3800 కు పైగా విమానాలు రద్దు
వాషింగ్టన్ : హైతీలో మాథ్యూ హరికేన్ సృష్టించిన విలయం అమెరికాను, అక్కడి విమానాశ్రయాలను వణికిస్తోంది. దాదాపు 339 మందిని పొట్టన పెట్టుకున్న మాథ్యూ హరికేన్ ప్రకంపనలతో విమానాశ్రయాల్లో కూడా విపత్తు వాతావరణం నెలకొంది. ఈ మృత్యు తుఫాను ఫ్లోరిడా దిశగా పయనిస్తుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సుమారు 3,862 విమానాలను బుధవారం మరియు శనివారం మధ్య రద్దు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. మరోవైపు పామ్ బీచ్ విమానాశ్రయాన్ని తెరిచి వుంచినప్పటికీ, ప్రధాన కార్యకలాపాలు స్థంభించాయి. వాణిజ్య విమానాలను నిలిపివేశారు.
2005 సం.రంలో కత్రినా హరికేన్ తర్వాత లాడర్డల్-హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మూత పడడం ఇదే మొదటిసారి. మాథ్యూ విలయం కారణంగా గురువారం సాయంత్రం నాటికి మూసివేయబడింది. ఫ్లైట్స్ అవేర్. కాం ప్రకారం దాదాపు 3,862 విమానాలను రద్దు చేశారు. బుధవారం మరియు శనివారం మధ్య రద్దు చేసినట్టు ఎబిసి న్యూస్ రిపోర్ట్ చేసింది. కాగా లెస్ ఆంగ్లాయిస్ ప్రాంతాన్ని ముందుగా తాకిన ఈ మాథ్యూ హరికేన్ అనంతరం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ ను తాకనుందని అధికారులు అంచనావేస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరోలినా రాష్ట్రాలలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ వార్తలతో ఫ్లోరిడా రాష్ట్రంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇసుక తుఫానులా మాథ్యూ తరముకొస్తోంది....ఈ తుఫాను మిమ్మల్మి చంపేసే ప్రమాదం ఉంది, ఒక భూతంలా ముంచుకొస్తోంది జాగ్రత్త పడాలని ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మాథ్యూ తూర్పు తీరంలో విధ్వంసకర ప్రభావాన్ని పడవేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. 580 మైళ్ళ అట్లాంటిక్ తీరం అంతటా నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా కోరారు.