చర్చలు విఫలం | One hydrocarbon project, many fault lines | Sakshi
Sakshi News home page

చర్చలు విఫలం

Published Tue, Mar 7 2017 3:06 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

చర్చలు విఫలం - Sakshi

చర్చలు విఫలం

♦ కమిటీ సమావేశం రద్దు
♦  కొనసాగుతున్న ఉద్యమం
♦ సంతకాల సేకరణ
♦ రాజ్‌ భవన్ ముట్టడి యత్నం – అరెస్టు
♦  కమలనాథులపై గరం గరం

నెడువాసల్‌ ఉద్యమకారుల్ని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో సాగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. సోమవారం కూడా ఉద్యమాన్ని ఆ పరిసర గ్రామాల ప్రజలు కొనసాగించారు. రాజ్‌ భవన్  ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

సాక్షి, చెన్నై: హైడ్రో కార్బన్  ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పుదుకోట్టై జిల్లా నెడు వాసల్‌లో 20 రోజులుగా ఉద్యమం సాగుతోంది. ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు సాగినా, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి, యువ సమూహం మద్దతుతో ఉప్పెనలా ఎగసి పడుతున్నది. ఉద్యమకారుల్ని బుజ్జగించేందుకు ఆ జిల్లా కలెక్టర్‌ రాజేష్, ఎస్పీ లోకనాథన్ నేతృత్వంలో అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఆదివారం రాత్రంతా ఈ బృందం ఉద్యమ కమిటీతో సమావేశమైంది. ఉద్యమకారులు ఉంచిన అనేక డిమాండ్లకు, సంధించిన ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానాలు కరువైనట్టు సమాచారం. పలు రకాలుగా హామీలు గుప్పించినా, ఏ మాత్రం ఉద్యమకారులు వెనక్కు తగ్గలేదు.

ఉద్యమ కమిటీ సమావేశానంతరం సోమవారం మధ్యాహ్నం నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఉద్యమకారులు అధికారులకు హామీ ఇచ్చారు. అయితే ఉద్యమ కమిటీ సమావేశం రద్దు కావడం, ఉద్యమం కొనసాగడం గమనార్హం. ఆ పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉద్యమ వేదిక వద్ద బైఠాయించారు. దీక్ష ఉప సంహరించుకుంటారని అధికారులు భావించినా, ఉద్యమకారులు ఏ మాత్రం తగ్గని దృష్ట్యా, మళ్లీ చర్చల కసరత్తుల్లో పడ్డారు.

ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు  నెడువాసల్‌ నుంచి తమిళనాడు సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ సంఘం శ్రీకారం చుట్టింది. తమ  ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, తమకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ వర్గాలు గళాన్ని వినిపిస్తుండడం ఉద్యమకారుల్లో ఆక్రోశాన్ని రగుల్చుతోం. బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా తాము స్పందించాల్సి ఉంటుందన్న హెచ్చరికల్ని నెడువాసల్‌ వేదికగా ఉద్యమకారులు చేశారు. తాత్కాలిక హామీలు కాదు అని,  తమకు భవిష్యత్తు ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బీజేపీ నేత హెచ్‌ రాజా అక్కడికి రాగా, ఆయన్ను అడ్డుకునే విధంగా యువత వ్యవహరించడం గమనార్హం.

రాజ్‌భవన్  ముట్టడి:  నెడువాసల్‌ ఉద్యమానికి మద్దతుగా చెన్నైలో పురట్చి కరై ఇలైంజర్‌ ఇయక్కం కదిలింది. ఆ ఇయక్కంకు చెందిన వారు రాజ్‌భవన్ ముట్టడి నినాదంతో ఉదయం దూసుకెళ్లారు. హైడ్రో కార్బన్ ప్రాజెక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను డిమాండ్‌ చేస్తూ చలో రాజ్‌ భవన్ తో ముందుకు సాగారు. వీరిని మార్గమధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారిని బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement