
200 రోజులవరకూ అమలు
ఆర్థిక శాఖకు డీజీటీఆర్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్ ప్రొడక్టులపై 12 శాతం రక్షణాత్మక సుంకాలను విధించమంటూ వాణిజ్య శాఖ దర్యాప్తు విభాగం ట్రేడ్ రెమిడీస్ డైరెక్టరేట్ జనరల్(డీజీటీఆర్) తాజాగా ప్రతిపాదించింది. పెరుగుతున్న దిగుమతుల నుంచి దేశీ సంస్థలకు రక్షణ కల్పించేందుకు వీలుగా 200 రోజులవరకూ సుంకాల అమలుకు సూచించింది.
ఉన్నట్టుండి ఊపందుకున్న అలాయ్, నాన్‌అలాయ్ స్టీల్ ఫ్లాట్ ప్రొడక్టుల దిగుమతులపై గతేడాది డిసెంబర్‌లో డీజీటీఆర్ దర్యాప్తు చేపట్టింది. వీటిని ఫ్యాబ్రికేషన్, పైప్ మేకింగ్, నిర్మాణం, క్యాపిటల్ గూడ్స్, ఆటో, ట్రాక్టర్లు, సైకిళ్లు, ఎలక్ట్రికల్ ప్యానెళ్లు తదితర వివిధ పరిశ్రమలలో వినియోగిస్తారు. దేశీ స్టీల్ అసోసియేషన్ ఫిర్యాదుమేరకు దర్యాప్తు నిర్వహించింది. ఈ జాబితాలో ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కోటెడ్ ప్రొడక్ట్స్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, సెయిల్ తదితర
దిగ్గజాలున్నాయి.
విలువ ఆధారితంగా..
ఇటీవల కొన్ని స్టీల్ ప్రొడక్టుల దిగుమతులు ఉన్నట్టుండి భారీగా పెరిగినట్లు దర్యాప్తులో డీజీటీఆర్ ప్రాథమికంగా గుర్తించింది. దీంతో విలువ ఆధారిత సుంకాల విధింపునకు ఈ నెల 18న నోటిఫికేషన్ ద్వారా సిఫారసు చేసింది. వెరసి 200 రోజులకు 12 శాతం ప్రొవిజనల్ సేఫ్‌గార్డ్ డ్యూటీలను విధించేందుకు ఆర్థిక శాఖకు నివేదించింది. వీటిపై ఆర్థిక శాఖ తుది నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంది.
ప్రధానంగా చైనా, జపాన్, కొరియా, వియత్నాం నుంచి దిగుమతులు పెరిగినట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల వివరాల ప్రకారం ఆయా దేశాలలో స్థానిక డిమాండుకు మించి భారీస్థాయిలో సరఫరాలు జరుగుతున్నాయి. దీంతో 2021–22లో 2.293 మిలియన్ టన్నుల ప్రొడక్టులు దిగుమతికాగా.. దర్యాప్తు జరిపిన అక్టోబర్ 2023 సెప్టెంబర్ 2024సహా గత మూడేళ్ల(2021–24)లో 6.612 మిలియన్ టన్నులకు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment