జాతిపితమహాత్మకు మనదేశంలోనేగాక ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలతోపాటు విగ్రహాలు కూడా పెట్టుకుంటుంటారు. తాజాగా జాతిపితకు మరోఅరుదైన గౌరవం దక్కింది. కెనడాలోని ప్రముఖ హోటల్ ఒకటి మహాత్ముని ఐస్ విగ్రహాన్ని తయారు చేసింది. కెనడాలోని క్యూబెక్ సిటీలో ఉన్న ‘హోటల్ డి గ్లేస్’లో ఏర్పాటు చేసిన మహాత్ముని మంచు విగ్రహాన్ని ప్రముఖ శిల్పి మార్క్ లిపైర్ చెక్కారు. తొమ్మిది ఐస్ గడ్డలతో ఏడడుగుల మంచు విగ్రహాన్ని ఐదు గంటల్లోనే ఆయన పూర్తి చేశారు.
గాంధీ విగ్రహం తయారు చేయడం తనకెంతో సంతోషమని లిపైర్ చెప్పాడు. ఈ ఏడాది భారతదేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంగా ఈ శిల్పాన్ని ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది. టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ ఈ విగ్రహ ఫోటోలను ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ‘ఆజాదీకా అమత్‌మహోత్సవ్’ అని హ్యాష్ ట్యాగ్ క్యాప్షన్‌తో ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా హోటల్ డి గ్లేస్ అనేది కెనడా దేశంలో ఐకానిక్ హోటల్. కెనడాలోనే గాక ఉత్తర అమెరికాలో ఉన్న ఏకైక ఐస్ హోటల్ డిగ్లేస్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment