► తగ్గేది లేదన్నఉద్యమ నేతలు
► బెడిసి కొట్టిన సీఎం ప్రయత్నాలు
► ఇక మరింత ఉధృతం
► అణగదొక్కేందుకు కసరత్తులు
► బలగాల మోహరింపు
► ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ
సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఉద్యమాన్ని కొనసాగించేందుకు నెడువాసల్ ఉద్యమకారులు నిర్ణయించారు. హైడ్రోకార్బన్ ప్రాజెక్టు రద్దు ప్రకటన వెలువడే వరకు ఉద్యమం కొనసాగుతుందని, మరింత ఉధృతం చేయనున్నట్టు ఉద్యమ నేతలు ప్రకటించారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాలుసాగుతున్నాయి. నెడువాసల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
సాక్షి, చెన్నై:పుదుకోట్టై జిల్లా నెడువాసల్ వేదికగా హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఉద్యమకారులతో బుధవారం సీఎం ఎడపాటి కే పళనిస్వామి భేటీ అయ్యారు. అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదన్న భరోసా ఇచ్చారు. అయితే సీఎం ప్రయత్నాలు బెడిసి కొ ట్టాయి. ఆయన హామీలు సంతృప్తికరంగా లేని దృష్ట్యా, ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్లేందుకు ఉద్యమకారులు నిర్ణయించారు. కేంద్రం దిగి వచ్చి ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించేవరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తీరుతామన్న ప్రతిజ్ఞను గురువారం నెడువాసల్ పరిసర గ్రామాల్లోని ప్రజలు చేశారు. పాఠశాల స్థాయి పిల్లలు, యువత సైతం తరలి వచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ, వివిధ రూపాల్లో నిరసనలు, పరిస్థితిని బట్టి ఆమరణ దీక్ష సైతం చేపట్టేందుకు తగ్గ కసరత్తులతో ఉద్యమకారులు ముందుకు సాగుతుండడంతో ఉత్కంఠ బయల్దేరింది. ఈ ఉద్యమానికి మద్దతుగా చెన్నై వళ్లువర్‌కోట్టం వద్ద సినీనటుడు లారెన్స్ నేతృత్వంలో నిరసనకు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు చివరి క్షణంలో అనుమతి నిరాకరించారు. ముందుగానే అక్కడకు చేరుకున్న యువతను పోలీసులు బలవంతంగా తొలగించారు.
బలగాల మోహరింపు: నెడువాసల్ ఉద్యమాన్ని అణగొక్కేందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టుంది. సీఎం హామీ ఇచ్చినా ఉద్యమకారులు వెనక్కు తగ్గక పోవడంపై కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో నెడువాసల్ పరిసరాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా అడ్డుకునే విధంగా చెక్ పోస్టులు ఏర్పాటు అయ్యాయి. బలగాల్ని మరింత కట్టుదిట్టం చేయడంతో ఉత్కంఠ బయల్దేరింది.
ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ: హైడ్రో ప్రాజెక్టు నిమిత్తం చాప కింద నీరులా తవ్విన బోరు బావుల రూపంలో ముప్పు ఇప్పటికే బయల్దేరినట్టు అనేక గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ వేదికపై ప్రసంగించే ఆయా గ్రామాల ప్రజలు తమ తమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలను వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోట్టైకాడు పరిసరాలను ‘సిటిజన్’ సినిమా తరహాలో కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు, ఇక్కడ జరిగిన తవ్వకాల పరిశోధనల కారణంగా పిల్లలు మానసిక వికలాంగులుగా, అంతు చిక్కని వ్యాధులతో బాధ పడాల్సి ఉందని కన్నీటి పర్యంతం కావడం అక్కడి వారిని కలచి వేసింది. వనక్కాడులో గతంలో పదిహేను వందల అడుగుల లోతులో ఏర్పాటు చేసిన బోరు బావి కారణంగా, క్యాన్సర్ బారిన పడి పది మంది మరణించి ఉన్నట్టు, మరో 25 మంది ఆ వ్యాధితో బాధ పడుతున్నట్టు అక్కడి ప్రజలు పూర్తి వివరాలను ఉద్యమ వేదిక ముందుకు తీసుకురావడం గమనించాలి్సన విషయం.