Indirect tax collection
-
అంచనాలను మించిన పరోక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2014-2015 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల వసూళ్లు రూ. 5,46,479 కోట్ల మేర జరిగాయి. ఇది సవరించిన అంచనా మొత్తం రూ.5,42,325 కోట్లతో పోలిస్తే రూ.4,000 కోట్లు అధికం. బడ్జెట్ అంచనా మొత్తం రూ.6,24,902 కోట్లతో పోలిస్తే మాత్రం ఈ సవరించిన అంచనా మొత్తం రూ.82,577 తక్కువ. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.6.24 లక్షల కోట్ల పరోక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం సవాళ్లతో కూడుకున్న అంశమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలు సందర్భాలలో అన్నారు. తదుపరి ఆ అంచనాల్ని సవరించారు. 2013-14లోని రూ.4,97,061 కోట్ల వసూళ్లతో పోలిస్తే 2014-2015లో వసూళ్లు 9.9% మేర పెరిగాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న 4.1 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి అదనపు పన్నుల సమీకరణ తోడ్పడనుంది. ద్రవ్యలోటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3.9 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3.5 శాతానికి, 2017-18 ఆర్థిక సంవత్సరానికి 3 శాతానికి కట్టడి చేయాలని అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. -
పరోక్ష పన్ను వసూళ్లలో స్వల్ప వృద్ధి
న్యూఢిల్లీ: పరోక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2014-15, ఏప్రిల్-జూన్) 4.6 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఈ మొత్తం రూ.1.13 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.1.08 లక్షల కోట్లు. వసూళ్లు స్వల్పంగా మాత్రమే పెరగడానికి ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల వసూళ్లు క్షీణించడం, మాంద్యం కారణంతో తయారీ రంగంలో క్రియాశీలత లేకపోవడం వంటి అంశాలు కారణమని అధికార వర్గాలు తెలిపాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్యం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 25 శాతం అధికంగా (6,24,902 కోట్లు) ఉండాలని బడ్జెట్ నిర్దేశిస్తోంది. లక్ష్యంతో పోల్చితే జూన్ క్వార్టర్ వసూళ్ల స్పీడ్ చాలా తక్కువగా ఉండడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరడం సవాలేనని సీబీఈసీ చైర్పర్సన్ శాంతి సుందరం ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. క్యూ1లో విభాగాల వారీగా... ఎక్సైజ్ సుంకాల వసూళ్లలో అసలు వృద్ధిలేకపోగా 0.2 శాతం క్షీణించాయి. వసూళ్లు రూ.35,159 కోట్లు. కస్టమ్స్ సుంకాల వసూళ్లూ 3.1 శాతం క్షీణించాయి. రూ.39,549 కోట్లుగా నమోదయ్యాయి. సేవల పన్నులు మాత్రం 19.1 శాతం వృద్ధితో రూ.38,862 కోట్లుగా నమోదయ్యాయి.