ice hotel
-
గాంధీజీని ఐస్ చేశాడు!
జాతిపితమహాత్మకు మనదేశంలోనేగాక ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలతోపాటు విగ్రహాలు కూడా పెట్టుకుంటుంటారు. తాజాగా జాతిపితకు మరోఅరుదైన గౌరవం దక్కింది. కెనడాలోని ప్రముఖ హోటల్ ఒకటి మహాత్ముని ఐస్ విగ్రహాన్ని తయారు చేసింది. కెనడాలోని క్యూబెక్ సిటీలో ఉన్న ‘హోటల్ డి గ్లేస్’లో ఏర్పాటు చేసిన మహాత్ముని మంచు విగ్రహాన్ని ప్రముఖ శిల్పి మార్క్ లిపైర్ చెక్కారు. తొమ్మిది ఐస్ గడ్డలతో ఏడడుగుల మంచు విగ్రహాన్ని ఐదు గంటల్లోనే ఆయన పూర్తి చేశారు. గాంధీ విగ్రహం తయారు చేయడం తనకెంతో సంతోషమని లిపైర్ చెప్పాడు. ఈ ఏడాది భారతదేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంగా ఈ శిల్పాన్ని ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది. టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ ఈ విగ్రహ ఫోటోలను ట్విటర్లో పోస్టు చేస్తూ.. ‘ఆజాదీకా అమత్మహోత్సవ్’ అని హ్యాష్ ట్యాగ్ క్యాప్షన్‌తో ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా హోటల్ డి గ్లేస్ అనేది కెనడా దేశంలో ఐకానిక్ హోటల్. కెనడాలోనే గాక ఉత్తర అమెరికాలో ఉన్న ఏకైక ఐస్ హోటల్ డిగ్లేస్ కావడం విశేషం. -
మంచు హోటల్: ఎండాకాలంలో కూడా కరగదట
ఎంత పెద్ద ఐసు గడ్డ అయినా రెండు నిమిషాలు ఎండలో పెడితే కరగడం మొదలు పెడుతుంది. అటువంటిది ఐస్‌తో నిర్మించిన ఓ హోటల్ ఎండాకాలంలో కూడా కరగదట. ఏ సీజన్లోనైనా ఈ ఐస్ హోటల్ పర్యాటకులకు ఆతిథ్యం ఇస్తుందని హోటల్ యాజమాన్యం చెబుతోంది. ఎండలో కూడా కరగని చిత్రమైన హోటల్ ఉత్తర స్వీడన్‌లోని జకాస్జర్వీ అనే గ్రామంలో ఉంది. 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హోటల్లో అనేక మంచు కళా ఖండాలతో ఆకర్షణీయమైన డిలక్స్ సూట్లు ఉన్నాయి. హోటల్ మొత్తాన్నీ స్టీల్, కాంక్రీట్‌తో నిర్మించారు. పై కప్పును 20 సెంటీమీటర్ల ఇన్సులేషన్‌తో నిర్మించడం వల్ల ఎండాకాలం లో కూడా హోటల్ కరగదు. ఇన్నీ హంగులున్న ఈ హోటల్ పేరు ‘ఐస్ హోటల్ 365’ పేరుకు తగ్గట్టుగానే ఇది సంవత్సరం మొత్తం పర్యాటకులకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ హోటల్లో ఎంతో సౌకర్యవంతమైన బెడ్స్, టాయిలెట్స్ ఉన్నాయి. మొత్తం తొమ్మిది రకాల డిలక్స్ రూంలను మూడు పద్దతుల్లో అందుబాటులో ఉంచుతారు. స్వీడన్‌లోని కిరుణ ఎయిర్‌పోర్టు నుంచి ఈ హోటల్‌కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రతిఏటా ఈ హోటల్‌ను 50 నుంచి 60 వేలమంది వరకు సందర్శిస్తుంటారు. ఐస్ తో తయారు చేసిన ఈ హోటల్ 2016 నవంబర్ నుంచి పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
హూహూహూ... హోటల్
అతి అన్ని వేళలా పనికి రాదు అని పెద్దలు అంటారు కాని అతి ఉంటే తప్ప వినోదం లేదని సదరు హోటల్ వారు తేల్చారు. స్వీడన్‌లోని జుక్కాస్జార్వీ అనే ప్రాంతంలో ఉన్న ఈ మంచు హోటల్లో అన్నీ అతిగానే ఉంటాయి. మంచు గది, మంచు మంచం, మంచు గ్లాసు, మంచు డైనింగ్ టేబుల్.... ఇంత తీవ్రమైన మంచు హోటల్లో విడిది చేస్తే ఆ మజాయే వేరు అంటున్నారు హిమ ప్రేమిక పర్యాటకులు. అందుకే ప్రతి చలికాలంలో ఈ హోటల్‌కు విపరీతమైన గిరాకీ. ఉన్న 20 గదులు చకచకా బుక్ అయిపోతాయి. చలికాలంలో ఈ ప్రాంతంలో పారే థోర్న్ నది దాదాపు గడ్డ కడుతుంది. ఆ ఐస్‌ముక్కలను అచ్చులలో పోసి అచ్చులను తొలగిస్తూ హోటల్‌ను నిర్మిస్తారు. ఇంతకు ముందు వరకు ఈ హోటల్‌ను ప్రతి ఏడాదీ మళ్లీ మళ్లీ కట్టుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే వేసవి ఎండలకు మంచు కరిగి నీరైపోక తప్పదు కదా. అయితే పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోటల్లో కొంతభాగమైనా ఏడాది పొడవునా పర్యాటకులకు అందుబాటులో ఉండేలా తాజా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. సోలార్ ప్యానెల్స్‌తో ఉత్పత్తి చేసిన విద్యుత్తుతో ఐస్ అచ్చులు కరగకుండా చూస్తున్నారు. అంతేకాదు... సోలార్ ప్యానెల్స్ కారణంగా పర్యాటకులు తమ మంచుగదుల్లో నిప్పుల కుంపటి పెట్టుకుని వెచ్చగా ఉండే ఏర్పాటు కూడా చేస్తున్నారు. వేసవి ముగిసిన వెంటనే యథావిధిగా కొత్త డిజైన్లతో గదులు, ఒక ఐస్బార్ వంటి వాటితో పూర్తి హోటల్ నిర్మాణమవుతుంది. చన్నీటి స్నానానికే భయపడిపోయేవారు ఈ హోటల్లో విడిది చేస్తే ఏమంటారు? ఇంకేమంటారు.... హూహూహూ... హాహాహా... పళ్లు టకటక.