
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ద్వితీయ సంవత్సర విద్యార్థులందరికీ కనీస గ్రేస్ మార్కులు ఇచ్చి కంపార్ట్‌మెంటల్‌లో పాస్ చేసింది. విద్యార్థులందరినీ పాస్ చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఫలితాల ప్రాసెస్‌ను పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. మొత్తంగా 1,50,941 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో సెకండియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ప్రస్తుతం సెకండియర్ పూర్తయిన విద్యార్థులకు సంబంధించిన ఏమైనా ఫస్టియర్ బ్యాక్‌లాగ్స్ (ఫెయిలైన సబ్జెక్టులు ఉంటే) మిగిలి ఉన్నా ఆయా çసబ్జెక్టుల్లోనూ సదరు విద్యార్థులను పాస్ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్ మార్కులను ఇచ్చామని వెల్లడించారు. వారంతా తమ మార్కుల వివరాలతోపాటు సవరించిన మార్కుల మెమోలను ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి బోర్డు వెబ్‌సైట్ నుంచి (http://tsbie.cgg.gov.in) డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు.