ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కోరమాండల్, హౌరా రైళ్ల ప్రమాద దృశ్యాలు భారతీయుల హృదయాలను కలచివేస్తున్నాయి. మన దేశంలో 1981లో బిహార్‌లో భాగమతి నదిలో పడిపోయిన రైలు ప్రమాదం ఇప్పటి వరకు అతి పెద్దది. ఈ ప్రమాదంలో 800 మందికిపైగా మరణించారు. అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇప్పటికీ మనల్ని భయపెడుతూనే ఉన్నాయి.
మన దేశ చరిత్రలో...
1. పాసింజర్ రైలు
రాష్ట్రం : బీహార్
తేదీ : జూన్ 6, 1981
మృతుల సంఖ్య : 800
దేశంలో అతి పెద్దదే కాకుండా ప్రపంచంలో రెండో అతి పెద్ద రైలు ప్రమాదం ఇది. 1981 సంవత్సరం జూన్ 6న బీహార్‌లోని మన్సి నుంచి సహస్రకు వెళుతున్న పాసింజర్ రైలు భాగమతి నది వంతెనపై నుంచి వెళుతుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 800 మందికి పైగా మరణించారు. భయానకమైన తుఫాన్ బీహార్‌ను వణికిస్తున్న సమయంలో రైలులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తేలింది. నదిలో శవాలు కొట్టుకుపోవడంతో మృతుల సంఖ్యపై భిన్నకథనాలు వెలువడ్డాయి. మృతుల సంఖ్య 2 వేల వరకు ఉండవచ్చునని కూడా వార్తలు వచ్చాయి. నాలుగు పెళ్లి బృందాలు రైల్లో ఎక్కతే ఒక్కరి ప్రాణం కూడా మిగల్లేదు.
2 కాళింది–పురుషోత్తం ఎక్స్‌ప్రెస్
రాష్ట్రం : ఉత్తరప్రదేశ్
తేదీ : ఆగస్టు 20, 1995
మృతుల సంఖ్య : 350కి పైగా
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో రెండు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1995 సంవత్సరం ఆగస్టు 20 తెల్లవారుజమాను 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్పూర్ నుంచి లక్నోకి వెళుతున్న ఈ రైలు నీల్‌గాయ్ సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో నిలిచింది. పూరీ నుంచి వస్తున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న కాళిందిని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది.
3. అవధ్ ఎక్స్‌ప్రెస్–బ్రహ్మపుత్ర మెయిల్
రాష్ట్రం : పశ్చిమ బెంగాల్
తేదీ : ఆగస్టు 2, 1999
మృతుల సంఖ్య : 300
పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల ఉండే గైసాల్ స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి వస్తున్న అస్సాం అవద్ ఎక్స్‌ప్రెస్, గైసాల్ రైల్వే స్టేషన్‌లో ఉన్న బ్రహ్మపుత్ర మెయిల్‌ని ఢీకొట్టడంతో 300 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలతో ఒకే లైన్‌లోకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగింది
4. ఇండోర్–పట్నా ఎక్స్‌ప్రెస్
రాష్ట్రం : ఉత్తరప్రదేశ్
తేదీ : నవంబర్ 20, 2017
మృతుల సంఖ్య : 150
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బీహార్‌లో పట్నా వరకు వెళుతున్న ఇండోర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 150 మందికిపైగా మరణించారు.
5. డెల్టా ప్యాసింజర్
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
తేదీ : అక్టోబర్ 29, 2005
మృతుల సంఖ్య : 120
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద సంభవించిన భారీ వరదలకు పట్టాలు కొట్టుకుపోవడంతో డెల్టా పాసింజర్ పట్టాలు తప్పింది. రైలులో 15 బోగీలు నీట మునిగాయి. ఈ ప్రమాదంలో 120 మంది వరకు జలసమాధి అయ్యారు.
ప్రపంచ చరిత్రలో..
మాటలకందని మహా విషాదాలన్నో ప్రపంచ రైల్వే చరిత్రలో కన్నీటిని మిగిల్చాయి. 2004లో వచ్చిన సునామీ రాకాసి అలలు ఒక రైలునే ఏకంగా సముద్రంలో కలిపేయడం అత్యంత ఘోరమైన ప్రమాదంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో 1700 మంది జలసమాధి అయ్యారు.
క్వీన్ ఆఫ్ ది సీ : శ్రీలంక
ఏడాది: 2004
మృతులు: 1700
ప్రపంచ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం 2004లో సునామీ వచ్చినప్పుడు శ్రీలంకలో జరిగింది. ది క్వీన్ ఆఫ్ సీ రైలు శ్రీలంక టెల్వాట్ట మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో సముద్రం అలలు ముంచేసి రైలు బోగీలను సముద్రంలోకి ఈడ్చుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 1700 మంది ప్రాణాలు కోల్పోయారు.
సెయింట్ మిషెల్: ఫ్రాన్స్
ఏడాది : 1917
మృతులు: 700
ఫ్రాన్స్ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం 1917లో జరిగింది. సెయింట్ మిషెల్–డి–మౌరినె ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 700 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఫ్రాన్స్‌లోని ఈ రైలు సెయింట్ మిషెల్ దగ్గర పట్టాలు తప్పింది.
సియారా : రుమేనియా
ఏడాది : 1917
మృతులు : 600
ఒకే ఏడాది ఫ్రాన్స్, రుమేనియాలో ఒకే విధంగా రైలు ప్రమాదాలు జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అతి వేగంగా వస్తున్న రుమేనియాలో రైలు సియారా రైల్వే స్టేషన్ సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పింది. అప్పుడు రైల్లో ఎక్కువగా సైనికులు, జర్మనీ శరణార్థులు ఉన్నారు. 800 మంది ప్రాణాలు కోల్పోయారు.
గౌడలాజర ట్రైన్ : మెక్సికో
ఏడాది : 1915
మృతులు : 600
మెక్సికోలో 2015 జనవరిలో గౌడలాజర రైలు మితి మీరిన వేగంతో వెళుతుండగా పట్టాలు తప్పింది. కొలిమా నుంచి గౌడలాజర వెళుతుండగా రైలు బ్రేకులు ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పిన రైలు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో 600 మంది మరణించారు.
ఉఫా : రష్యా
ఏడాది : 1989
మృతులు : 575
రష్యాలోని ఉఫా నుంచి ఆషా మధ్య రెండు పాసింజర్ రైళ్లు పక్క పక్క నుంచి వెళుతుండగా గ్యాస్ పైప్‌లైన్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. క్షణాల్లో బోగీలకు అంటుకోవడంతో 575 మంది ప్రాణాలు కోల్పోయారు.
అత్యంతఘోర రైలు ప్రమాదాలు..: మృత్యు శకటాలు
Published Sun, Jun 4 2023 6:32 AM | Last Updated on Sun, Jun 4 2023 8:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment