాలకు సంబంధించి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు పసుపు రంగు ప్లేటుపైనా నల్లరంగులో.. ఇతర వాహనాలకు తెల్ల ప్లేటుపై నల్ల రంగులో నంబర్లు రాసి ఉండాలి. రిజిస్ట్రేషన్ చిహ్నాలు ఇంగ్లిష్‌లో.. అంకెలు అరబిక్ భాషలో ఉండాలి.
- ప్లేట్లు ఐదేళ్లపాటు మన్నికలో ఉండేలా రూపొందిస్తారు.
- ప్లేటుపై క్రోమియం హాలోగ్రామ్, దీనిపై అశోక చిహ్నం, భారత్ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసి ఉంటుంది. ప్లేటుపై శాశ్వత గుర్తింపు నంబర్ ఏడు అంకెల్లో ముద్రిస్తారు. లేజర్ విధానంతో దీన్ని ఏర్పాటు చేస్తారు. అంకెల పరిమాణం 2.5 ఎంఎం ఉంటుంది.
- ఈ నంబర్లపై హార్ట్ స్టాంపింగ్ ఫిల్మ్, ఇండియా అని రాసి వుంటుంది.
- థర్డ్ రిజిస్ట్రేషన్ వాహనాల ప్లేటు 100ఎంఎం- 60 ఎం.ఎం. సైజులో ఉండాలి. కుడిపక్క దిగువన క్రోమియం హాలోగ్రామ్ స్టిక్కర్ 10ఎంఎం-10 ఎంఎం సైజులో ఉంటుంది.
- ఈ స్టిక్కర్‌పై రిజిస్ట్రేషన్ నంబర్ పది ఎంఎం సైజులో మధ్యలో ఉండాలి. రిజిస్ట్రేషన్ అథారిటీ పేరు పై భాగంలో ఉండాలి. ఇంజిన్/ఛాసిస్ నంబర్ స్టిక్కర్ కిందిభాగంలో ఎడమవైపున 2ఎం.ఎం సైజులో ఉంటుంది.
- వాహన ముందుభాగంలో ఏర్పాటు చేసే నంబర్ ప్లేటు విడదీయలేకుండా ఉండాలి.
-
ఆర్టీఏ కార్యాలయాల్లో మినహా మరెక్కడా వీటిని అమర్చరు. ప్లేటు పొరపాటున దెబ్బతింటే పాత ప్లేటును విధిగా అప్పగించాల్సివుంటుంది.