కబళించిన ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 11 మంది మహిళల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో ఘటన; నలుగురు వైద్యాధికారుల సస్పెన్షన్
దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం
బిలాస్పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం 11 మంది మహిళల ప్రాణాలను బలిగొంది. బిలాస్పూర్ పట్టణ శివార్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభుత్వం శనివారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో 83 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకోగా వారిలో 11 మంది మహిళలు ఆపరేషన్లు వికటించడంతో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. మరో 49 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ల అనంతరం మొత్తం 83 మంది మహిళలకు మందులు ఇచ్చి వైద్యులు డిశ్చార్జి చేయగా వారిలో 60 మంది 24 గంటల వ్యవధిలోనే వాంతులు, పొత్తి కడుపులో నొప్పితో ఆస్పత్రులపాలయ్యారు. తీవ్ర రక్తస్రావం వల్ల శరీరానికి గుండె తగినంత రక్తం సరఫరా చేయలేకపోవడం లేదా ఆపరేషన్ చేసిన ప్రదేశంలో ఇన్ఫెక్షన్ సోకడం వల్ల మరణాలు సంభవించి ఉండొచ్చని తెలుస్తోందని వైద్య సేవల డిప్యూటీ డెరైక్టర్ అమర్‌సింగ్ తెలిపారు. శవపరీక్షల తర్వాతే కారణాలు బయటపడతాయన్నారు. మృతులంతా 22-32 ఏళ్ల వయసులోపు వారేనన్నారు.
నలుగురు వైద్యాధికారులపై వేటు
ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఇందుకు కారణమైన నలుగురు జిల్లా వైద్యాధికారులను సస్పెండ్ చేయడంతోపాటు ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. వైద్య సేవల డెరైక్టర్‌ను బదిలీ చేసింది. ఆపరేషన్లకు నేతృత్వం వహించిన సర్జన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు సీఎం రమణ్‌సింగ్ ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు జిల్లా యంత్రాంగం తొలుత రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా సీఎం దాన్ని రూ.4 లక్షలకు పెంచారు. బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించడంతోపాటు వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ...ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రమణ్‌సింగ్‌ను ఆదేశించారు. ప్రస్తుతం మయన్మార్ పర్యటనలో ఉన్న మోదీ మంగళవారం రమణ్‌సింగ్‌తో ఈ మేరకు ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని కార్యాలయం ‘ట్వీట్’ చేసింది.
సీఎం రాజీనామా చేయాలి: కాంగ్రెస్
ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం రమణ్‌సింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి అమర్ అగర్వాల్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2011-13 మధ్య ప్రభుత్వం నిర్వహించిన కంటి ఆపరేషన్లు వికటించి 62 మంది రోగులు ఒక్కో కంట్లో చూపు కోల్పోయిన ఘటన నుంచి సర్కారు ఏమాత్రం గుణపాఠాలు నేర్చుకోలేదని తాజా ఉదంతం నిరూపిస్తోందని విమర్శించింది. ఈ సంఘటనకు నిరసనగా బుధవారం ఛత్తీస్‌గఢ్ బంద్‌కు పిలుపునిచ్చింది.