Howrah - Yesvantpur Express
-
హెలీప్యాడ్ లేకపోవడంతో పొలంలోనే దిగిన ప్రధాని హెలీకాఫ్టర్
కొరాపుట్: అత్యంత విషాదకర ఘటనలో దేశంలో ప్రముఖులు ప్రోటోకాల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా పరామర్శలతో ముందుకు కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక హెలీకాఫ్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హెలీపాడ్ తయారు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడి పొలంలోనే ప్రధాని దిగారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోయినా చిన్న టెంట్లోనే సమీక్ష చేశారు. ఘటనపై రైల్వేమంత్రి అశ్వీని శ్రీవైష్ణవ్‌తో మాత్రమే ముక్తసరిగా మాట్లాడారు. అనంతరం బాలేశ్వర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి నవీన్ లేకపోవడం విశేషం. అంతకుముందు వచ్చిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయాల సమయం కాదని, సహాయ చర్యల సమయంగా ప్రకటించారు. -
ఆపద సమయం.. ఆదుకునే హృదయం
కొరాపుట్/రాయగడ/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, భద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమవంతు సాయం అందించేందుకు ముందుకు కదిలారు. భద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్పత్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వెయ్యి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు.. రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవాసమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు, రాయగడకు చెందిన ఒడిశా సత్యసాయి సేవాసమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరకవలస సునీల్‌కుమార్ మహంతి వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70మంది సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తీసుకు వచ్చిన ట్రాక్టర్లపై క్షతగాత్రులు, మృతదేహాలను ఆస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంత లేకపోవడంతో తామే స్వపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందిరి మన్ననలు పొందారు. ఎమ్మెల్యే బాహిణీపతి గొప్ప మనసు.. ప్రమాదం జరిగిన వెంటనే జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి గొప్ప మనసు చాటుకున్నారు. రాత్రి ఘటన జరిగిన సమయంలో భువనేశ్వర్ ఉన్న ఆయన.. సమాచారం తెలిసిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలతో బాలేశ్వర్ వెళ్లారు. తనతో వచ్చిన కార్యకర్తలతో కలిసి క్షతగాత్రులకు సేవలు అందజేశారు. సమీప ఆస్పత్రులకు వెళ్లి రోగులను పరామర్శించారు. తన సొంత ఖర్చులతో అవసరమైన నిత్యవసరాలు, ఆహారం అందజేసి, అందరి మన్ననలు పొందారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు.. బాలేశ్వర్ సమీపంలోని బహనాగ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెన్న తెలియజేశారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు వెయ్యి మందికి పైగా గాయాలైన వారిని, సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నామన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందజేసేందుకు ఎస్సీబీ, బారిపద మెడికల్ కేంద్రాలకు తరలించామన్నారు. మృతిచెందిన వారికి సంబంధించిన బాధిత కుటుంబాలు వచ్చి సరైన ఆధారాలను చూపిస్తే మృతదేహాలను అప్పగించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కొంతమంది మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించడం జరిగిందని వివరించారు. గుర్తించని మృతదేహాలను భద్రపరిచి, 72 గంటల వ్యవధిలో ఎటువంటి ఆచూకీ తెలియకపోతే నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. -
వేడెక్కిన రాజకీయం
కొరాపుట్/భువనేశ్వర్/రాయగడ: బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదం కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఊహించని సంకటంగా మారింది. రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్ ఒడిశాకు చెందిన రాజ్యసభ ఎంపీ. రాజస్థాన్‌కు చెందిన ఆయన.. ఐఏఎస్ అధికారిగా ఒడిశా కేడర్‌లో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందా రు. ఎన్డీఏ–2 అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశ్విన్ అనేక సంస్కరణ లు చేపట్టడంతో దేశవ్యాప్తంగా బీజేపికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. రైల్వేశాఖ మీద దశాబ్దాలు గా బెంగాల్, బీహార్ ఆధిపత్య జోరుకు కల్లెం పడింది. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రి ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లక్ష్యంగా మారారు. ఈ క్రమంలో దుర్ఘటన జరడం, రైల్వేశాఖ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో అశ్విన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వెనువెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన వెంట రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రప్పించుకున్నారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతం బాలేశ్వర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి ప్రతాప్ షడంగి నేతృత్వం వహించడం కూడా విపక్షాలకు మరో అవకాశంగా మారింది. ఈరైలు బెంగాల్–తమిళనాడు మధ్య రాకపోకలు సాగిస్తుండగా, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బీజేపీ తో సరిగ్గా పడదు. వారిద్దరూ కూడా పరిస్థితి గమనించి బీజేపీని ఇరుకున పెట్టేందుకు ముందుకు దిగారు. తమిళనాడు ముఖ్యమంత్రి తన రాష్ట్రం నుంచి మంత్రుల బృందం పంపించడం, అప్పటికే పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయలు దేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం క్షతగాత్రులకు వెంటనే నష్ట పరిహారం అందజేయ డం ప్రారంభించింది. ప్రధాని నరేంద్రమోదీ సైతం స్వయంగా రంగంలో దిగి ఒడిశా బయలుదేరారు. మరోవైపు, విశ్రాంత రైల్వే ఉన్నతాధికారులు తమ ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగినట్లు ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. -
ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్..
నిన్నటి వరకు ఎవరికీ తెలియని ఓ కుగ్రామం.. ఊహకందని విషాదంతో అపఖ్యాతి మూట గట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో రక్తాక్షరాలతో వందలాది మంది క్షతగాత్రుల హాహాకారాలకు వేదికై ంది. ఎటుచూసినా గుట్టులుగా పడి ఉన్న మృతదేహాలతో యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. తెగిపడిన అవయవాలు.. నిస్సహాయుల రోదనలు.. ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్.. భీతావహంగా కనిపించింది. – భువనేశ్వర్/కొరాపుట్/రాయగడ బహనాగా బజార్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన స్థలంలో భయానక దృశ్యాలు హృదయాన్ని కలచి వేశాయి. దుర్మరణం పాలైన వారి మృతదేహాలు ఘటనా స్థలంలో గుట్టలుగా పడి ఉన్నాయి. బంధు, మిత్ర వర్గాలు కోల్పోయిన ఆత్మీయులను గుర్తించేందుకు వీలైన సదుపాయాలను కల్పించడంలో రైల్వేశాఖ పూర్తిగా విఫలమైన అమానుష దృశ్యాలు తారసపడ్డాయి. శుక్రవారం రాత్రి సుమారు 7గంటలకు ప్రమాదం సంభవించగా.. శనివారం సాయంత్రం వరకు ఘటనా స్థలంలో మృతదేహాలను సురక్షితంగా పదిల పరచలేకపోవడం దీనికి తార్కాణంగా చెప్పవచ్చు. మృతదేహం సకాలంలో పదిల పరచకుంటే బాధిత కుటంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నా.. గుర్తించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధితులకు సకల సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని మోదీ మొదలుకొని అన్ని స్థాయిల మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రకటించినా.. హామీలు నీటిమీద రాతలుగా తారసపడ్డాయి. ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు(హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ఘటనా స్థలం బహనాగ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఈ సదుపాయం వాస్తవంగా తారస పడకపోవడం విచారకరం. స్వచ్ఛంద సేవలు అమూల్యం.. ఘటనా స్థలం పరిసరాల్లో స్థానికులు, సంస్థలు ఇతరేతర వర్గాలు బాధిత వర్గాలకు అందజేసిన వాస్తవ సహాయ సహకారాలు అమూల్యం. తాగునీరు, ఆహారం ఏర్పాట్లు నిరవధికంగా అందించి, ఆదుకున్నారు. బాలాసోర్, భద్రక్, కటక్ 3 జిల్లాల్లో పలు ఆస్పత్రుల్లో చేరిన బాధితులకు ఇదే తరహా సేవలతో ఆపత్కాలంలో బంధువులుగా ప్రత్యక్షమయ్యారు. ఆచూకీ లేని లగేజీ.. ఘటనా స్థలంలో ప్రయాణికుల బ్యాగులు ఇతరేతర లగేజీ చిందరవందరగా పడి ఉంది. బాధితుల ఆచూకీ తెలుసుకోవడంలో అయిన వారు వర్ణనాతీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా దుర్మరణం పాలైన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కటక్ ఎస్సీబీలో 193మంది భర్తీ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో గాయపడిన 193మందిని కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. వీరిలో 9మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ఆస్పత్రి అత్యవసర అధికారి డాక్టర్ భువనానంద మహరణ తెలిపారు. చికిత్స కోసం భర్తీ అయిన వారిలో ముగ్గురు 18 ఏళ్ల లోపు యువకులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. దుర్ఘటన నేపథ్యంలో అత్యవసర వైద్య, చికిత్స సేవల కోసం ఆస్పత్రి నేత్ర చికిత్స వార్డు పైఅంతస్తులో అదనంగా 100 పడకలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. నా మిత్రుడు ఏమయ్యాడో? రైలు దుర్ఘటనలో అనేక విషాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్పత్రులలో కోలుకుంటున్న వారు నెమ్మదిగా వాస్తవ పరిస్థితిలోకి వస్తున్నారు. ప్రస్తుతం భద్రక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సునీల్‌రామ్.. బీహార్‌కు చెందిన తన మిత్రుడు మనూ మహతో(25)తో కలిసి హౌరాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కా రు. వీరిద్దరూ చైన్నె వెళ్లాల్సి ఉంది. కానీ ఈ దుర్ఘట న జరగడంతో విడిపోయారు. ప్రస్తుతం సునీల్ భద్రక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనతో కలిసి ప్రయాణం చేసి తప్పిపోయిన మిత్రుడు ఆచూకీ కోసం ఆందరినీ అభ్యర్థిస్తున్నాడు. – సునీల్‌రామ్, మోతుబరి, బీహార్ స్థానిక ప్రజలు చేసిన సహాయం మరువలేనిదని రైలు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు చేసిన సహాయం మరువలేనిదని ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్ కొనియాడారు. శనివారం ఉదయం ఘటన జరిగిన ప్రాంతాన్ని సలహాదారుడు 5టీ కార్తికేయ పాండ్యన్‌తో కలిసి సందర్శించారు. అప్పటికే చేరుకున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ శ్రీ వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలేశ్వర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లిన సీఎం క్షతగాత్రులను పరామర్శించారు. స్థానికులు సకాలంలో ఆదుకోకపోతే తాము బతికి ఉండేవాళ్లం కాదని పలువురు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆస్పత్రి రోదనలతో మిన్నంటడంతో సీఎం కాసేపు మౌనం వహించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడుతూ ఘటన ప్రాంతంలో స్థానికులు అందించిన సాయం మరువలేనిదని కొనియాడారు. దారి మళ్లిన రైళ్లు.. రాయగడ: బహనాగలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం కోస్తారైల్వే పలు రైళ్లను దారి మచినట్లు ప్రకటించింది. భువనేశ్వర్, బాలేశ్వర్ మీదుగా ప్రయాణించాల్సి పలు రైళ్లు.. విశాఖపట్నం నుంచి విజయనగరం, రాయగడ, టిట్లాఘడ్, సంబల్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయన్నారు. ► బెంగలూర్–అగర్తల హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్(12503) టిట్లాఘడ్, విజయనగరం మీదుగా ప్రయాణిస్తుంది. ► సిలిఘాట్–తంబారం(15630) రైలు రౌర్కెలా, టాట్లాఘడ్, విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ► పాట్నా–ఎర్నాకులం(62644) రైలు అంగూ ల్, విశాఖపట్నం మీదుగా చేరుకుంటుంది. ► దాఘా నుంచి విశాఖపట్నం(22873) చేరాల్సిన రైలు సంబల్పూర్, అనుగూల్ మీదుగా ప్రయానిస్తుంది. ► బెంగళూర్–గౌహతి(12509) ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం, టిట్లాఘడ్, టాటానగర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ► సికింద్రబాద్–హౌరా(12704) రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. ► గుణుపూర్–విశాఖపట్నం(08521) పాసింజర్ రైలు 3గంటలు ఆలస్యంగా విశాఖపట్నం చేరుకుంటుంది. సీఎం నవీన్‌తో ఉదయనిధి స్టాలిన్ భేటీ ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్తో తమిళనాడుకు చెందిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ భేటీ అయ్యారు. ఆ రాష్ట్రమంత్రి ఎస్ఎస్ శివకుమార్‌తో కలిసి శనివారం రాత్రి భువనేశ్వర్‌లో నవీన్ నివాస్‌లో సంప్రదింపులు చేశారు. రైల్వే దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 5టీ కార్యదర్శి కార్తికేయ పాండ్యన్ ప్రమాద వివరాలు ఉదయనిధికి వివరించారు. ఇదిలా ఉండగా.. ఘటన జరిగిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, మంత్రులు, అధికారులను ఘటనా స్థలానికి పంపించారు. చైన్నె నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి, క్షతగాత్రుల బంధువులు ఒడిశా చేరుకునే చర్యలు తీసుకున్నారు. ప్రమాద తీవ్రత పెరగడంతో స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని నవీన్ వద్దకు పంపి.. సానుభూతి ప్రకగించారు. ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్.. రైలు ప్రమాదంలో గాయపడి భద్రక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ శనివారం పరామర్శించారు. వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందించాలని సూచించారు. మంత్రి ప్రమీల మల్లిక్ పరామర్శ.. బహనగా రైలు ప్రమాద ఘటనలో గాయపడి బాలేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ప్రమీల మల్లిక్ పరామర్శించారు. క్షతగాత్రులకు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను సంబంధిత అధికారులు పంపిణీచేస్తున్నారు. ఇందులో భాగంగా సొరొ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.50 వేలు చొప్పున అందిస్తున్నారు. రాజకీయాలకు సమయం కాదు: మమతా బెనర్జీ అంతకుముందు వచ్చిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయాల సమయం కాదని, సహాయక చర్యల సమయంగా ప్రకటించారు. మృతులలో 60శాతం మంది బెంగాలీలు ఉన్నారన్నారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున్న పరిహారాన్ని బెంగాల్ ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. పరామర్శించిన కేంద్రమంత్రులు.. ఘటనా స్థలాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్, కేంద్ర విద్య, మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించారు. వీరివురూ ఒడిశా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఇరువురూ కలిసి భద్రక్, బాలాసోర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి, తెలుసుకున్నారు. సత్వర చికిత్స అందించాలని సూచించారు. వారితో పాటు కేంద్ర మాజీమంత్రి, బాలాసోర్ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగి ఉన్నారు. -
అత్యంతఘోర రైలు ప్రమాదాలు..: మృత్యు శకటాలు
ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కోరమాండల్, హౌరా రైళ్ల ప్రమాద దృశ్యాలు భారతీయుల హృదయాలను కలచివేస్తున్నాయి. మన దేశంలో 1981లో బిహార్‌లో భాగమతి నదిలో పడిపోయిన రైలు ప్రమాదం ఇప్పటి వరకు అతి పెద్దది. ఈ ప్రమాదంలో 800 మందికిపైగా మరణించారు. అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇప్పటికీ మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. మన దేశ చరిత్రలో... 1. పాసింజర్ రైలు రాష్ట్రం : బీహార్ తేదీ : జూన్ 6, 1981 మృతుల సంఖ్య : 800 దేశంలో అతి పెద్దదే కాకుండా ప్రపంచంలో రెండో అతి పెద్ద రైలు ప్రమాదం ఇది. 1981 సంవత్సరం జూన్ 6న బీహార్‌లోని మన్సి నుంచి సహస్రకు వెళుతున్న పాసింజర్ రైలు భాగమతి నది వంతెనపై నుంచి వెళుతుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 800 మందికి పైగా మరణించారు. భయానకమైన తుఫాన్ బీహార్‌ను వణికిస్తున్న సమయంలో రైలులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తేలింది. నదిలో శవాలు కొట్టుకుపోవడంతో మృతుల సంఖ్యపై భిన్నకథనాలు వెలువడ్డాయి. మృతుల సంఖ్య 2 వేల వరకు ఉండవచ్చునని కూడా వార్తలు వచ్చాయి. నాలుగు పెళ్లి బృందాలు రైల్లో ఎక్కతే ఒక్కరి ప్రాణం కూడా మిగల్లేదు. 2 కాళింది–పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ రాష్ట్రం : ఉత్తరప్రదేశ్ తేదీ : ఆగస్టు 20, 1995 మృతుల సంఖ్య : 350కి పైగా ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో రెండు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1995 సంవత్సరం ఆగస్టు 20 తెల్లవారుజమాను 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్పూర్ నుంచి లక్నోకి వెళుతున్న ఈ రైలు నీల్గాయ్ సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో నిలిచింది. పూరీ నుంచి వస్తున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న కాళిందిని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. 3. అవధ్ ఎక్స్‌ప్రెస్–బ్రహ్మపుత్ర మెయిల్ రాష్ట్రం : పశ్చిమ బెంగాల్ తేదీ : ఆగస్టు 2, 1999 మృతుల సంఖ్య : 300 పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల ఉండే గైసాల్ స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి వస్తున్న అస్సాం అవద్ ఎక్స్‌ప్రెస్, గైసాల్ రైల్వే స్టేషన్లో ఉన్న బ్రహ్మపుత్ర మెయిల్‌ని ఢీకొట్టడంతో 300 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలతో ఒకే లైన్లోకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగింది 4. ఇండోర్–పట్నా ఎక్స్‌ప్రెస్ రాష్ట్రం : ఉత్తరప్రదేశ్ తేదీ : నవంబర్ 20, 2017 మృతుల సంఖ్య : 150 మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బీహార్‌లో పట్నా వరకు వెళుతున్న ఇండోర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 150 మందికిపైగా మరణించారు. 5. డెల్టా ప్యాసింజర్ రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్ తేదీ : అక్టోబర్ 29, 2005 మృతుల సంఖ్య : 120 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద సంభవించిన భారీ వరదలకు పట్టాలు కొట్టుకుపోవడంతో డెల్టా పాసింజర్ పట్టాలు తప్పింది. రైలులో 15 బోగీలు నీట మునిగాయి. ఈ ప్రమాదంలో 120 మంది వరకు జలసమాధి అయ్యారు. ప్రపంచ చరిత్రలో.. మాటలకందని మహా విషాదాలన్నో ప్రపంచ రైల్వే చరిత్రలో కన్నీటిని మిగిల్చాయి. 2004లో వచ్చిన సునామీ రాకాసి అలలు ఒక రైలునే ఏకంగా సముద్రంలో కలిపేయడం అత్యంత ఘోరమైన ప్రమాదంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో 1700 మంది జలసమాధి అయ్యారు. క్వీన్ ఆఫ్ ది సీ : శ్రీలంక ఏడాది: 2004 మృతులు: 1700 ప్రపంచ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం 2004లో సునామీ వచ్చినప్పుడు శ్రీలంకలో జరిగింది. ది క్వీన్ ఆఫ్ సీ రైలు శ్రీలంక టెల్వాట్ట మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో సముద్రం అలలు ముంచేసి రైలు బోగీలను సముద్రంలోకి ఈడ్చుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ మిషెల్: ఫ్రాన్స్ ఏడాది : 1917 మృతులు: 700 ఫ్రాన్స్ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం 1917లో జరిగింది. సెయింట్ మిషెల్–డి–మౌరినె ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 700 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఫ్రాన్స్‌లోని ఈ రైలు సెయింట్ మిషెల్ దగ్గర పట్టాలు తప్పింది. సియారా : రుమేనియా ఏడాది : 1917 మృతులు : 600 ఒకే ఏడాది ఫ్రాన్స్, రుమేనియాలో ఒకే విధంగా రైలు ప్రమాదాలు జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అతి వేగంగా వస్తున్న రుమేనియాలో రైలు సియారా రైల్వే స్టేషన్ సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పింది. అప్పుడు రైల్లో ఎక్కువగా సైనికులు, జర్మనీ శరణార్థులు ఉన్నారు. 800 మంది ప్రాణాలు కోల్పోయారు. గౌడలాజర ట్రైన్ : మెక్సికో ఏడాది : 1915 మృతులు : 600 మెక్సికోలో 2015 జనవరిలో గౌడలాజర రైలు మితి మీరిన వేగంతో వెళుతుండగా పట్టాలు తప్పింది. కొలిమా నుంచి గౌడలాజర వెళుతుండగా రైలు బ్రేకులు ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పిన రైలు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో 600 మంది మరణించారు. ఉఫా : రష్యా ఏడాది : 1989 మృతులు : 575 రష్యాలోని ఉఫా నుంచి ఆషా మధ్య రెండు పాసింజర్ రైళ్లు పక్క పక్క నుంచి వెళుతుండగా గ్యాస్ పైప్‌లైన్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. క్షణాల్లో బోగీలకు అంటుకోవడంతో 575 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Train Accident: లూప్లైన్లోకి మళ్లించినందుకే?
సాక్షి, విశాఖపట్నం: ఊహించని ఉత్పాతం.. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురై, వందల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడగా, మరికొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు దాని తీవ్రతను అంచనా వేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల 55 నిమిషాల 28 సెకన్లకు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తోంది. అదే సమయంలో ప్రమాదం సంభవించడంతో 6 గంటల 55 నిమిషాల 51 సెకన్లకు వేగం సున్నాకు పడిపోయింది. సాధారణంగా గంటకు దాదాపు 130 కి.మీ. వేగంతో వెళ్లే రైలు వేగం సున్నాకు చేరుకునేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే 60 నుంచి 80 సెకన్లకు పైగా సమయం పడుతుంది. కానీ, ప్రమాదం జరిగి 23 సెకన్లలోనే జీరో స్పీడ్‌కు చేరుకుందంటే పట్టాలపై ఉన్న గూడ్సు రైలును ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చని, దీన్నిబట్టి ప్రమాద తీవ్రతను ఊహించడానికే భయం కలుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అధికారులు ఏం చెబుతున్నారంటే... రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై స్పందించారు. సాయంత్రం 6.55 గంటల సమయంలో బహనాగ రైల్వేస్టేషన్ వద్ద స్టాప్ లేకపోవడంతో వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. పక్కన ఉన్న ట్రాక్‌పైకి కోరమండల్ కోచ్‌లు పడిపోయాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్ పడిపోయిన కోచ్‌లని ఢీకొట్టడంతో ఆ ట్రైన్‌కు సంబంధించిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని వివరించారు. అసలు జరిగిందేమిటి? అధికారులు చెబుతున్న దానికి, ప్రమాదం సంభవించిన పరిస్థితుల్ని గమనిస్తే.. ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు చూస్తే అక్కడ గూడ్స్ రైలు కూడా ఉందని స్పష్టమవుతోంది. స్టేషన్ వద్ద.. మధ్యలో ఉన్న లూప్లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. స్టేషన్లో స్టాప్ లేనప్పుడు రైలుకు మెయిన్ లైన్లో ట్రాక్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కోరమాండల్‌కు లూప్లైన్లో సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెయిన్ లైన్లో నుంచి వెళ్లకుండా లూప్లైన్లోకి రావడం వల్ల అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలుని బలంగా ఢీకొట్టడమే ప్రమాదానికి ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇది ముమ్మాటికీ రైల్వే శాఖ తప్పిదమని కొందరు సిబ్బంది చెబుతున్నారు. గంటకు 128 కి.మీ. వేగంతో వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకో గూడ్స్ రైలు బోగీపైకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా రైల్వే అధికారులు చేస్తున్న ప్రకటనలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
మైనర్ల అక్రమ రవాణా గుట్టురట్టు
-
మైనర్ల అక్రమ రవాణా గుట్టురట్టు
విశాఖ : పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో పెద్ద సంఖ్యలో పిల్లలను తరలిస్తుండగా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సుమారు 50 మంది పిల్లలను కోల్‌కతా నుంచి హుబ్లీకి తీసుకెళ్తుండగా విశాఖలో ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు. కాగా పిల్లలను తరలిస్తున్న వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లల అక్రమ రవాణా వెనుక గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.