‘క్రైమ్ అలెర్ట్’తో నేరగాళ్లకు చెక్
ఇతర రాష్ట్ర పోలీసులతో సమన్వయం
ఆయా ప్రాంతాల్లో ఇన్ఫార్మర్ నెట్వర్క్
వలస దొంగల కట్టడికి పక్కా వ్యూహం
బీహార్‌కు చెందిన సునీల్ సహానీ నేతృత్వంలోని అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్. జంట కమిషనరేట్ల పరిధిలో నెల రోజుల వ్యవధిలో వరుస స్నాచింగ్స్ చేసిన యూపీకి చెందిన బవరియా గ్యాంగ్ తన అనుచరులతో కలిసి చోరీలకు తెగబడ్డ కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన సర్దార్ పార్ధీ గ్యాంగ్ సభ్యుడు ఇళ్లల్లో చోరీలు చేస్తూ చిక్కిన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన సచిన్ గోహర్, యోగేష్ మండాలియాలు వీరే కాదు... పొరుగు రాష్ట్రాల నుంచి వస్తూ నగరంలో పంజా విసురుతున్న వ్యక్తులు, ముఠాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
సిటీబ్యూరో: ఇలాంటి వలస నేరగాళ్లకు చెక్ చెప్పడానికే నగర పోలీసులు క్రైమ్ అలెర్ట్ సిస్టం (సీఏఎస్) పేరుతో వ్యూహాత్మక వైఖరి అవలంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాకు చెందిన ముఠాలు కొన్నేళ్ల క్రితం రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ వరుసపెట్టి పంజా విసిరాయి. దాదాపు నాలుగు రాష్ట్రాల పోలీసులకు ఈ గ్యాంగ్స్ ముచ్చెమటలు పట్టించాయి. అప్పట్లో వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకున్నా... ఫలితాలు అంతంత మాత్రమే. దీంతో అంతా కలిసి ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి)కు వచ్చారు. ఆ ముఠాలు నివసించే ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులను ఆశ్రయించి, వారి సహకారంతో ఈ ముఠాలను కట్టడి చేయగలిగారు. నిత్యం నగరంలో తెగబడుతున్న అటెన్షన్ డైవర్షన్ ముఠాలు, సూడో పోలీస్ గ్యాంగ్స్, చైన్ స్నాచర్లు, దోపిడీ, చోరీ ముఠాలకు చెక్ చెప్పేందుకూ ఇలాంటి విధానాన్నే అమలు చేయాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. దీనికి క్రైమ్ అలర్ట్ సిస్టం (సీఏఎస్) అని పేరు పెట్టారు.
ఈ ప్రాంతాల నుంచే అధికం...
జ్యువెలరీ దుకాణాలు, బ్యాంకులు, వ్యాపార కేంద్రాలను టార్గెట్‌గా చేసుకుని జనాల పుట్టి ముంచే ఈ ముఠాలన్నీ బయటి ప్రాంతాల నుంచి వస్తున్నవే. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్‌లో తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉన్న రామ్జీనగర్, తిరుచ్చిలతో పాటు మహారాష్ట్రలోని పుణే, భివండి నుంచి వచ్చే ముఠాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా నగరి ముఠాలు కొన్ని నగరంలో యాక్టివ్‌గా పని చేస్తున్నాయి. ఇక, సూడో పోలీసుల విషయానికి వస్తే బెంగళూరు పరిసరాలకు చెందిన ఇరానీ గ్యాంగ్, బీదర్, గుంతకల్ నుంచి వచ్చి తమ ‘పని’ చక్కపెట్టుకుపోతున్నాయి. ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్ సహా అనేక ప్రాంతాల నుంచి వచ్చి గొలుసులు లాక్కుపోతున్న చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ సైతం ఉన్నాయి. పోలీసు రికార్డుల్లోకి ఎక్కకుండా పని చక్కపెట్టుకుపోతున్న ముఠాలు, నేరగాళ్లు ఇంకా ఎందరో ఉన్నారని పోలీసులే అంటున్నారు.
ఇక్కడ గుర్తుపట్టడం కష్టమే...
వీరంతా నగరంలోని లాడ్జీలు, శివారు ప్రాంతాల్లోని అద్దె ఇళ్లల్లో డెన్స్ ఏర్పాటు చేసుకుని టిప్‌టాప్‌గా తయారై... విద్యార్థులు, ఉద్యోగస్తుల మాదిరిగా సంచరిస్తారు. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్‌కు చెందిన ఐదారుగురు గ్యాంగ్‌గా బయటకు వచ్చి బ్యాంకులు, జ్యువెలరీ దుకాణాలు, వ్యాపార కేంద్రాల వద్ద రెక్కీ నిర్వహించి టార్గెట్‌పై పంజా విసురుతారు. చైన్ స్నాచర్లైతే వస్త్రవ్యాపారుల ముసుగులో షెల్టర్లు తీసుకుంటూ... రెండు బృందాలుగా బయటకు వచ్చి పక్కా పథకం ప్రకారం రెచ్చిపోతున్నారు. అయితే నగరంలో ఎల్లప్పుడూ వీరిపై నిఘా వేసి ఉంచడం సాధ్యం కావట్లేదు. ఒకసారి నగరంలోకి ప్రవేశించిన గ్యాంగ్ వరుసపెట్టి నేరాలు చేసి వెళ్తోంది. ఈ ముఠాలను పట్టుకోవడం, రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారిపోతోంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి నిందితుల అరెస్టుకు యత్నిస్తే పోలీసులకూ ఒక్కోసారి చావుదెబ్బలు తప్పట్లేదు. ఈ ఇబ్బందుల్ని అధిగమించడం కోసమే సీఏఎస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇదీ సీఏఎస్ స్వరూప, స్వభావాలు...
క్రిమినల్ అలర్ట్ సిస్టం (సీఏఎస్)లో నగర పోలీసులకు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల పోలీసులతో సమన్వయం కలిగి ఉండి, దొంగల అరెస్టుకు వారి సహకారం తీసుకుంటారు. ఆయా రాష్ట్రాలు, నేరగాళ్లు నివసించే ప్రాంతాల పోలీసు అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతుంటారు. అనివార్య కారణాల నేపథ్యంలో వారి ప్రాంతంలో ఉంటున్న కరుడుగట్టిన, వ్యవస్థీకృత ముఠాలను అరెస్టు చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆయా అధికారులను వారిపై ఓ కన్నేసి ఉంచాల్సిందిగా కోరతారు. అక్కడ నుంచి ఈ గ్యాంగ్స్ బయలుదేరిన వెంటనే వారి కదలికలను పసిగట్టి నగర పోలీసులను అప్రమత్తం (అలర్ట్) చేసేలా నెట్వర్క్ ఏర్పటు చేసుకోనున్నారు. తద్వారా నగర వాసులతో పాటు జ్యువెలరీ దుకాణాలు, బ్యాంకుల వారిని అప్రమత్తం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి నేరాలు నిరోధించడం, అవకాశం దొరికితే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం చేస్తారు.