Hydro Carbon Project
-
చర్చలు విఫలం
♦ కమిటీ సమావేశం రద్దు ♦ కొనసాగుతున్న ఉద్యమం ♦ సంతకాల సేకరణ ♦ రాజ్ భవన్ ముట్టడి యత్నం – అరెస్టు ♦ కమలనాథులపై గరం గరం నెడువాసల్ ఉద్యమకారుల్ని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో సాగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. సోమవారం కూడా ఉద్యమాన్ని ఆ పరిసర గ్రామాల ప్రజలు కొనసాగించారు. రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి, చెన్నై: హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పుదుకోట్టై జిల్లా నెడు వాసల్‌లో 20 రోజులుగా ఉద్యమం సాగుతోంది. ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు సాగినా, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి, యువ సమూహం మద్దతుతో ఉప్పెనలా ఎగసి పడుతున్నది. ఉద్యమకారుల్ని బుజ్జగించేందుకు ఆ జిల్లా కలెక్టర్ రాజేష్, ఎస్పీ లోకనాథన్ నేతృత్వంలో అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఆదివారం రాత్రంతా ఈ బృందం ఉద్యమ కమిటీతో సమావేశమైంది. ఉద్యమకారులు ఉంచిన అనేక డిమాండ్లకు, సంధించిన ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానాలు కరువైనట్టు సమాచారం. పలు రకాలుగా హామీలు గుప్పించినా, ఏ మాత్రం ఉద్యమకారులు వెనక్కు తగ్గలేదు. ఉద్యమ కమిటీ సమావేశానంతరం సోమవారం మధ్యాహ్నం నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఉద్యమకారులు అధికారులకు హామీ ఇచ్చారు. అయితే ఉద్యమ కమిటీ సమావేశం రద్దు కావడం, ఉద్యమం కొనసాగడం గమనార్హం. ఆ పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉద్యమ వేదిక వద్ద బైఠాయించారు. దీక్ష ఉప సంహరించుకుంటారని అధికారులు భావించినా, ఉద్యమకారులు ఏ మాత్రం తగ్గని దృష్ట్యా, మళ్లీ చర్చల కసరత్తుల్లో పడ్డారు. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు నెడువాసల్ నుంచి తమిళనాడు సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ సంఘం శ్రీకారం చుట్టింది. తమ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, తమకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ వర్గాలు గళాన్ని వినిపిస్తుండడం ఉద్యమకారుల్లో ఆక్రోశాన్ని రగుల్చుతోం. బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా తాము స్పందించాల్సి ఉంటుందన్న హెచ్చరికల్ని నెడువాసల్ వేదికగా ఉద్యమకారులు చేశారు. తాత్కాలిక హామీలు కాదు అని, తమకు భవిష్యత్తు ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బీజేపీ నేత హెచ్ రాజా అక్కడికి రాగా, ఆయన్ను అడ్డుకునే విధంగా యువత వ్యవహరించడం గమనార్హం. రాజ్‌భవన్ ముట్టడి: నెడువాసల్ ఉద్యమానికి మద్దతుగా చెన్నైలో పురట్చి కరై ఇలైంజర్ ఇయక్కం కదిలింది. ఆ ఇయక్కంకు చెందిన వారు రాజ్‌భవన్ ముట్టడి నినాదంతో ఉదయం దూసుకెళ్లారు. హైడ్రో కార్బన్ ప్రాజెక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను డిమాండ్ చేస్తూ చలో రాజ్ భవన్ తో ముందుకు సాగారు. వీరిని మార్గమధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారిని బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. -
ఉద్యమ బాట
► తగ్గేది లేదన్నఉద్యమ నేతలు ► బెడిసి కొట్టిన సీఎం ప్రయత్నాలు ► ఇక మరింత ఉధృతం ► అణగదొక్కేందుకు కసరత్తులు ► బలగాల మోహరింపు ► ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఉద్యమాన్ని కొనసాగించేందుకు నెడువాసల్ ఉద్యమకారులు నిర్ణయించారు. హైడ్రోకార్బన్ ప్రాజెక్టు రద్దు ప్రకటన వెలువడే వరకు ఉద్యమం కొనసాగుతుందని, మరింత ఉధృతం చేయనున్నట్టు ఉద్యమ నేతలు ప్రకటించారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాలుసాగుతున్నాయి. నెడువాసల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షి, చెన్నై:పుదుకోట్టై జిల్లా నెడువాసల్ వేదికగా హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఉద్యమకారులతో బుధవారం సీఎం ఎడపాటి కే పళనిస్వామి భేటీ అయ్యారు. అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదన్న భరోసా ఇచ్చారు. అయితే సీఎం ప్రయత్నాలు బెడిసి కొ ట్టాయి. ఆయన హామీలు సంతృప్తికరంగా లేని దృష్ట్యా, ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్లేందుకు ఉద్యమకారులు నిర్ణయించారు. కేంద్రం దిగి వచ్చి ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించేవరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తీరుతామన్న ప్రతిజ్ఞను గురువారం నెడువాసల్ పరిసర గ్రామాల్లోని ప్రజలు చేశారు. పాఠశాల స్థాయి పిల్లలు, యువత సైతం తరలి వచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ, వివిధ రూపాల్లో నిరసనలు, పరిస్థితిని బట్టి ఆమరణ దీక్ష సైతం చేపట్టేందుకు తగ్గ కసరత్తులతో ఉద్యమకారులు ముందుకు సాగుతుండడంతో ఉత్కంఠ బయల్దేరింది. ఈ ఉద్యమానికి మద్దతుగా చెన్నై వళ్లువర్‌కోట్టం వద్ద సినీనటుడు లారెన్స్ నేతృత్వంలో నిరసనకు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు చివరి క్షణంలో అనుమతి నిరాకరించారు. ముందుగానే అక్కడకు చేరుకున్న యువతను పోలీసులు బలవంతంగా తొలగించారు. బలగాల మోహరింపు: నెడువాసల్ ఉద్యమాన్ని అణగొక్కేందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టుంది. సీఎం హామీ ఇచ్చినా ఉద్యమకారులు వెనక్కు తగ్గక పోవడంపై కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో నెడువాసల్ పరిసరాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా అడ్డుకునే విధంగా చెక్ పోస్టులు ఏర్పాటు అయ్యాయి. బలగాల్ని మరింత కట్టుదిట్టం చేయడంతో ఉత్కంఠ బయల్దేరింది. ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ: హైడ్రో ప్రాజెక్టు నిమిత్తం చాప కింద నీరులా తవ్విన బోరు బావుల రూపంలో ముప్పు ఇప్పటికే బయల్దేరినట్టు అనేక గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ వేదికపై ప్రసంగించే ఆయా గ్రామాల ప్రజలు తమ తమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలను వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్టైకాడు పరిసరాలను ‘సిటిజన్’ సినిమా తరహాలో కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు, ఇక్కడ జరిగిన తవ్వకాల పరిశోధనల కారణంగా పిల్లలు మానసిక వికలాంగులుగా, అంతు చిక్కని వ్యాధులతో బాధ పడాల్సి ఉందని కన్నీటి పర్యంతం కావడం అక్కడి వారిని కలచి వేసింది. వనక్కాడులో గతంలో పదిహేను వందల అడుగుల లోతులో ఏర్పాటు చేసిన బోరు బావి కారణంగా, క్యాన్సర్ బారిన పడి పది మంది మరణించి ఉన్నట్టు, మరో 25 మంది ఆ వ్యాధితో బాధ పడుతున్నట్టు అక్కడి ప్రజలు పూర్తి వివరాలను ఉద్యమ వేదిక ముందుకు తీసుకురావడం గమనించాలి్సన విషయం.