అంకెల గారడీలో విద్యాప్రమాణాలు | Analysis On Chandrababu White Paper Over Human Resources Development | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 2 2019 8:15 AM | Last Updated on Wed, Jan 2 2019 8:15 AM

Analysis On Chandrababu White Paper Over Human Resources Development - Sakshi

రాష్ట్రంలో మానవవనరుల అభివద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాలు, అర్థసత్యాలు, అబద్ధాలతో నిండి ఉంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో ప్రమాణాలు, ఇతర అంశాలపై ప్రభుత్వం చూపుతున్న గణాంకాలు అంకెల గారడీ తప్ప మరేమీ కాదని వాస్తవిక పరిస్థితి చూస్తే స్పష్టమవుతుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా ప్రభుత్వ విభాగాల ద్వారా ప్రభుత్వం గణాంకాలు రూపొందింపచేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు వాటిని శ్వేతపత్రాల ద్వారా విడుదల చేసిందని అర్థమవుతోంది. బడ్జెట్‌ నిధుల కేటాయింపు నుంచి విద్యా ప్రమాణాల వరకు అన్ని అంశాల్లోనూ ఇదే పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతోంది.

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాలుగున్నరేళ్ల కాలంలో హేతుబద్ధీకరణ పేరిట వేలాది  పాఠశాలలను మూసివేసి గ్రామీణ ప్రాంత సామాన్య, నిరుపేద కుటుంబాల పిల్లలకు విద్యను దూరం చేసింది. ప్రయివేటు కార్పొరేట్‌ విద్యాసంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ విద్యను వ్యాపారమయంగా మార్చేసింది. వేలాది రూపాయల ఫీజులు కట్టలేక, పిల్లల చదువులు ఆపలేక ఆయా కుటుంబాలు పాఠశాల విద్యనుంచే అప్పుల పాలు కావలసిన పరిస్థితులు నేడు రాష్ట్రంలో తాండవిస్తున్నాయి. టీచర్‌ పోస్టుల ఖాళీలను భర్తీచేయకుండా మిగిలిపోయిన టీచర్లను వాటిలో సర్దుబాటు చేస్తూ నిరుద్యోగ యువతకూ మొండిచేయి చూపింది. రేషనలైజేషన్‌ పేరిట మూతపెట్టిన పాఠశాలల భవనాలు, మౌలిక సదుపాయాలను ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వ యూనివర్సిటీలను నీరుగారుస్తూ మరోపక్క ఫీజుల పేరిట విద్యార్థులను పీల్చిపిప్పిచేసే ప్రైవేటు యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ప్రభుత్వ సంస్థలకు భూములు లేవంటూనే ప్రయివేటు సంస్థలకు వందలాది ఎకరాలు కట్టబెడుతోంది.

బడ్జెట్‌ నిధుల కేటాయింపులో గారడీ
పాఠశాల విద్యలో బడ్జెట్‌ కేటాయింపులు గతంలో కన్నా భారీగా పెంచినట్లు ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొంటోంది. కానీ పీఆర్సీ, ఇతర అంశాల వల్ల పెరిగిన భారానికి తగ్గట్టుగానే ఆ బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయే కానీ కొత్తగా విద్యాభివద్ధి కోసం కేటాయింపులు లేవన్నది నిజం. పైగా బడ్జెట్‌ కేటాయింపు నిధుల అంకెల్లో కూడా మతలబు చేస్తోంది. ఉదాహరణకు 2018–19 సంవత్సరానికి ఉన్నత విద్యాశాఖకు రూ.3349 కోట్లు కేటాయించినట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంటోంది. కానీ వాస్తవానికి ఉన్నత విద్యాశాఖ రూ.1,971 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే  రాష్ట్రప్రభుత్వం కేటాయించినది కేవలం రూ. 1,452 కోట్లు మాత్రమేనని ఆ శాఖ అంతర్గత కేటాయింపు గణాంకాలు చెబుతు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రప్రభుత్వం విద్యారంగానికి యూజీసీ, రూసా, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖల ద్వారా ఇచ్చే నిధులను కూడా తన కేటాయింపుల కింద చూపిస్తూ గారడీ చేస్తోంది.

పాఠశాలల మూసివేత
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ హేతుబద్ధీకరణ ప్రక్రియకు తెరలేపారు. పాఠశాలల్లో తగినంతమంది విద్యార్ధులు లేరన్న సాకుతో 5వేలకు పైగా స్కూళ్లను మూసివేయిం చారు. వీటిలో ఎక్కువగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలే ఉన్నాయి. ఇక్కడి విద్యార్థులను సమీపంలోని మరో పాఠశాలలో చేరాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. పాఠశాలలు లేక ఆయా గ్రామాల్లోని విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈపాఠశాలల్లోని టీచర్లను సైతం ఇతర పాఠశాలల్లో ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు చేశారు. సరిపడ విద్యార్థులు లేరంటూ పాఠశాలలు మూసి వేస్తున్న పాఠశాలల ప్రాంతాల్లో ప్రయివేటు పాఠశాలల ఏర్పాటు చేయిస్తోంది.

పీజులతో నిలువుదోపిడీ
రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలలను ప్రోత్సహించేలా ప్రభుత్వం కొత్త చట్టాలను కూడా చేస్తోంది. ఇందుకోసం ’సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్‌ ఇండిపెండెన్స్‌ స్కూల్స్‌ యాక్ట్‌’ను రూపొందించింది. దీని ప్రకారం ఇకపై ప్రయివేటుస్కూళ్లను కార్పొరేట్‌ సంస్థల ద్వారా ఏర్పాటు అవుతాయి. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి ఆజమాయిషీ ఉండదు. పిల్లల తల్లిదండ్రులు కూడా వీటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలులేదు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాలు లేక వేలాది మంది  నిరుద్యోగులు స్వయం ఉపాధి కింద ప్రయివేటులో బడ్జెటరీ స్కూళ్లను పెట్టుకొని కొనసాగుతున్నారు. అటు పేదలకు తక్కువ ఫీజులతో విద్యనందిస్తూ వీరు ఉపాధి పొందుతున్నారు. ఈ కొత్త చట్టం ద్వారా ఈ స్కూళ్లు కూడా మూతబడి వాటిస్థానంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఏర్పాటుచేయాలన్నది ఈ చట్టం ఉద్దేశం. ఈ కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులు భారీగా ఉంటూ రాష్ట్రంలో ఎల్‌కేజీ విద్యనుంచే  వేలు, లక్షలకు చేరుకొని పేద, సామాన్యుల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతూ నారాయణ, చైతన్య వంటి సంస్థల స్కూళ్లు వీధికొకటిగా పుట్టగొడుగుల్లా ఏర్పాటు అవుతున్నాయి.

తప్పుడు లెక్కలపై కాగ్‌ అక్షింతలు
రాష్ట్రంలోని విద్యాప్రమాణాలపై ప్రభుత్వం చూపించిన గణాంకాల తీరును పలు సందర్భాల్లో కాగ్‌ అక్షింతలూ వేసింది. విద్యార్థుల నమోదు పెంచామని, డ్రాపవుట్లను తగ్గించామని చూపించిన గణాంకాలు పాఠశాల విద్యాశాఖ ఒకలా సర్వశిక్ష అభియాన్‌ మరోలా పేర్కొనడాన్ని తప్పుబట్టింది. తప్పుడు అంకెలతో ప్రమాణాలు చూపిస్తున్నారని పలుమార్లు మండిపడింది. పదో తరగతి ప్రమాణాల్లో గణితంలో ప్రథమస్థానంలో, ఇతర సబ్జెక్టులలో రెండో స్థానంలో ఉన్నామని, విద్యాభివృద్ధిలో జాతీయస్థాయిలో ముందంజలో ఉన్నామని శ్వేతపత్రంలో పేర్కొంది. అయితే ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చూపిస్తోందన్న ఆరోపణలున్నాయి.

డీఎస్సీకి చెల్లుచీటీ
రాష్ట్రంలో వేలాది టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని డీఎస్సీని భర్తీచేయకుండా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. పాఠశాలల్లో టీచర్లు లేక విద్యాప్రమాణాలు అడుగంటుతున్నా ప్రభుత్వం పోస్టులను భర్తీచేయడం లేదు. రాష్ట్రంలో గత ఏడాదిలో 23వేల పోస్టులకుపైగా ఖాళీలున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. ఆ తరువాత రిటైరైన వారిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 30వేలకు పైగా చేరుతుంది. అయినా ప్రభుత్వం ఇటీవల డీఎస్సీలో కేవలం 7729 పోస్టులను మాత్రమే ప్రకటించింది. ఒకపక్క పాఠశాలల్లో చేరికలు భారీగా పెరుగుతున్నాయని శ్వేతపత్రంలో చూపుతూనే మరోపక్క టీచర్లు, విద్యార్థుల నిష్పత్తిని తక్కువగా చేసి చూపుతూ హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలలను మూసివేతకు సిద్ధపడుతోంది.

ఉత్తీర్ణతలో పురోగతి.. నైపుణ్యాల్లో అథోగతి
రాష్ట్రంలో ఎస్సెస్సీలో ఉత్తీర్ణత శాతాలు ఏటేటా పెరిగిపోతూ ఇప్పటికి 96 శాతానికి చేరుకోవడం విద్యారంగ నిపుణుల్ని విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబునాయుడు 1995లో అధికారం చేపట్టినప్పటినుంచే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అంతకు ముందు పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం పగడ్బందీగా జరిగేది. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రయివేటును ప్రోత్సహిస్తూ ఆ సంస్థలను పెంచుకుంటూ పోయారు. వాటిపై విద్యాశాఖకు పెత్తనం లేకుండా పోయింది. మాస్‌ కాపీయింగ్‌తో పాటు మూల్యాంకణంలోనూ అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటి వరకు ఉత్తీర్ణత శాతం 50 శాతానికి మించకుండా ఉండగా ఆతరువాత నుంచి క్రమేణా పెరుగుతూ ఏకంగా 96 శాతానికి వచ్చింది. ఇంత పెరిగినా ఆమేరకు ప్రమాణాలు ఉంటున్నాయా? అంటే అదీ లేదు. అయినా ప్రభుత్వం శ్వేతపత్రంలో అద్భుతమైన ఫలితాలు సాధించినట్లు పేర్కొంటుండడం విశేషం.

ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రయివేటుదే పెత్తనం
రాష్ట్రంలో కీలకమైన ఇంటర్మీడియట్‌ విద్య పూర్తిగా ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో నడుస్తోంది. మొత్తం ఇంటర్మీడియట్‌ కాలేజీలు 3200 ఉండగా అందులో 2700 కాలేజీలు నారాయణ, శ్రీచైతన్య వంటి ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థలవే. ప్రభుత్వం నిర్దేశిత నిబంధనలు వీటికి పట్టనేపట్టవు. ఫీజులు12500కు మించరాదని రూలు ఉన్నా ఈ కాలేజీలు రూ.లక్షల్లో వసూలు చేస్తూ విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయి. పలు సంస్థలు అక్రమంగా కాలేజీలకు అనుబంధంగా హాస్టళ్లను నిర్వహిస్తూ రూ.3 లక్షలవరకు పిండుకుంటు న్నాయి. వీటికి కనీసం అనుమతులూ లేవు. విద్యార్థులను జైళ్లలో పెట్టినట్లు బంధించి చదువుల పేరిట తీవ్ర ఒత్తిళ్లు పెడుతుండటంతో గత కొన్నేళ్లలో వందల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటికి కారణమైన కాలేజీలపై చర్యలు తీసుకోకపోవడం అటుంచి స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో వాటికి మరింత వెన్నుదన్నుగా చంద్రబాబు నిలిచారు. ఆత్మహత్యల నివారణకు నిపుణులు కమిటీలు ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలు తప్ప అమలు కావడం లేదు.

సర్కారు యూనివర్సిటీలు నిర్వీర్యం
చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలోని ప్రభుత్వ వర్సిటీలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రయివేటు యూనివర్సిటీలకు భూములు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తూ అదే సమయంలో ప్రభుత్వ వర్సిటీలకు నిధులు, ఇతర వనరులను సమకూర్చకుండా నిర్లిప్తత దాలుస్తున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా జిల్లాకొక యూనివర్సిటీ చొప్పున దాదాపు అన్నిచోట్లా ఏర్పాట్లుచేయగా కొత్తగా ఒక్క ప్రభుత్వ వర్సిటీని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. ఏకంగా 11 ప్రయివేటు వర్సిటీలకు భూములను మాత్రం కట్టబెట్టారు. ప్రభుత్వ వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నా భర్తీచేయలేదు. 4వేల బోధనా పోస్టులు ఖాళీగా ఉన్నా రేషనలైజేషన్‌ పేరిట వాటిని కుదించి 1385 చేశారు. వేలాదిమంది విద్యార్థులు ఎలాంటి ప్రమాణాలు లేకుండానే పట్టాలు చేతపట్టుకొని బయటకు వస్తున్నారు. శ్వేతపత్రాల్లో చూపిస్తున్న అంశాలు ఒకటి కాగా ప్రభుత్వం నిర్దిష్ట విద్యాలక్ష్యాల మెరుగుకు ఈ నాలుగున్నరేళ్లలో చేసిన కృషి అంతంతమాత్రమేనన్నది సుస్పష్టం.
- సీహెచ్‌.శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement