human resources development
-
జాతీయ విద్యా విధానానికి ఆమోదం
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్ఆర్డీ) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనను బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇస్రో మాజీ చీఫ్ కే కస్తూరిరంగన్ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ తొలుత మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌లో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. విద్య, బోధన, సాధన ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించే దిశగా హెచ్ఆర్డీ శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చాలని ఈ కమిటీ సూచించింది. జాతీయ విద్యా విధానానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చదవండి : సినిమాలు, జిమ్స్ తెరవొచ్చు! -
వర్సిటీల్లో పరీక్షలు రద్దు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో జూలైలో జరగాల్సిన ఫైనల్ ఇయర్ పరీక్షలన్నీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేయనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇంటర్మీడియెట్, టెర్మినల్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను తిరిగి రూపొందించి, కొత్త విద్యా సంవత్సరం కేలండర్‌ను తయారు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గతంలో ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి హరియాణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్సీ కుహాద్ ఆధ్వర్యంలో యూజీసీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. కొత్త ఎకడమిక్ కేలండర్పై కసరత్తు చేస్తున్న ఈ ప్యానెల్ మరో వారం రోజుల్లో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తుందని హెచ్ఆర్డీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని రూపొందిస్తారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులు పూర్వ ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయించేలా కసరత్తు జరుగుతోంది. అయితే ఆ మార్కుల పట్ల విద్యార్థులెవరైనా అసంతృప్తిగా ఉంటే, కోవిడ్ తగ్గుముఖం పట్టాక జరిగే పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఇస్తారని అధికారులు వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రారంభం కావల్సి ఉన్న విద్యా సంవత్సరాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఎన్సీఈఆర్టీకి కొత్త మార్గదర్శకాలు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 1–5 క్లాస్‌ల వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి వీలుగా ఇన్ఫోగ్రాఫిక్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్ వంటివి అక్టోబర్ నాటికల్లా రూపొందించాలి. 6–12తరగతుల వారికి మార్చికల్లా సిద్ధంచేయాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేలా టీచర్లకు శిక్షణతరగతుల్ని డిసెంబర్‌నాటికి పూర్తి చేయాలి. 6–12తరగతుల విద్యార్థులకి ఆన్లైన్ బోధనకు టీచర్లకు శిక్షణ వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తి కావాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనే సదుపాయాలు లేని విద్యార్థులకు చదువు చెప్పడానికి సిలబస్‌ను, పుస్తకాల తయారీ పని డిసెంబర్‌కల్లా పూర్తి కావాలని కేంద్రం స్పష్టం చేసింది. -
ఆర్థిక అంశాలపైనే రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక అంశాలపైనే భవిష్యత్తు రాజకీయాలు కొనసాగుతాయని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో వర్తమాన ఆర్థిక పరిస్థితి – మూల్యాంకనంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ.. ఆర్థిక పరిణామాలు ఎటుపోతాయనేది రాజకీయ పార్టీలు చర్చించాలన్నారు. రాజకీయ రంగమే ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతుందని, అంతిమంగా ఆర్థిక వనరులను సరిగ్గా వినియోగించగలిగేది రాజకీయాలేనన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్థిక అంశాలపై అవగాహన పెం పొందించుకోవాలన్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టడం, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం కూడా కారణమేనని ప్రొఫెసర్ నరసింహారెడ్డి అన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు ప్రోత్స హించేందుకు కేంద్రం చర్యలు చేపట్టడంతో వాహ నాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయని వాటిని కొనడం మానేశారని ఎకనామిక్స్ ప్రొఫెసర్ అంజిరెడ్డి అన్నారు. -
అంకెల గారడీలో విద్యాప్రమాణాలు
రాష్ట్రంలో మానవవనరుల అభివద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాలు, అర్థసత్యాలు, అబద్ధాలతో నిండి ఉంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో ప్రమాణాలు, ఇతర అంశాలపై ప్రభుత్వం చూపుతున్న గణాంకాలు అంకెల గారడీ తప్ప మరేమీ కాదని వాస్తవిక పరిస్థితి చూస్తే స్పష్టమవుతుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా ప్రభుత్వ విభాగాల ద్వారా ప్రభుత్వం గణాంకాలు రూపొందింపచేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు వాటిని శ్వేతపత్రాల ద్వారా విడుదల చేసిందని అర్థమవుతోంది. బడ్జెట్ నిధుల కేటాయింపు నుంచి విద్యా ప్రమాణాల వరకు అన్ని అంశాల్లోనూ ఇదే పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాలుగున్నరేళ్ల కాలంలో హేతుబద్ధీకరణ పేరిట వేలాది పాఠశాలలను మూసివేసి గ్రామీణ ప్రాంత సామాన్య, నిరుపేద కుటుంబాల పిల్లలకు విద్యను దూరం చేసింది. ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ విద్యను వ్యాపారమయంగా మార్చేసింది. వేలాది రూపాయల ఫీజులు కట్టలేక, పిల్లల చదువులు ఆపలేక ఆయా కుటుంబాలు పాఠశాల విద్యనుంచే అప్పుల పాలు కావలసిన పరిస్థితులు నేడు రాష్ట్రంలో తాండవిస్తున్నాయి. టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీచేయకుండా మిగిలిపోయిన టీచర్లను వాటిలో సర్దుబాటు చేస్తూ నిరుద్యోగ యువతకూ మొండిచేయి చూపింది. రేషనలైజేషన్ పేరిట మూతపెట్టిన పాఠశాలల భవనాలు, మౌలిక సదుపాయాలను ప్రయివేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వ యూనివర్సిటీలను నీరుగారుస్తూ మరోపక్క ఫీజుల పేరిట విద్యార్థులను పీల్చిపిప్పిచేసే ప్రైవేటు యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ప్రభుత్వ సంస్థలకు భూములు లేవంటూనే ప్రయివేటు సంస్థలకు వందలాది ఎకరాలు కట్టబెడుతోంది. బడ్జెట్ నిధుల కేటాయింపులో గారడీ పాఠశాల విద్యలో బడ్జెట్ కేటాయింపులు గతంలో కన్నా భారీగా పెంచినట్లు ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొంటోంది. కానీ పీఆర్సీ, ఇతర అంశాల వల్ల పెరిగిన భారానికి తగ్గట్టుగానే ఆ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయే కానీ కొత్తగా విద్యాభివద్ధి కోసం కేటాయింపులు లేవన్నది నిజం. పైగా బడ్జెట్ కేటాయింపు నిధుల అంకెల్లో కూడా మతలబు చేస్తోంది. ఉదాహరణకు 2018–19 సంవత్సరానికి ఉన్నత విద్యాశాఖకు రూ.3349 కోట్లు కేటాయించినట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంటోంది. కానీ వాస్తవానికి ఉన్నత విద్యాశాఖ రూ.1,971 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే రాష్ట్రప్రభుత్వం కేటాయించినది కేవలం రూ. 1,452 కోట్లు మాత్రమేనని ఆ శాఖ అంతర్గత కేటాయింపు గణాంకాలు చెబుతు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రప్రభుత్వం విద్యారంగానికి యూజీసీ, రూసా, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖల ద్వారా ఇచ్చే నిధులను కూడా తన కేటాయింపుల కింద చూపిస్తూ గారడీ చేస్తోంది. పాఠశాలల మూసివేత రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ హేతుబద్ధీకరణ ప్రక్రియకు తెరలేపారు. పాఠశాలల్లో తగినంతమంది విద్యార్ధులు లేరన్న సాకుతో 5వేలకు పైగా స్కూళ్లను మూసివేయిం చారు. వీటిలో ఎక్కువగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలే ఉన్నాయి. ఇక్కడి విద్యార్థులను సమీపంలోని మరో పాఠశాలలో చేరాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. పాఠశాలలు లేక ఆయా గ్రామాల్లోని విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈపాఠశాలల్లోని టీచర్లను సైతం ఇతర పాఠశాలల్లో ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు చేశారు. సరిపడ విద్యార్థులు లేరంటూ పాఠశాలలు మూసి వేస్తున్న పాఠశాలల ప్రాంతాల్లో ప్రయివేటు పాఠశాలల ఏర్పాటు చేయిస్తోంది. పీజులతో నిలువుదోపిడీ రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలలను ప్రోత్సహించేలా ప్రభుత్వం కొత్త చట్టాలను కూడా చేస్తోంది. ఇందుకోసం ’సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్ ఇండిపెండెన్స్ స్కూల్స్ యాక్ట్’ను రూపొందించింది. దీని ప్రకారం ఇకపై ప్రయివేటుస్కూళ్లను కార్పొరేట్ సంస్థల ద్వారా ఏర్పాటు అవుతాయి. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి ఆజమాయిషీ ఉండదు. పిల్లల తల్లిదండ్రులు కూడా వీటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలులేదు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాలు లేక వేలాది మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి కింద ప్రయివేటులో బడ్జెటరీ స్కూళ్లను పెట్టుకొని కొనసాగుతున్నారు. అటు పేదలకు తక్కువ ఫీజులతో విద్యనందిస్తూ వీరు ఉపాధి పొందుతున్నారు. ఈ కొత్త చట్టం ద్వారా ఈ స్కూళ్లు కూడా మూతబడి వాటిస్థానంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ఏర్పాటుచేయాలన్నది ఈ చట్టం ఉద్దేశం. ఈ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు భారీగా ఉంటూ రాష్ట్రంలో ఎల్కేజీ విద్యనుంచే వేలు, లక్షలకు చేరుకొని పేద, సామాన్యుల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతూ నారాయణ, చైతన్య వంటి సంస్థల స్కూళ్లు వీధికొకటిగా పుట్టగొడుగుల్లా ఏర్పాటు అవుతున్నాయి. తప్పుడు లెక్కలపై కాగ్ అక్షింతలు రాష్ట్రంలోని విద్యాప్రమాణాలపై ప్రభుత్వం చూపించిన గణాంకాల తీరును పలు సందర్భాల్లో కాగ్ అక్షింతలూ వేసింది. విద్యార్థుల నమోదు పెంచామని, డ్రాపవుట్లను తగ్గించామని చూపించిన గణాంకాలు పాఠశాల విద్యాశాఖ ఒకలా సర్వశిక్ష అభియాన్ మరోలా పేర్కొనడాన్ని తప్పుబట్టింది. తప్పుడు అంకెలతో ప్రమాణాలు చూపిస్తున్నారని పలుమార్లు మండిపడింది. పదో తరగతి ప్రమాణాల్లో గణితంలో ప్రథమస్థానంలో, ఇతర సబ్జెక్టులలో రెండో స్థానంలో ఉన్నామని, విద్యాభివృద్ధిలో జాతీయస్థాయిలో ముందంజలో ఉన్నామని శ్వేతపత్రంలో పేర్కొంది. అయితే ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చూపిస్తోందన్న ఆరోపణలున్నాయి. డీఎస్సీకి చెల్లుచీటీ రాష్ట్రంలో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని డీఎస్సీని భర్తీచేయకుండా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. పాఠశాలల్లో టీచర్లు లేక విద్యాప్రమాణాలు అడుగంటుతున్నా ప్రభుత్వం పోస్టులను భర్తీచేయడం లేదు. రాష్ట్రంలో గత ఏడాదిలో 23వేల పోస్టులకుపైగా ఖాళీలున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. ఆ తరువాత రిటైరైన వారిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 30వేలకు పైగా చేరుతుంది. అయినా ప్రభుత్వం ఇటీవల డీఎస్సీలో కేవలం 7729 పోస్టులను మాత్రమే ప్రకటించింది. ఒకపక్క పాఠశాలల్లో చేరికలు భారీగా పెరుగుతున్నాయని శ్వేతపత్రంలో చూపుతూనే మరోపక్క టీచర్లు, విద్యార్థుల నిష్పత్తిని తక్కువగా చేసి చూపుతూ హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలలను మూసివేతకు సిద్ధపడుతోంది. ఉత్తీర్ణతలో పురోగతి.. నైపుణ్యాల్లో అథోగతి రాష్ట్రంలో ఎస్సెస్సీలో ఉత్తీర్ణత శాతాలు ఏటేటా పెరిగిపోతూ ఇప్పటికి 96 శాతానికి చేరుకోవడం విద్యారంగ నిపుణుల్ని విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబునాయుడు 1995లో అధికారం చేపట్టినప్పటినుంచే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అంతకు ముందు పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం పగడ్బందీగా జరిగేది. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రయివేటును ప్రోత్సహిస్తూ ఆ సంస్థలను పెంచుకుంటూ పోయారు. వాటిపై విద్యాశాఖకు పెత్తనం లేకుండా పోయింది. మాస్ కాపీయింగ్‌తో పాటు మూల్యాంకణంలోనూ అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటి వరకు ఉత్తీర్ణత శాతం 50 శాతానికి మించకుండా ఉండగా ఆతరువాత నుంచి క్రమేణా పెరుగుతూ ఏకంగా 96 శాతానికి వచ్చింది. ఇంత పెరిగినా ఆమేరకు ప్రమాణాలు ఉంటున్నాయా? అంటే అదీ లేదు. అయినా ప్రభుత్వం శ్వేతపత్రంలో అద్భుతమైన ఫలితాలు సాధించినట్లు పేర్కొంటుండడం విశేషం. ఇంటర్మీడియట్ విద్యలో ప్రయివేటుదే పెత్తనం రాష్ట్రంలో కీలకమైన ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా ప్రయివేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లో నడుస్తోంది. మొత్తం ఇంటర్మీడియట్ కాలేజీలు 3200 ఉండగా అందులో 2700 కాలేజీలు నారాయణ, శ్రీచైతన్య వంటి ప్రయివేటు కార్పొరేట్ సంస్థలవే. ప్రభుత్వం నిర్దేశిత నిబంధనలు వీటికి పట్టనేపట్టవు. ఫీజులు12500కు మించరాదని రూలు ఉన్నా ఈ కాలేజీలు రూ.లక్షల్లో వసూలు చేస్తూ విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయి. పలు సంస్థలు అక్రమంగా కాలేజీలకు అనుబంధంగా హాస్టళ్లను నిర్వహిస్తూ రూ.3 లక్షలవరకు పిండుకుంటు న్నాయి. వీటికి కనీసం అనుమతులూ లేవు. విద్యార్థులను జైళ్లలో పెట్టినట్లు బంధించి చదువుల పేరిట తీవ్ర ఒత్తిళ్లు పెడుతుండటంతో గత కొన్నేళ్లలో వందల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటికి కారణమైన కాలేజీలపై చర్యలు తీసుకోకపోవడం అటుంచి స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో వాటికి మరింత వెన్నుదన్నుగా చంద్రబాబు నిలిచారు. ఆత్మహత్యల నివారణకు నిపుణులు కమిటీలు ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలు తప్ప అమలు కావడం లేదు. సర్కారు యూనివర్సిటీలు నిర్వీర్యం చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలోని ప్రభుత్వ వర్సిటీలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రయివేటు యూనివర్సిటీలకు భూములు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తూ అదే సమయంలో ప్రభుత్వ వర్సిటీలకు నిధులు, ఇతర వనరులను సమకూర్చకుండా నిర్లిప్తత దాలుస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా జిల్లాకొక యూనివర్సిటీ చొప్పున దాదాపు అన్నిచోట్లా ఏర్పాట్లుచేయగా కొత్తగా ఒక్క ప్రభుత్వ వర్సిటీని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. ఏకంగా 11 ప్రయివేటు వర్సిటీలకు భూములను మాత్రం కట్టబెట్టారు. ప్రభుత్వ వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నా భర్తీచేయలేదు. 4వేల బోధనా పోస్టులు ఖాళీగా ఉన్నా రేషనలైజేషన్ పేరిట వాటిని కుదించి 1385 చేశారు. వేలాదిమంది విద్యార్థులు ఎలాంటి ప్రమాణాలు లేకుండానే పట్టాలు చేతపట్టుకొని బయటకు వస్తున్నారు. శ్వేతపత్రాల్లో చూపిస్తున్న అంశాలు ఒకటి కాగా ప్రభుత్వం నిర్దిష్ట విద్యాలక్ష్యాల మెరుగుకు ఈ నాలుగున్నరేళ్లలో చేసిన కృషి అంతంతమాత్రమేనన్నది సుస్పష్టం. - సీహెచ్.శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి -
పొత్తిళ్లలోనే ప్రాణాలు పోతున్నాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి సూచికలు నేల చూపులు చూస్తున్నాయి. మాతా, శిశు మరణాలను తగ్గించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటివి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయి. కాన్పు సమయంలో తల్లీబిడ్డల మరణాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది ఆచరణలో సఫలం కావడం లేదని తాజాగా ప్రణాళికా శాఖ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో శిశు మరణాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మూడు త్రైమాసికాలను పరిశీలిస్తే తొలి త్రైమాసికంలో శిశు మరణాల సంఖ్య కంటే ఆ తరువాత రెండు, మూడు త్రైమాసికాల్లో మరణాల సంఖ్య పెరగడం గమనార్హం. నెలకు 782 మంది చొప్పున ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో 7,037 మంది శిశువులు మృతిచెందారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6,966 మంది పసిబిడ్డలు మరణించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లోనే అంతకంటే ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రెండో త్రైమాసికం కంటే మూడో త్రైమాసికంలో శిశు మరణాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. చిత్తూరు జిల్లాలో రెండో త్రైమాసికంలో 164 శిశు మరణాలు సంభవించగా, మూడో త్రైమాసికంలో ఆ సంఖ్య 253కి పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండో త్రైమాసికంలో 29 మంది, మూడో త్రైమాసికంలో 60 మంది శిశువులు మృతిచెందారు. పసిప్రాయం.. పౌష్టికాహారానికి దూరం కాన్పు సమయంలో తల్లుల మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో మాతా మరణాల సంఖ్య 517 కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లోనే 460 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లల్లో పెరుగుదల లోపం ఉన్న వారు గతంలో 27.7 శాతం కాగా, ప్రస్తుతం 31.4 శాతానికి పెరింది. ఐదేళ్ల లోపు పిల్లల్లో బరువు తక్కువగా ఉన్న వారు గతంలో 27.3 శాతం కాగా, ఇప్పుడు 31.9 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో 10 లక్షల మంది గర్భిణులు రక్తహీనత, కాల్షియం లోపంతో బాధపడుతున్నారని, వీరిలో కేవలం 3.1 లక్షల మందికే పౌష్టికాహారం అందుతోందని ప్రణాళికా శాఖ నివేదిక స్పష్టం చేసింది. అలాగే ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న 19 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, 15.58 లక్షల మందికే అందుతోందని వెల్లడించింది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు వయసున్న 24 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, 8.31 లక్షల మందికే పేర్కొంది. -
దేశంలో తగ్గుతున్న పేదరికం
సాక్షి, హైదరాబాద్: దేశంలో పేదరికం తగ్గుముఖం పడుతోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహా దారు డాక్టర్ అరవింద్ సుబ్రహ్మణియన్ అన్నారు. దేశంలో కొనసాగుతున్న సుస్థిరాభివృధ్ధి దశల వారీగా పేదరికాన్ని తగిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం మానవ వనరుల అభివృధ్ధి కేంద్రంలో జరిగిన ‘దేశ పురోగతి విధానం, భవిష్యత్తు’అన్న అంశంపై జరిగిన సద స్సుకు ఆయన ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 30 ఏళ్ల భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై సుబ్రహ్మణియన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఏకే గోయల్, జీఆర్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
వారిపై సస్పెన్షన్ ఎత్తివేయండి: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ : సస్పెన్షన్‌కు గురైన అయిదుగురు ఢిల్లీ యూనివర్శిటీ అధికారులపై వేటు ఎత్తివేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం వర్శిటీ వైస్ చాన్సులర్ను కోరారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని తాను వ్యక్తిగతంగా కోరుతున్నట్లు ఆమె ట్విట్ చేశారు. కాగా స్మృతి ఇరానీ విద్యార్హత ధ్రువ పత్రాలను లీక్ చేశారంటూ అధికారులను నిన్న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 2004 ఎన్నికల సమయంలో స్మృతి ఇరానీ ఎన్నికల అఫిడవిట్లో తాను 1996లో ఢిల్లీ యూనివర్సిటీ దూరవిద్యా విభాగం నుంచి బీఏ పూర్తి చేశానని పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం తాను 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూరవిద్యా విభాగం ద్వారా బీకామ్ ప్రథమ సంవత్సరం మాత్రమే చదివినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.