అక్రమాలకు స్కానింగ్‌తో బ్రేక్!
⇒ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల అడ్డుకట్టకు చర్యలు
⇒ వాహనం నమోదు సమయంలోనే స్కానింగ్
⇒ ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక అందజేత
సాక్షి, హైదరాబాద్: వాహనం ఒక చోట. ఆర్టీఏ కార్యాలయం మరో చోట. ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసే అధికారి ఇంకో చోట. కొత్త వాహనాలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయ్యే వాహనాల్లో తర చుగా చోటుచేసుకునే నిబంధనల ఉల్లంఘన ఇదీ. ఏజెంట్లు, మధ్యవర్తులపై ఆధారపడి కార్యకలాపాలు సాగించే కొందరు ఆర్టీఏ అధికారులు వాహనాల భౌతిక స్థితిని ఏ మాత్రం పరిశీలించకుండా అక్రమ రిజిస్ట్రేష న్లకు పాల్పడుతున్నారు.
కొన్నిసార్లు డాక్యుమెంట్లను పరిశీలించకుండానే ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేస్తున్నారు. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు, బదిలీల్లో భారీగా డబ్బులు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడలో నిర్మాణ దశలో ఉన్న కొన్ని ఆయిల్ ట్యాంకర్లకు హైదరాబాద్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాహనాల అక్రమాలకు చెక్ పెట్టేందుకు వాహనాలను, వాటి ఇంజిన్, చాసిస్ నంబర్లను స్కానింగ్ చేయాలని విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది.
తెల్ల కాగితంపై ఇంజిన్ నంబర్ నమోదు
ప్రస్తుతం రవాణా శాఖ అందజేసే సేవలన్నీ ఆన్లైన్ ద్వారానే లభిస్తున్నాయి. కానీ వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో మాత్రం ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు. ఒక తెల్లకాగితంపై వాహనం ఇంజన్ నంబర్, చాసిస్ నంబర్లను పెన్సిల్(రుద్దడం ద్వారా)తో నమోదు చేస్తున్నారు. వాహనాలను ఆర్టీఏ కార్యాలయానికి తరలించకుండా ఎక్కడో ఉన్న వాటి నంబర్లను ఏజెంట్లే పెన్సిల్ ద్వారా నమోదు చేసుకుని వస్తున్నారు.
విజయవాడలో బాడీ నిర్మాణ దశలో ఉన్న ఆయిల్ ట్యాంకర్లకు అక్కడే ఇంజన్ నంబర్లు, చాసీస్ నంబర్లను పెన్సిల్‌తో కాగితంపై రుద్దుకుని తెచ్చారు. వాహనాలను పరిశీలించకుండా కేవలం ఏజెంట్లు అందజేసిన కాగితాల ఆధారంగానే కొందరు ఎంవీఐలు వాహనాలను నమోదు చేసినట్లు ఈ ఉదంతంపై ప్రభుత్వానికి నివేదిక అందజేసిన ప్రవీణ్‌రావు కమిటీ అభిప్రాయపడింది. అక్రమాలకు చెక్ పెట్టాలంటే.. తెల్లకాగితంపై పెన్సిల్‌తో రుద్దే పద్ధతిని రద్దు చేసి.. దాని స్థానంలో వాహనాల ఇంజన్ నంబర్లు, చాసీస్ నంబర్లను స్కానింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది.
నివేదికలోని అంశాలివే..
పెట్రోల్, డీజిల్ తదితర చమురు ఉత్పత్తుల సరఫరా కోసం సివిల్ సప్లైస్ విభాగం గత ఏప్రిల్‌లో ఆయిల్ ట్యాంకర్లకు టెండర్లను ఆహ్వానించింది. తమ వద్ద వాహనాలు లేక పోయినా కొందరు కాంట్రాక్టర్లు ఆఘమేఘాల మీద టెండర్లకు సన్నద్ధమయ్యారు. ఆయిల్ ట్యాంకర్లకు ఆర్డర్లు ఇచ్చారు. కానీ టెండర్ గడువు సమీపించినప్పటికీ వాహనాలు చేతికి రాలేదు. విజయవాడలో బాడీ బిల్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎలాగైనా టెండర్లలో పాల్గొనాలనే లక్ష్యంతో ఏజెంట్ల సాయంతో కొందరు మోటారు వాహన అధికా రులను, రవాణా ఉద్యోగులను తమకు అను కూలంగా మార్చుకొన్నారు. విజయవాడలో అసంపూర్తిగా ఉన్న వాహనాలకు హైదరాబా ద్లో రిజిస్ట్రేషన్లు చేశారు. కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు అనుగుణంగా డాక్యుమెంట్లను సిద్ధం చేసి ఇచ్చారు.
త్వరలో చర్యలు..
కమిటీ నివేదిక నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. త్వరలో సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరనున్నట్లు రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా.. నియంత్రించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
అసలేం జరిగింది..
నగరానికి చెందిన సుమారు 50కి పైగా ఆయిల్ ట్యాంకర్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. విజయవాడ ఆటోనగర్‌లో బాడీ బిల్డింగ్ యూనిట్లో ఉన్న వాహనాలకు హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రి యను పూర్తి చేశారు. ఈ క్రమంలో వాహ నాలను పరిశీలించకుండా, వాటి వివరాలు తెలియకుండా కొన్ని డాక్యుమెంట్ల ఆధారం గా ఈ పని చేశారు. ఏప్రిల్, మే నెలల్లో చోటు చేసుకున్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు నేతృత్వంలో గత నెలలో విచా రణ కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయి లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన కమిటీ ప్రతినిధులు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం లో 21, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో 15 ఆయిల్ ట్యాంకర్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కమిటీ గుర్తించింది. బండ్లగూడ, వికారాబాద్, ఖమ్మం ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ఇదే తరహా అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగు చూశాయి.