ఆధార్ అనుసంధానమైన రైతులకే రుణమాఫీ
ఒంగోలు టౌన్: పట్టాదారు పాస్ పుస్తకాలను ఆధార్‌తో అనుసంధానం చేయించుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. రైతులు తమ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయాల్లో ఆధార్ అనుసంధానం ప్రక్రియ త్వరితగతిన చేయించుకునేలా చూడాలన్నారు. స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సాయంత్రం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధానంలో జిల్లా వెనుకబడి ఉందని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కేవలం 50 శాతం మాత్రమే జరిగిందని, రెండు రోజుల్లో 70 శాతానికి పెంచాలని ఆదేశించారు.
ఎన్నిసార్లు చెప్పించుకుంటారు:
అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా ముందు వరుసలో ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖకు సంబంధించి వెనుకబడి ఉందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ సేవ, ఆధార్ సీడింగ్‌ల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఎన్ని సమావేశాలు పెట్టినా, ఎన్నిసార్లు చెప్పినా తహశీల్దార్లలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే విషయాన్ని పదేపదే ఎందుకు చెప్పించుకుంటారని నిలదీశారు. ప్రభుత్వ ప్రాధాన్యతాంశంగా తీసుకున్న పనిని సకాలంలో చేయకపోతే ఇబ్బందుల్లో పడతారని కలెక్టర్ హెచ్చరించారు. డివిజనల్ అధికారులు ప్రతిరోజూ ఆధార్ సీడింగ్‌పై తహశీల్దార్లతో సమీక్షించాలని ఆదేశించారు.
రేషన్ కార్డులతో ఆధార్ వందశాతం చేయాలి:
రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం గురువారం నాటికి వంద శాతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 96 శాతం అయిందని, మిగిలిన 4 శాతం కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆధార్ నంబర్ ఇవ్వడానికి సహకరించని రేషన్‌కార్డుదారులకు నిత్యావసర సరుకులు నిలిపివేయాలని ఆదేశించారు. మీ సేవ కేంద్రాల విషయంలో త్రిపురాంతకం, ఇంకొల్లు, యద్దనపూడి మండలాల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కొత్తపట్నం మండలంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములను ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులు ఆక్రమించినట్లు ఫిర్యాదులు వచ్చాయని, అలాంటివారి వివరాలను వెంటనే సబ్ డివిజనల్ పోలీసు అధికారికి అందించి నివేదిక పంపించాలని విజయకుమార్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, కందుకూరు సబ్ కలెక్టర్ ఏ మల్లికార్జున, ఒంగోలు ఆర్డీవో ఎంఎస్ మురళి తదితరులు పాల్గొన్నారు.