పరోక్ష పన్ను వసూళ్లలో స్వల్ప వృద్ధి
న్యూఢిల్లీ: పరోక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2014-15, ఏప్రిల్-జూన్) 4.6 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఈ మొత్తం రూ.1.13 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.1.08 లక్షల కోట్లు. వసూళ్లు స్వల్పంగా మాత్రమే పెరగడానికి ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల వసూళ్లు క్షీణించడం, మాంద్యం కారణంతో తయారీ రంగంలో క్రియాశీలత లేకపోవడం వంటి అంశాలు కారణమని అధికార వర్గాలు తెలిపాయి.
2014-15 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్యం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 25 శాతం అధికంగా (6,24,902 కోట్లు) ఉండాలని బడ్జెట్ నిర్దేశిస్తోంది. లక్ష్యంతో పోల్చితే జూన్ క్వార్టర్ వసూళ్ల స్పీడ్ చాలా తక్కువగా ఉండడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరడం సవాలేనని సీబీఈసీ చైర్‌పర్సన్ శాంతి సుందరం ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.
క్యూ1లో విభాగాల వారీగా...
ఎక్సైజ్ సుంకాల వసూళ్లలో అసలు వృద్ధిలేకపోగా 0.2 శాతం క్షీణించాయి. వసూళ్లు రూ.35,159 కోట్లు.
కస్టమ్స్ సుంకాల వసూళ్లూ 3.1 శాతం క్షీణించాయి. రూ.39,549 కోట్లుగా నమోదయ్యాయి.
సేవల పన్నులు మాత్రం 19.1 శాతం వృద్ధితో రూ.38,862 కోట్లుగా నమోదయ్యాయి.