Inter 2nd year
-
ఇంటర్ సెకండియర్ పరీక్షలు జూన్ నెలాఖరులో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలను జూన్ నెలాఖరులో నిర్వహించేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అప్పటికి కరోనా కేసులు తగ్గుముఖం పడితే ఈ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. అప్పటికీ సాధ్యం కాకపోతే ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెట్టినట్లు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఆదివారం వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకుంది. సీబీఎస్ఈ పరీక్షలను జూలైలో నిర్వహించాలని భావిçస్తున్న రాష్ట్రాల అభిప్రాయాలను చెప్పాలని కోరింది. ఇందులో భాగంగానే విద్యాశాఖ కార్యదర్శి కేంద్రానికి రాష్ట్ర అభిప్రాయాన్ని తెలియజేశారు. జూన్ నెలాఖరులో పరీక్షలను నిర్వహించే దిశగా కసరత్తు చేస్తున్నామని తెలిజేసినట్లు సమాచారం. అప్పుడు సాధ్యం కాకపోతే ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్గా (పదో తరగతి తరహాలో) పరిగణనలోకి తీసుకొని ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్కులను ఇవ్వాలని భావిస్తున్నటు తెలియజేశారు. అవికూడా కనీసం 45 శాతం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. జాతీయ స్థాయిలో ప్రైౖ వేటు విద్యా సంస్థలు, ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందాలంటే ఇంటర్మీడియట్లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలని ఆయా విద్యా సంస్థలు అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి కనీసం 45 శాతం మార్కులిచ్చి, వాటిని సెకండియర్‌లో పరిగణనలోకి తీసుకొని తుది మార్కులను ఇవ్వనున్నారు. ఓపెన్ ఇంటర్మీడియట్‌లోనూ ఇదే విధానం అమలు చేయనున్నారు. ఒకవేళ ఆ తరువాత పరిస్థితులు అనుకూలిస్తే ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ప్రథమ సంవత్సర మార్కుల ఆధారంగా ద్వితీయ సంవత్సరంలో ఇచ్చే మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు ఇంప్రూవ్మెంట్ కింద ఆ పరీక్షలకు హాజరయ్యేలా కసరత్తు చేస్తున్నారు. ఇవే అంశాలను సుల్తానియా కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం. -
1,50,941 మంది సెకండియర్ విద్యార్థులు పాస్
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ద్వితీయ సంవత్సర విద్యార్థులందరికీ కనీస గ్రేస్ మార్కులు ఇచ్చి కంపార్ట్మెంటల్లో పాస్ చేసింది. విద్యార్థులందరినీ పాస్ చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఫలితాల ప్రాసెస్‌ను పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. మొత్తంగా 1,50,941 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో సెకండియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ప్రస్తుతం సెకండియర్ పూర్తయిన విద్యార్థులకు సంబంధించిన ఏమైనా ఫస్టియర్ బ్యాక్‌లాగ్స్ (ఫెయిలైన సబ్జెక్టులు ఉంటే) మిగిలి ఉన్నా ఆయా çసబ్జెక్టుల్లోనూ సదరు విద్యార్థులను పాస్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్ మార్కులను ఇచ్చామని వెల్లడించారు. వారంతా తమ మార్కుల వివరాలతోపాటు సవరించిన మార్కుల మెమోలను ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి బోర్డు వెబ్సైట్ నుంచి (http://tsbie.cgg.gov.in) డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. -
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు 3 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును నవంబరు 3వ తేదీకి ఇంటర్ బోర్డు పొడిగించింది. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించగా, ఇపుడు మూడోసారి కూడా పెంచింది. రూ. 100 ఆలస్య రుసుముతో వచ్చే నెల 15వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. 2015 మార్చిలో జరిగే పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులందరికీ (జనరల్, వొకేషనల్, ప్రైవేటు) ఈ మార్పు వర్తిస్తుందని బోర్డు వెల్లడించింది. -
ఇంటర్ ద్వితీయ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల
హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. బాలికలు 42.85 శాతం, బాలురు 41.96 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. తెలంగాణలో చదువుతున్న సీమాంధ్ర విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐఐటీలో ఫస్టియర్, సెకండియర్ వెయిటేజీకి కేంద్రం ఒప్పుకుందని గంటా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు 11 జాతీయ విశ్వవిద్యాలయాలు అమలయ్యాయని, వాటికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.