‘సినీ’ మండలి ఎన్నికల బహిష్కరణ
చెన్నై, సాక్షి ప్రతినిధి : అరవై ఏళ్ల చరిత్ర కలిగిన దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. దక్షిణాది నాలుగు భాషలకు సమ ప్రాధాన్యత నివ్వకుండా తమిళ, మలయాళ పరిశ్రమలకు ద్రోహం చేస్తున్నారంటూ ధ్వజమెత్తాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు పాతరేయడంతోపాటూ మోసపూరిత ప్రాక్సీతో అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టాయి. ఇందుకు నిరసనగా ఈనెల 27వ తేదీ జరగనున్న చాంబర్ ఎన్నికలను బహిష్కరించాలని శనివారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయా మండళ్లు నిర్ణయం తీసుకున్నాయి. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి పరిధి లో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక చిత్రపరిశ్రమలు ఉన్నాయి. రెండేళ్లకు ఒకసారి చాంబర్ ఎన్నికలను నిర్వహించి రొటేషన్ విధానంలో పదవులను పంచాల్సి ఉంది. ఇదే విధానంలో తెలుగు సినీ పరిశ్ర మ నుంచి సీ కల్యాణ్ నాలుగేళ్ల క్రితం మండలి అధ్యక్ష స్థానాన్ని పొందారు. రెండేళ్ల క్రితం మలయాళ పరిశ్రమకు పట్టం కట్టాల్సి ఉండగా ఎన్నికలను నిర్వహించకుండా కల్యాణ్ కొనసాగారు. ఎట్టకేలకు ఈనెల 27వ తేదీన ఎన్నికలకు మండలి సిద్ధమైంది.
అయితే తమ గుత్తాధిపత్యానికి ఎదురుచెప్పని వారికే పదవులను కట్టబెట్టాలనే కుట్రతోప్రాక్సీ(ప్రత్యామ్నాయ ఓటరు)ని ప్రయోగిస్తున్నారని తమిళనాడు చలన చిత్ర వాణిజ్య మండలి, మలయాళ చిత్ర మండళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలపై కోర్టుకెళ్లి స్టే తేవడమా లేక బహిష్కరించడమా అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు శనివారం చెన్నైలోని ఒక హోటల్లో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తమలోని వారే కొందరు మండలి పెద్దలతో చేతులు కలిపి అక్రమ ఎన్నికలకు సహకరిస్తున్నందున వారిని గుర్తించేందుకు వీలుగా బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కేఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు. 60 ఏళ్ల చాంబర్ చరిత్రలో ఇటువంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ ఎదురుకాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
బైలా నిబంధనలను కాలరాస్తూ 778 మంది ప్రాక్సీలను సిద్ధం చేసుకున్నారని, తాము పోటీకి పెట్టినా ఓటమి తప్పదని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రధానంగా ఐదుగురు వ్యక్తులు మండలిని శాసిస్తున్నారని, తమ స్వలాభం కోసం ప్రాక్సీని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మాభిమానాన్ని నిలుపుకునేందుకు తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మలయాళ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కౌన్సిల్, చెన్నై మలయాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమష్టిగా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈసీ సభ్యులుగా రంగంలో ఉన్న నిర్మాత అన్బాలయా ప్రభాకర్, నిర్మాత దర్శకులు ఎమ్వీ గోపాలరామ్, శ్రీమతి నాజర్ తదితరులు కూడా బహిష్కరణకు మద్దతు ప్రకటించారు.
వందేళ్ల పండుగ నిధులు స్వాహా
చెన్నైలో ఇటీవల జరిగిన వందేళ్ల భారతీయ సినిమా వేడుకలను అడ్డంపెట్టుకుని కోట్లాది రూపాయలను కొందరు పెద్దలు కాజేశారంటూ కే రాజన్ అనే తమిళ నిర్మాత కరపత్రాలను విడుదల చేశారు. మండలి పదవులు కావాలం టే సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ వద్ద చేతులు చాపాల్సిన పరిస్థితి ఉందన్నారు. తమిళులను బానిసలుగా మార్చే స్థాయి అర్హత ఎవ్వరికీ లేదని వ్యాఖ్యానించారు. తెలుగు పరిశ్రమలో ఎందరో మహానుభావులున్నా కొందరు గుం టనక్కల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.