ఈ వారం వ్యవసాయ సూచనలు
అల్లం: నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచి మే నెలాఖరు వరకు అల్లం విత్తుకోవచ్చు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడటానికి ముందుగానే విత్తుకోవడం వల్ల మొక్కలు భూమిలో నిలదొక్కుకొని, తర్వాత పడే భారీ వర్షాలకు తట్టుకోగలవు. విత్తడం ఆలస్యమైతే వర్షాల వల్ల దుంపకుళ్లు వచ్చి మొలక శాతం తగ్గుతుంది.
1. ఎర్ర గరప, చల్కా నేలలు అనుకూలం. బరువైన బంకమట్టి నేలలు, నీరు నిలిచే నేలలు పనికిరావు.
2. వీ1ఎస్1-8, వీ2ఈ5-2, వీ3ఎస్1-8 అల్లం రకాలు అధిక దిగుబడినిస్తాయి. వీటిల్లో పీచు తక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతానికి మారన్, అను రకాలు అనువైనవి.
3. ఒక ఎకరానికి రకాన్ని బట్టి 600-1,000 కిలోల విత్తనం సరిపోతుంది.
భాస్వరం ఎరువుల వాడకంపై రైతులకు సూచనలు:
4. మన రాష్ట్రంలోని అధిక జిల్లాల్లోని సాగు భూముల్లో భాస్వరం లభ్యత మధ్యస్థం నుంచి ఎక్కువ శాతం ఉన్నట్లు గుర్తించారు.
5. నేలలోని భాస్వరం లభ్యత అధికంగా ఉన్నప్పుడు.. భాస్వరం ఎరువుల వాడకాన్ని తగ్గించినా పంట దిగుబడుల్లో ఎటువంటి వ్యత్యాసం కనపడలేదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
6. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలు సాగు చేసే నేలల్లో అధిక భాస్వరం ఉన్నట్లయితే భాస్వరం ఎరువుల వాడకాన్ని 25-50 శాతం వరకు తగ్గించవచ్చు.
7. నేలల్లో భాస్వరం మోతాదు పెరిగి ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు.. పైపాటుగా మరింత భాస్వరం అందించడం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా, ఇతర ధాతువులు మొక్కలకు అందకుండా పోతాయి.
8. ఫాస్ఫో బ్యాక్టీరియా అనే జీవన ఎరువు వాడడం ద్వారా నేలలో నిల్వ ఉన్న భాస్వరాన్ని మొక్కలకు అందేలా చేయవచ్చు.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్