నంబర్‌ ప్లేట్లులో సెక్యూరిటీ! | No quality in High-security number plates | Sakshi
Sakshi News home page

నంబర్‌ ప్లేట్లులో సెక్యూరిటీ!

Published Sun, Feb 25 2018 12:54 PM | Last Updated on Sun, Feb 25 2018 12:54 PM

No quality in High-security number plates - Sakshi

కర్నూలు నగరానికి చెందిన రఘు తన వాహనానికి బిగించుకున్న హై–సెక్యూరిటీ నంబరు ప్లేటు ఆరు నెలల్లోనే విరిగిపోయింది. నంబరు ప్లేటు లేదనే కారణంగా రూ.135 చలానా భారం పడింది. దీంతో విధిలేక సాధారణ నంబరు ప్లేటును సొంత ఖర్చుతో బిగించుకున్నాడు. ఒక్క రఘునే కాదు..జిల్లావ్యాప్తంగా చాలామంది వాహనదారులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  హై–సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లు నాణ్యత లేకపోవడంతో వాహన దారుల జేబులు గుల్లవుతున్నాయి. వాటిని  బిగించుకున్న ఆరు నెలల్లోపే విరిగిపోతున్నాయి. విరిగిన ప్లేట్లతో తిరుగుతున్న వాహనదారులపై అధికారులు చలానాల రూపంలో బాదుతున్నారు. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు చాలామంది తిరిగి కొత్తగా సాధారణ నంబర్‌ ప్లేట్లను బిగించుకోవాల్సి వస్తోంది. హై–సెక్యూరిటీ నంబర్‌ ప్లేటు కోసం ఒక్కొక్కరు ఇప్పటికే రూ.250 మేర ఖర్చు చేశారు. విరిగిన ప్లేటుతో తిరుగుతూ ఒక్కసారి పట్టుబడితే చలానా రూపంలో రూ.135 వరకూ బాదుతున్నారు. ఈ భారాన్ని తప్పించుకునేందుకు చాలామంది సొంత ఖర్చుతో సాధారణ నంబరు ప్లేట్లను బిగించుకుంటున్నారు. ఇది వారికి మరింత భారంగా మారుతోంది. హై–సెక్యూరిటీ పేరుతో నాణ్యతలేని నంబరు ప్లేట్లను సరఫరా చేసిన ప్రైవేటు ఏజెన్సీపై చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులు వెనకాడుతున్నారు. ఆ ఏజెన్సీకి అధికార పార్టీకి చెందిన ఎంపీ అండదండలు ఉండటమే ఇందుకు కారణం.

ఆది నుంచి విమర్శలే...
హై –సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్ల సరఫరా ఏజెన్సీ మీద మొదటి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టెండర్లు పిలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ టెండర్లు తామే పిలుచుకుంటామంటూ అక్కడ ఆందోళన జరిగింది. దీంతో ఏపీలో మాత్రమే ఈ పథకం అమలు ప్రారంభమయ్యింది. మొదట్లో ఆర్టీసీకి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ప్రైవేటు ఏజెన్సీకి కట్టబెట్టారు. ఢిల్లీకి చెందిన లింక్‌ ఆటోటెక్‌ అనే సంస్థ హై–సెక్యూరిటీ పేరుతో ఎటువంటి ప్రత్యేకతలూ లేని నంబరు ప్లేట్లను వాహనాలకు బిగిస్తోంది.

రవాణా శాఖ అధికారులు సదరు ఏజెన్సీ కార్యాలయానికి ప్రత్యేక గది ఇచ్చి మరీ సహాయం చేస్తున్నారు. ఇక నంబరు ప్లేట్లను కూడా సదరు సంస్థ సకాలంలో సరఫరా చేయలేకపోతోంది. సాధారణ నంబర్‌ ప్లేట్ల మాదిరిగానే ఉన్న ఇవి మరీ నాసిరకంగా ఉంటున్నాయి. జిల్లాలో రోజుకు సగటున 150 వాహనాలు రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. ఒక్కో నంబరు ప్లేటుకు రూ.250 చొప్పున ప్రతిరోజూ వాహనదారులు రూ.37,500 ఖర్చు చేస్తున్నారు. అంటే ఏడాదికి రూ.1.37 కోట్ల మేర కేవలం నంబరు ప్లేట్ల కోసమే వెచ్చిస్తున్నారు. ఈ నంబరు ప్లేట్లు కాస్తా త్వరగా విరిగిపోతుండటంతో.. సాధారణ నంబర్‌  ప్లేట్లకు మరో రూ.కోటి మేర అదనపు భారం పడుతోందని అంచనా.    

అధికార పార్టీ అండదండలు
ఢిల్లీకి చెందిన ఈ ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులకు అధికార పార్టీ నేతలతో సంబంధబాంధవ్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కాస్తా ఈ సంస్థను వెనకేసుకొస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఎటువంటి నాణ్యత లేకుండా నంబరు ప్లేట్లను సరఫరా చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు జిల్లా రవాణాశాఖ అధికారులు ఇప్పటికే విన్నవించారు. ఈ ఏజెన్సీని మార్చి.. ఆర్‌టీసీకి కాంట్రాక్టు అప్పగించాలని ఉన్నతాధికారులు కూడా సిఫారసు చేసినట్టు సమాచారం. ఇందుకు ప్రభుత్వ పెద్దలు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. దీంతో సదరు ప్రైవేటు ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement